ఈ కీలక పదవి ఎవరికిద్దాం.. TDP అధినేత చంద్రబాబు తీవ్ర కసరత్తు

ABN , First Publish Date - 2022-01-02T05:00:48+05:30 IST

ఈ కీలక పదవి ఎవరికిద్దాం.. TDP అధినేత చంద్రబాబు తీవ్ర కసరత్తు

ఈ కీలక పదవి ఎవరికిద్దాం.. TDP అధినేత చంద్రబాబు తీవ్ర కసరత్తు

  • నెల్లిమర్ల, కురుపాం బాధ్యుల కోసం అన్వేషణ 
  •  శ్రేణుల నుంచి అభిప్రాయ సేకరణ

(విజయనగరం-ఆంధ్రజ్యోతి) : జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గణనీయమైన కేడర్‌ ఉంది కానీ గడిచిన ఎన్నికల్లో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఓటమి చవిచూసింది. అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ బలీయంగా ఉన్నా.. కొన్ని స్థానాల్లో నడిపించే వారు లేరు. ప్రధానంగా నెల్లిమర్ల, కురుపాం నియోజకవర్గాల్లో సరైన నాయకత్వం లేదు. నెల్లిమర్లలో మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు వయోభారంతో బాధ పడుతుండడంతో అక్కడ నియోజకవర్గ బాధ్యుడి కోసం పార్టీ అధిష్ఠానం అన్వేషిస్తోంది. కురుపాంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు ఉన్నా ఆయన వయోభారంతో బాధ పడుతున్నారు. అక్కడ కూడా నియోజకవర్గ ఇనచార్జి కోసం అధిష్టానం వెదుకుతోంది. ఇటీవల నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి క్రియాశీల నాయకుల నుంచి అభిప్రాయ సేకరణను మంగళగిరి పార్టీ కార్యాలయంలో చేపట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున సమక్షంలో నేతల అభిప్రాయాలను సేకరించారు. ఈ సమవేశంలో వెల్లడైన అభిప్రాయాలను బట్టి సరైన వ్యక్తిని ఎంపిక చేసే పనిలో అధిష్ఠానం నిమగ్నమైంది.


నెల్లిమర్లలో పోటా పోటీ..

నెల్లిమర్ల నియోజకవర్గంలో నెల్లిమర్ల, పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ మండలాలు ఉన్నాయి. నాలుగు మండలాల్లో టీడీపీకి బలమైన కేడర్‌, మండల స్థాయి నాయకత్వం ఉంది. అక్కడ మాజీ ఎంపీపీలు పార్టీకి మూలస్తంభాలుగా ఉన్నారు. పూసపాటిరేగ మండలానికి సంబంధించి మాజీ ఎంపీపీ మహంతి చిన్నంనాయుడు, భోగాపురానికి కర్రోతు బంగార్రాజు, డెంకాడకు కంది చంద్రశేఖర్‌, నెల్లిమర్లకు సువ్వాడ వనజాక్షి ఉన్నారు. వీరంతా  ఇనచార్జి పదవి కోసం పోటీ పడుతున్నారు. వీరు జిల్లా, రాష్ట్ర కార్యవర్గాల్లో కొనసాగుతున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో ముందున్నారు. నియోజకవర్గంలో బలమైన టీడీపీ కేడర్‌ ఉండడం, ఇటీవల ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి ఇనచార్జి పదవి ఇచ్చినా అందరం కలిసి పనిచేస్తామని స్పష్టం చేస్తున్నట్టు మాత్రం తెలుస్తోంది. అధిష్టానం కేవలం నేతల అభిప్రాయాలను సేకరించింది. కొద్దిరోజుల్లో ఇనచార్జి పేరును ప్రకటించే అవకాశముంది. మరోవైపు మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు మనుమడు తారకరామనాయుడు సైతం ఇనచార్జి పదవి కోసం ప్రయత్నిస్తుండడం గమనార్హం.


 కురుపాంలో...

ప్రస్తుతం కురుపాం నియోజకవర్గ బాధ్యతలను మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు చూస్తున్నారు. వయోభారంతో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించలేకపోతున్నారు. దీంతో పార్టీ బాధ్యతలు వేరొకరికి అప్పగించాలని అధిష్టానం యోచిస్తోంది. శత్రుచర్ల రాజకీయ వారసుడిగా ఆయన మేనల్లుడు జనార్థన థాట్రాజ్‌ ఉండేవారు. ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన అకాల మరణం తరువాత శత్రుచర్ల అన్నీతానై వ్యవహరిస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో నరసింహప్రియ థాట్రాజ్‌ టీడీపీ అభ్యర్థిగా పోటీచేశారు. కానీ ఓటమి చవిచూశారు. శత్రుచర్ల సోదరుడి కోడలు పుష్పశ్రీవాణి రెండోసారి గెలుపొందారు. ప్రస్తుతం ఆమె గిరిజన సంక్షేమ శాఖ మంత్రితో పాటు డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు. ఆమెను ఢీకొట్టే సమర్థ నాయకుల కోసం టీడీపీ అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా తొలుత బీజేపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజును పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ చివరి నిమిషంలో టిక్కెట్‌ విషయంలో మొండిచేయి చూపుతారేమోనని ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అధిష్టానం టీడీపీ నేతల అభిప్రాయాలను సేకరిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మెజార్టీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. దీంతో ఇక్కడ కూడా ఆశావహుల సంఖ్య పెరిగింది. గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన జగదీశ్వరి అనే మహిళా నేత పేరు వినిపిస్తోంది. బిడ్డిక పద్మావతి, తమ్మయ్య, భూపతి దొర, కృష్ణబాబు, పల్లవి రాజులు సైతం ఇనచార్జి పదవిని ఆశిస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జనార్దన థాట్రాజ్‌ సతీమణి రమాథాట్రాజ్‌ సైతం ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె విశాఖ డీఈవో కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. 

Updated Date - 2022-01-02T05:00:48+05:30 IST