నేడు గణేశ నిమజ్జనం

ABN , First Publish Date - 2022-09-04T13:52:01+05:30 IST

నగరంలోని నాలుగు తీరప్రాంతాల్లో గణేశ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ శాఖ

నేడు గణేశ నిమజ్జనం

                                 - పటిష్టమైన పోలీసు భద్రత ఏర్పాటు


చెన్నై, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): నగరంలోని నాలుగు తీరప్రాంతాల్లో గణేశ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. సుమారు 20 వేలమంది పోలీసుల భద్రతతో గణేశ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్ళి వాటిని సముద్రతీరంలో నిమజ్జనం చేయనున్నారు. గత ఆగస్టు 31న నగరమంతటా వినాయకచవితి సందర్భంగా హిందూ మున్నని, విశ్వహిందూ పరిషత్‌ తదితర సంస్థల ద్వారా సుమారు మూడు వేలకు పైగా వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. గత నాలుగు రోజులుగా స్థానిక భక్తులు ఆ విగ్రహాలకు పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోనూ, సబర్బన్‌ ప్రాంతాల్లోనూ ప్రతిష్టించిన భారీ వినాయక విగ్రహాల నిమజ్జన ఊరేగింపు వేడుకలు ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకూ నిర్వహించనున్నారు. ఈ విగ్రహాలను పట్టినంపాక్కం శ్రీనివాసపురం(Srinivasapuram)ే సముద్రతీరం, కాశిమేడు సముద్రతీరం, నీలాంగరై పల్‌కళైనగర్‌ సముద్రతీరం, తిరువొత్తియూరు పాపులర్‌ వెయ్యింగ్‌ సెంటర్‌ వెనుక వైపు సముద్రతీరం వద్ద నిమజ్జనం చేయనున్నారు. ఈ నాలుగు సముద్రతీర ప్రాంతాల వద్ద శనివారం సాయంత్రం నుండి పోలీసులు విగ్రహాల నిమజ్జనం ముందస్తు ఏర్పాట్లు చేపడుతున్నారు. భారీ విగ్రహాలను సముద్రంలో నిమజ్జనం చేయడానికి అనువుగా భారీ క్రేన్‌లను కూడా సిద్ధం చేస్తున్నారు. విగ్రహాలను సులువుగా తరలించడానికి వీలుగా రైలు పట్టాల మాదిరిగా పొడవైన ఇనుప ట్రాక్‌ను కూడా నిర్మిస్తున్నారు. ఇక లారీలు, వ్యాన్‌లలో విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లేటప్పుడు పోలీసులు గస్తీ వాహనంలో వెంట వెళ్ళనున్నారు. ఇక విగ్రహాలను నిమజ్జనం చేసేటప్పుడు ఎవరైనా కడలిలో మునిగితే కాపాడేందుకు పోలీసు దళంలోని గజ ఈతగాళ్ళను కూడా రంగంలోకి దింపనున్నారు. పోలీసులు నిర్ణయించిన మార్గాల ద్వారానే వినాయక విగ్రహాల ఊరేగింపు జరగాలని, ఈ నిబంధనను అతిక్రమిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రేటర్‌ చెన్నై(Greater Chennai) పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ హెచ్చరించారు.

Updated Date - 2022-09-04T13:52:01+05:30 IST