నేడే జెండా పండగ

ABN , First Publish Date - 2022-08-15T06:22:12+05:30 IST

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. వేడుకలు జరిగే రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల మైదానాన్ని సుందరంగా ముస్తాబు చేశారు.

నేడే జెండా పండగ
అంతా సిద్ధమేనా : ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్‌లో ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో సర్వం సిద్ధం

3 వేల మంది ప్రత్యక్షంగా తిలకించేలా ఏర్పాట్లు


రాజమహేంద్రవరం అర్బన్‌/సిటీ, ఆగస్టు 14 : 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. వేడుకలు జరిగే రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల మైదానాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. సోమవారం ఉదయం 9 నుంచి మఽధ్యాహ్నం 12 గంటల వరకూ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించడానికి జిల్లా అధికారయంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సుమారు 3 వేల మంది వేడుకలను ప్రత్యక్షంగా తిలకించడానికి ఏర్పాట్లు చేశారు. కలెక్టర్‌ కె.మాధవీలత ఆధ్వర్యంలో రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేశారు. జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ప్రత్యక్ష పర్యవేక్షణలో భద్రత ఏర్పాట్లు, ట్రాఫిక్‌ మళ్లింపు, పార్కింగ్‌ తదితర పనులు చేపట్టారు. జిల్లాల పునర్విభజన ద్వారా కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరంలో తొలిసారి అధికారికంగా పంద్రాగస్టు వేడుకలు జరగబోతున్నాయి. పోలీసు, ఎన్‌సీసీ తదితర బృందాల ద్వారా మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ట్రయల్‌ వేశారు. వేడుకల్లో భాగంగా నిర్వహించే పరేడ్‌కు కమాండర్‌ డీఎస్‌పీ (కొవ్వూరు) బి.శ్రీనాథ్‌ నేతృత్వం వహిస్తారు. పరేడ్‌ ఇన్‌ఛార్జులుగా ఆర్‌ఎస్‌ఐలు లక్ష్మణస్వామి, వి.శివరామ్‌బాబు వ్యవహరించనున్నారు. ప్రభుత్వ శాఖలలో ఉత్తమ సేవలందించిన 334 మంది ఉద్యోగులను పురస్కారాలకు ఎంపిక చేశారు. జిల్లా పోలీస్‌ శాఖ నుంచి 44 మంది,  రెవెన్యూ , ఇగిరిషన్‌, నగరపాలక సంస్థ, ఆర్‌అండ్‌బీ, పంచాయితీరాజ్‌ తదితర శాఖల నుంచి 290 మంది ఉద్యోగులను ఎంపిక చేసారు. సోమవారం రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్స్‌ లో జరిగే ఉత్సవంలో పురస్కారాల ప్రదానం చేస్తారు. కలెక్టర్‌ బంగ్లాను రంగురంగుల విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఒక పక్క వర్షం పడుతున్నా ఆదివారం కలెక్టర్‌ మాధవీలత, జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగీ, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీధర్‌, కమిషనర్‌ దినేష్‌కుమార్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండులో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. వేడుకల్లో భాగంగా మొత్తం 12 శాఖల శకటాల  ప్రదర్శనతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లా ప్రగతిని ప్రదర్శించేలా  వ్యవసాయం, హార్టికల్చర్‌, ఫిషరీస్‌, మార్కెటింగ్‌, డ్వామా అండ్‌ పంచాయతీరాజ్‌, గృహ నిర్మాణం, టిడ్కో, డీఆర్‌డీఏ-మెప్మా, ఆర్‌ఎంసీ, ఐసీడీఎస్‌, విద్య (నాడు-నేడు), వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, ఆర్‌డబ్ల్యూఎస్‌, సంక్షేమం, అగ్నిమాపకశాఖ శకటాలు ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. 


 నేడు అన్ని చోట్లా స్పందన రద్దు


రాజమహేంద్రవరం, ఆగస్టు14(ఆంధ్రజ్యోతి) : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా  సోమవారం స్పందన కార్యక్రమాలు రద్దు చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ కె.మాధవీలత ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని ప్రభుత్వ కార్యా లయాల్లో స్పందన రద్దు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు కక్షిదారులు గమనిం చాలని కోరారు.జిల్లా కలెక్టరేట్‌తో పాటు, జిల్లాలోని అన్ని చోట్ల స్పందన కార్యక్రమం జరగదని తెలిపారు.ఉదయం నుంచి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉండడంతో అధికారులెవరూ అందుబాటులో ఉండరని.. అందుకే రద్దు చేసినట్టు పేర్కొన్నారు. వచ్చే సోమవారం యధావిధిగా జరుగుతుందన్నారు. 


సెంట్రల్‌ జైలు నుంచి నేడు 66 మంది ఖైదీలు విడుదల 


రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 14 : 75వ స్వాతం త్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి 66 మంది ఖైదీల విడుదలకు కేంద్రం ఆదేశాలిచ్చింది. వివిధ కేసుల్లో శిక్ష పడి సెంట్రల్‌ జైలులో శిక్ష అను భవిస్తున్న ఉన్న ఖైదీలు సత్ప్రవర్తన చెందిన వారిలో పురుష ఖైదీలు 55 మంది, 11 మంది మహిళా ఖైదీలను సోమవారం జైలు అధికారులు విడుదల చేయనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖైదీలను విడుదల చేస్తున్నట్టు జైలు సూపరింటెండెంట్‌ రాజారావు ఆదివారం తెలిపారు. వీరిలో పలు రాష్ర్టాలకు చెందిన వారు ఉన్నారన్నారు. 


Updated Date - 2022-08-15T06:22:12+05:30 IST