నేడు చెన్నై వద్ద తీరం దాటనున్న వాయుగుండం

ABN , First Publish Date - 2021-11-19T14:30:34+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం ఉదయం నగర సమీపంలో తీరం దాటనున్నట్టు వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో చెన్నై సహా 12 జిల్లాలకు ‘రెడ్‌ అలర్ట్‌’ ప్రకటించినట్టు స్థానిక వాతావరణ పరి

నేడు చెన్నై వద్ద తీరం దాటనున్న వాయుగుండం

                         - 12 జిల్లాలకు ‘రెడ్‌ అలర్ట్‌’


చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం ఉదయం నగర సమీపంలో తీరం దాటనున్నట్టు వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో చెన్నై సహా 12 జిల్లాలకు ‘రెడ్‌ అలర్ట్‌’ ప్రకటించినట్టు స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం డైరెక్టర్‌ పువియరసన్‌ తెలిపారు. గురువారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... బంగాళాఖాతంలో ఇటీవల అండమాన్‌ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం ఉదయం వాయుగుండంగా మారి నగరానికి ఈశాన్యదిశగా 260 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఆ వాయుగుండం తుపానుగా మారే అవకాశం లేదని, శుక్రవారం ఉదయం నగర సమీపాన తీరం దాటుతుందని ప్రకటించారు. దీని ప్రభావంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ భారీ వర్షం కురుస్తుందని తెలిపారు. వాయుగుండం తీరం దాటిన తర్వాత శుక్రవారం మధ్యాహ్నానికల్లా చెన్నై, సమీప జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పడుతాయని చెప్పారు. ఈశాన్య రుతపవనాల ప్రభావం, వాయుగుండం కారణంగా చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, వేలూరు, రాణిపేట, కల్లకుర్చి, విల్లుపురం, కడలూరు, సేలం జిల్లాల్లో పలు చోట్ల కుండపోతగా మరికొన్ని చోట్ల చెదురుముదురుగా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తా యని తెలిపారు. ఇదేవిధంగా పుదుచ్చేరి, కారైక్కాల్‌, డెల్టా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆయన వివరించారు. వాయుగుండం తీరం వైపు వేగంగా కదులుతుండటంతో గురువారం ఉదయం నుంచి చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, తిరువణ్ణామలై, వేలూరు తదితర జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయని తెలిపారు. ఇక శుక్రవారం తిరువణ్ణామలై, రాణిపేట, వేలూరు, తిరుపత్తూరు, కృష్ణగిరి, ధర్మపురి, ఈరోడ్‌, సేలం, తిరుప్పూరు, కోయంబత్తూరు, నామక్కల్‌ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. చెన్నై, కళ్లకుర్చి, విల్లుపురం, తిరునల్వేలి, కన్నియాకుమారి జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలు కురుస్తాయని ఆయన వివరించారు. శనివారం కృష్ణగిరి, ధర్మపురి, తిరుపత్తూరు, ఈరోడ్‌, కల్లకుర్చి, సేలం, కడలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు.


జాలర్లకు హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తీరం వైపు గంటకు 55 నుండి 65 కి.మీల వేగంతో పెనుగాలులు వీస్తాయని, అలల తాకిడి ఉధృతంగా ఉండే అవకాశమున్నందున జాలర్లు మూడు రోజులపాటు చేపలవేటకు వెళ్ళరాదని పువియరసన్‌ హెచ్చరించారు. ఇదిలా ఉండగా వాయుగుండం కారణంగా చెన్నై, కడలూరు, నాగపట్టినం, ఎన్నూరు, కాట్టుపల్లి, పదుచ్చేరి, కారైక్కాల్‌ ఓడరేవుల వద్ద మూడో నెంబర్‌ తుఫాను సూచికను ఎగురవేశారు. పాంబన్‌, తూత్తుకుడి ఓడరేవులలో ఒకటో నెంబర్‌ తుపాను సూచికను ఎగురవేశారు.


మెరీనా సందర్శనపై నిషేధం

నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటం, వాయుగుండం కారణంగా గురువారం నుంచి మూడు రోజులపాటు మెరీనాబీచ్‌లో సందర్శకుల సంచారంపై నిషేధం విధించారు. ఈ మేరకు గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌జివాల్‌ ఓ ప్రకటన జారీ చేశారు. వాయుగుండం ప్రభావం వల్ల తీరమంతటా అలలు ఉవ్వెత్తున ఎగసిపడే అవకాశ వుండటంతో ప్రజలు మెరీనాబీచ్‌ సందర్శనకు వెళ్ళకూడదని ఆయన హెచ్చరించారు.


పుళల్‌, చెంబరంబాక్కం జలాల విడుదల

గురువారం వేకువజాము నుంచి భారీగా వర్షాలు కురుస్తుండటంతో పుళల్‌, చెంబరంబాక్కం జలాశయాల నుంచి అదనపు జలాలను విడుదల చేస్తున్నారు. చెంబరంబాక్కం జలాశయం నుంచి సెకనుకు 3 వేల ఘనపుటడుగుల చొప్పున గురువారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి విడుదల చేస్తున్నారు. గత వారం రోజులుగా ఆ జలాశయం నుంచి 2 వేల ఘనపుట డుగుల జలాలను విడుదల చేశారు. పుళల్‌ జలాశయం నుంచి ఈ నెల 7వ తేదీన సెకనుకు మూడువేల ఘనపుటడుగుల చొప్పున జలాలను విడుదల చేశారు. గత మూడు రోజులుగా సెకనుకు 500 ఘనపుటడుగుల చొప్పున జలాలు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో గురువారం ఉదయం నుంచి సెకనుకు రెండు వేల ఘనపుటడుగుల చొప్పున జలాలు విడుదల చేస్తున్నారు.


24 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు

చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, రాణిపేట, విల్లుపురం, కళ్లకుర్చి, అరియలూరు, మైలాడుదురై, నాగపట్టినం, తంజావూరు, పుదుకోట, తిరువారూరు, కడలూరు, దిండుగల్‌, తేని, ధర్మపురి, పెరంబలూరు, చెంగల్పట్టు, తిరువణ్ణామలై, సేలం, తిరునల్వేలి, తూత్తుకుడి, తిరుచ్చి, కృష్ణగిరి జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు గురువారం సెలవు ప్రకటించారు.



Updated Date - 2021-11-19T14:30:34+05:30 IST