Chess Olympiad: నేడు చెస్‌ ఒలంపియాడ్‌ ముగింపు వేడుకలు

ABN , First Publish Date - 2022-08-09T14:58:43+05:30 IST

చెస్‌ ఒలంపియాడ్‌(Chess Olympiad) ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ సమీపం

Chess Olympiad: నేడు చెస్‌ ఒలంపియాడ్‌ ముగింపు వేడుకలు

                            - నెహ్రూ ఇండోర్‌ స్టేడియం ముస్తాబు


ప్యారీస్‌(చెన్నై), ఆగస్టు 8: చెస్‌ ఒలంపియాడ్‌(Chess Olympiad) ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) అధ్యక్షతన ముగింపు వేడుకలకు భారీ ఏర్పాట్లతో వేదిక ప్రాంగణం ముస్తాబైంది. 44వ అంతర్జాతీయ చదరంగ పోటీలు నిర్వహించే అవకాశం మొట్టమొదటిసారిగా భారత్‌కు దక్కింది. దాంతో ఆ పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్ఠాత్మక పోటీలకు చెంగల్పట్టు(Chengalpattu) జిల్లాలోని మహాబలిపురాన్ని ఎంపిక చేసి పోటీల నిమిత్తం వెంటనే రూ.100 కోట్లను కూడా మంజూరు చేశారు. 186 దేశాలకు చెందిన 2 వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీలను ప్రపంచదేశాల ప్రశంసలు పొందేలా విజయవంతంగా నిర్వహించారు. గత నెల 28న  సీఎం స్టాలిన్‌ అధ్యక్షతన నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరై చదరంగ పోటీలు ప్రారంభించారు. విదేశీ క్రీడాకారులు అచ్చెరువొందేలా అతిథి సత్కారాలు చేశారు.. ఇలాంటి ఏర్పాట్లు తాము పాల్గొన్న ఏ దేశంలోనూ కల్పించలేదని చెస్‌ క్రీడాకారులు రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు. కాగా, 12 రోజులు అత్యంత ఉత్సాహభరితంగా సాగిన చెస్‌ ఒలంపియాడ్‌(Chess Olympiad) ముగింపు కూడా ప్రారంభోత్సవ వేడుక లాగే ప్రభుత్వం బ్రహ్మాండంగా నిర్వహించనుంది. ఈ వేడుకల్లో భారత్‌ క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, భారత్‌ చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌, అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య చైర్మన్‌ ఆర్కడిద్వారకోవిచ్‌, ఏసియన్‌ చెస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ షేక్‌ సుల్తాన్‌, ఆలిండియా చెస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ సంజయ్‌కపూర్‌, రాష్ట్ర క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి మెయ్యనాధన్‌ సహా పలువురు ప్రముఖులు, విశిష్ట అతిథులుగా పాల్గొననున్నారు. వీరితో పాటు పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను అలరించేలా వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, విదేశీ చెస్‌ క్రీడాకారులు, ప్రముఖులను ఘనంగా ఆహ్వానించేలా మహాబలిపురం నుంచి నెహ్రూ ఇండోర్‌ స్టేడియం(Nehru Indoor Stadium) వరకు దారిపొడవునా బ్యానర్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటుచేశారు. నిజానికి ఈ ముగింపోత్సవానికి రాష్ట్రపతిని రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

Updated Date - 2022-08-09T14:58:43+05:30 IST