Advertisement

టెన్షన్‌.. టెన్షన్‌...

Jan 25 2021 @ 00:23AM

నేడు సుప్రీంకోర్టు తీర్పుపైనే అందరి దృష్టి

పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా?

పల్లెసీమల్లో అంతటా ఇదే చర్చ

దూరంగా అధికార యంత్రాంగం

ఎన్నికలకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే..

పోటీకి సన్నద్ధమౌతున్న రాజకీయ పార్టీలు

అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు టీడీపీ కసరత్తు

ఏకగ్రీవాలపైనే అధికార వైసీపీ దృష్టి

(కడప-ఆంధ్రజ్యోతి)

గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా.. లేదా? గ్రామాల్లో ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు జరిపి తీరాలని పట్టుదలతో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులు సహాయనిరాకరణతో పోరు ప్రశ్నార్థకమైంది. అయితే నేడు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపైనే అందరి దృష్టి ఉంది. రాజ్యాంగబద్ద సంస్థ ఎస్‌ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌కు అనుకూలంగా తీర్పు వస్తుందా? వ్యాక్సినేషన్‌ నేపధ్యంలో ఎన్నికలు సమంజసం కాదన్న ప్రభుత్వం వాదనకు ఓకే చెబుతుందా? న్యాయనిపుణుల మధ్య ఇదే చర్చ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఎన్నికలకే గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే పోరులో గెలుపు గుర్రాలను బరిలో దించేందుకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. 


నేడు తొలి విడత నోటిఫికేషన్‌ జారీ అయ్యేనా..

రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూలు ప్రకారం తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా స్థాయి రిటర్నింగ్‌ అధికారి నుంచి నోటిఫికేషన్‌ నేడు జారీ కావాలి. జిల్లా స్థాయిలో జిల్లా ఎన్నికల అధికారి, పంచాయతీలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నోటిఫికేషన్‌ జారీ చేసి నామినేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ఉంది. అయితే ఇటు ప్రభుత్వం, అటు ప్రభుత్వ ఉద్యోగుల సహాయ నిరాకరణతో పంచాయతీల వారీగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులనే నియమించలేదు. సుప్రీంకోర్టు వెలువలరించే నేటి తీర్పుపైనే ప్రభుత్వ యంత్రాంగం, సామాన్య జనం, రాజకీయ పక్షాలు దృష్టి పెట్టాయి. తీర్పు ఎలా ఉంటుందో అంటూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నాయి. తొలివిడతలో జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల్లో 11 మండలాలు, కడప రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 2 మండలాలు కలిపి 13 మండలాల్లో 220 పంచాయతీలకు నేడు తొలివిడత నోటిఫికేషన్‌ జారీ కావాల్సి ఉంది. 


పోటీకి సిద్ధమవుతున్న టీడీపీ, బీజేపీ

తొలి విడత నోటిఫికేషన్‌ జారీ కానున్న జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీకి నాయకత్వ సమస్య వేధిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు టీడీపీలో నాటి మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి హవా చాటారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరితే, ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి ఓటమి చవిచూసిన రామసుబ్బారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ టీడీపీకి బలమైన నాయకత్వ సమస్య వెంటాడుతోంది. ఒకవేళ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్డు తీర్పు అనుకూలంగా వస్తే ఈ నియోజకవర్గంలో టీడీపీ అన్ని స్థానాల్లో అభ్యర్థులను పోటీకి పెడుతుందా అన్న ప్రశ్నలు విన్పిస్తున్నాయి. కాగా అన్ని పంచాయతీలకు పోటీకి దింపేందుకు కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు లింగారెడ్డి, రాష్ట్ర పొలిట్‌బ్యూరోసభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి,  ఎమ్మెల్సీ బీటెక్‌ రవిలు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. అదే క్రమంలో బీజేపీ గెలుపు గుర్రాలను బరిలో దింపేందుకు వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తోంది. దీంతో ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియని ఉత్కంఠ వాతావరణలో పల్లెల్లో ఇప్పుడిపుడే రాజకీయ వేడి మొదలైంది. 


ఏకగ్రీవాల దిశగా వైసీపీ వ్యూహం

సుప్రీంకోర్టు ఎన్నికలకే మొగ్గు చూపి ఎన్నికలు అనివార్యమైతే అత్యధిక స్థానాల్లో ఏకగ్రీవం చేసుకునే దిశగా అధికార వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మార్చిలో నామినేషన్లతో ఆగిపోయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ అధికార బలాన్ని ఉపయోగించుకుని 50 జడ్పీటీసీ స్థానాలకు గాను 37 జడ్పీ స్థానాలు, 439 ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకోగలిగింది. పంచాయతీ ఎన్నికల్లో అదే ఒరవడి కొనసాగించి అత్యధిక స్థానాలను ఏకగ్రీవం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మండలాల వారీగా రిజర్వేషన్‌ జాబితాను ముందు పెట్టుకుని బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడమే కాకుండా, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు పోటీలో లేకుండా చేసేందుకు ఆస్త్రశసా్త్రలకు పదునుపెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని, ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికలు అనివార్యమైతే సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఏది ఎమైనా అటు ప్రతిపక్షం ఇటు పాలకపక్షంలో గ్రామ పంచాయతీ పోరు ఆసక్తిగా మారింది. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.