నేడు ప్రధానితో సీఎం స్టాలిన్‌ భేటీ

Published: Thu, 31 Mar 2022 07:45:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నేడు ప్రధానితో సీఎం స్టాలిన్‌ భేటీ

              - 2న ఢిల్లీలో డీఎంకే కార్యాలయం ప్రారంభం


చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఆయన ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించాలని, గత యేడాది సంభవించిన వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యల నిమిత్తం రూ.6వేల కోట్లకు పైగా కేటాయించాలని, రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలను త్వరగా విడుదల చేయాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. అదే విధంగా దుబాయ్‌ పర్యటనలో జరిగిన ఒప్పందాలు గురించి కూడా సీఎం ప్రధానికి వివరించనున్నారు. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాధ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌ను కూడా వేర్వేరుగా కలుసుకోనున్నారు. గురువారం రాత్రి ఢిల్లీలోనే బసచేస్తారు. ఏప్రిల్‌ ఒకటిన ఏఐసీసీ నాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, వామపక్షాల నాయకులతో భేటీ అవుతారు.  

 

ఇదిలా ఉండగా ఢిల్లీలో కొత్తగా నిర్మించిన డీఎంకే కార్యాలయం ‘అన్నా కలైంజర్‌ అరివాలయం’ను ఏప్రిల్‌ 2వ తేదీన ప్రారంభించనున్నారు. పార్టీ కార్యాలయం నిర్మాణ పనులు గతేడాది డిసెంబర్‌లో ముగిశాయి. అప్పట్లో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉండటంతో ప్రారంభోత్సవం వాయిదాపడింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ రెండున స్టాలిన్‌ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీ వామపక్షాల నాయకులు హాజరుకానున్నారు.. ఆ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధి విగ్రహాలను కూడా స్టాలిన్‌ ఆవిష్కరించనున్నారు. ఆ కార్యక్రమంలో డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌, కోశాధికారి టీఆర్‌ బాలు, డీఎంకే ఎంపీలు పాల్గొంటారు. అదే రోజు రాత్రి ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి చెన్నై చేరుకుంటారు. ఢిల్లీలో మూడు రోజులపాటు వివిధ పార్టీలకు చెందిన జాతీయ నాయకులను కలుసుకోనుండటంతో స్టాలిన్‌ పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోనుంది. ఇదిలా ఉండగా రాష్ట్ర హక్కుల సాధన కోసమే తాను ప్రధాని నరేంద్రమోదీని కలుసుకోనున్నానని స్టాలిన్‌ పార్టీ శ్రేణులకు రాసిన లేఖలో  పేర్కొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.