నేడు సంపూర్ణ Lockdown

ABN , First Publish Date - 2022-01-09T13:56:18+05:30 IST

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా, ఒమైక్రాన్‌ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు కానుంది. ఆంక్షలను ఉల్లంఘించి వీధుల్లో తిరిగే వారిపై పోలీసులు కఠిన

నేడు సంపూర్ణ Lockdown

- ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు 

- నిఘా నీడలో చెన్నై


చెన్నై: ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా, ఒమైక్రాన్‌ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు కానుంది. ఆంక్షలను ఉల్లంఘించి వీధుల్లో తిరిగే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. అదేమయంలో ప్రధాన రహదారులపై తిరిగే వాహనాలను తనిఖీ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేకంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దుల్లో వీటిని ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేయనున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా పాలు, మందుల షాపులు, పెట్రోల్‌ బంకులు పనిచేస్తాయి. అలాగే, అనుమతి ఉన్న వాహనాలు, అంబులెన్స్‌లు, పాల వ్యానులు, దినపత్రికల వాహనాలు, ఇంధన ట్యాంకర్లు, నిత్యావసర సరుకుల లారీల సహా బస్సులు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులకు వెళ్ళే ప్రయాణికుల వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. అకారణంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది.  


కిటకిటలాడిన మార్కెట్లు 

ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటిం చడంతో శనివారం అన్ని మార్కెట్లు కిటకిటలాడాయి. ముఖ్యంగా కూర గాయలు, పండ్లు, చేపలు, మాసం దుకాణాల్లో విపరీతమైన రద్దీ ఏర్పడింది. ముఖ్యంగా కోయంబేడు మార్కెట్‌, కాశిమేడు చేపల మార్కెట్‌, చింతాద్రి పేట, పట్టిణంబాక్కం చేపల మార్కెట్లకు కొనుగోలుదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఒక్క చెన్నై మహానగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడింది. సంక్రాంతి సమీపిస్తుండడంతో మున్ముందు బయట తిరిగే అవకాశం వుందోలేదోనన్న ఆందోళనతో జనం కొత్తదుస్తులు కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. దీంతో ఆయా ప్రాంతాలు వినియోగదారులతో కిక్కిరిసి కనిపించాయి.  


శుభకార్యాలకు అనుమతి

నేడు సంపూర్ణ లాక్డౌన్‌ అమలు చేస్తున్నప్పటికీ వివాహాది శుభకార్యాలకు మాత్రం వెళ్లొచ్చని రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. అయితే, వివాహాలకు వెళ్ళేవారు పెళ్ళి పత్రికలను చూపించాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే, ప్రభుత్వం అనుమతించిన సంఖ్యలోనే వివాహ కార్యక్రమాలు జరుపుకోవాలని కోరింది. 

 

కార్మికులకు ప్రత్యేక హెల్ప్‌లైన్లు

 రాష్ట్రంలో రాత్రి కర్ష్యూ, ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ సమయంలో వివిధ కర్మా గారాలు, సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్లను ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రారంభించారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ ఫోన్‌ నెంబర్లను విడుదల చేశారు. 

ఆ మేరకు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, తిరువణ్ణామలై జిల్లాలకు చెందిన కార్మికులు, పరిశ్రమల యజమానులు లాక్‌డౌన్‌ ఇబ్బందులకు సంబంధించి తమ ఫిర్యాదులను 7823928264, 9629122906, 9962993495 అనే నెంబర్లలో ప్రసాద్‌, రాజేష్‌, ఉత్తమ చోళన్‌ అనే అధికారులకు తెలుపవచ్చని స్టాలిన్‌ పేర్కొన్నారు. ఇదే విధంగా సేలం, తిరుప్పూరు, ఈరోడ్‌, కోయంబత్తూరు, మదురై, దిండుగల్‌, తిరుచ్చి, అరియలూరు, నీలగిరి, కరూరు, నామక్కల్‌, పెరంబలూరు, తేని, నాగపట్టినం, మైలాడుదురై జల్లాలకు సంబంధించి  7823928263, 7823928262 అనే నెంబర్లలో రాజవేల్‌, రాఘవ్‌ అనే అధికారులను సంప్రదించాల్సి ఉంటుందన్నారు.



Updated Date - 2022-01-09T13:56:18+05:30 IST