నేడు మినీ మహానాడు

Published: Tue, 05 Jul 2022 23:20:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నేడు మినీ మహానాడుమినీ మహానాడు కోసం సభావేదికను సిద్ధం చేస్తున్న దృశ్యం

హాజరు కానున్న చంద్రబాబు

భారీగా ఏర్పాట్లు

పసుపుమయమైన మదనపల్లె

తెలుగు తమ్ముళ్లలో హుషారు

భారీగా జన సమీకరణ


రాయచోటి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం నేడు మదనపల్లెలో జరగనుంది. కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన మహానాడు విజయవంతం అయిన నేపధ్యంలో జిల్లాల్లో మినీ మహానాడు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నేపధ్యంలో అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో బుధవారం మినీ మహానాడు జరగనుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి అమరనాథరెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అఽధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు, రాజంపేట టీడీపీ నాయకుడు గంటా నరహరి, మదనపల్లె టీడీపీ ఇన్‌చార్జ్‌ దొమ్మలపాటి రమేశ్‌లు మినీ మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంగళవారం సాయంత్రానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మదనపల్లె బైపాస్‌ రోడ్డు పక్కన సుమారు 45 ఎకరాలలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. సభాప్రాంగణంలో సభికులు కూర్చునేందుకు కుర్చీలు, అధినేత ప్రసంగాన్ని వినేందుకు లౌడ్‌స్పీకర్లు ఏర్పాట్లు చేశారు. చీకటిలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశారు. ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, డీఎస్పీ రవి మనోహారాచారి సభాస్థలిని మంగళవారం పరిశీలించారు. బందోబస్తు విషయమై నిర్వాహకులతో చర్చించారు. మినీ మహానాడు సందర్భంగా మదనపల్లెలో టీడీపీ నాయకుల ఫ్లెక్సీలతో పట్టణమంతా పసుపుమయంగా మారింది. 


భారీగా జనం వచ్చే అవకాశం

రాష్ట్రంలో రోజురోజుకు ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది. గడపగడపకు కార్యక్రమంలో వైసీపీ నేతలను నిలదీస్తున్న జనం.. బాదుడేబాదుడేలో తెలుగుదేశం పార్టీ నాయకులకు స్వాగతం పలుకుతున్నారు. ఈ నేపధ్యంలోనే గత నెలలో జరిగిన మహానాడు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించినప్పటికీ పెద్దసంఖ్యలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇదే ఊపులో పార్టీ చేపడుతున్న మినీ మహానాడు కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తెలుగుతమ్ముళ్లు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, తంబళ్ళపల్లె, మదనపల్లె నియోజకవర్గాలు ఉన్నాయి. మినీ మహానాడు కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి అధినాయకుని దృష్టిలో పడేందుకు పలువురు నాయకులు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో ఇద్దరు, అంతకు మించి నాయకులు ఉన్న చోట.. పోటీపడి మరీ జనసమీకరణ చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చే అవకాశాలు ఉండడంతో.. మినీ మహానాడుకు జనం విపరీతంగా రావచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. 


చంద్రబాబు పర్యటన వివరాలు

బుధవారం నుంచి రెండు రోజుల పాటు చంద్రబాబునాయుడు పర్యటనకు సంబంధించిన అధికారిక వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10.45 గంటలకు హైదరాబాదు నివాసం నుంచి షంషాబాద్‌ విమానాశ్రయానికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.10 గంటలకు బెంగుళూరు విమానాశ్రయం చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు మదనపల్లెకు చేరుకుని అక్కడ జరిగే మినీ మహానాడు సభలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు మదనపల్లెలో బయలుదేరి రోడ్డు మార్గాన కలికిరి హేమాచారి కల్యాణ మండపానికి రాత్రి 8 గంటలకు చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు. గురువారం రోజంతా అక్కడ జరిగే అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమావేశాల్లో పాల్గొంటారు.


మినీ మహానాడును విజయవంతం చేయండి

చినరాజప్ప, నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి

కలికిరి, జూలై 5: టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి మదనపల్లెలో బుధవారం జరిగే మినీ మహానాడును విజయవంతం చేయాలని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక కల్యాణ మండపం వద్ద చంద్రబాబు నాయుడు గురువారం నిర్వహించే రాజంపేట పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమావేశాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. మినీ మహానాడుతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమావేశాల్లో పార్టీ ప్రతినిధులు చురుగ్గా పాల్గొనాలని వారు కోరారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు విడివిడిగా జరుగుతాయని చెప్పారు. ఒక్కో నియోజకవర్గానికి ఒకటిన్నర గంట కేటాయించినట్లు వివరించారు. ఈ సందర్భంగా కల్యాణ మండపం ఆవరణలో జరుగుతున్న వివిధ రకాల ఏర్పాట్లను వారు పరిశీలించారు.


సమీక్షా సమావేశాల షెడ్యూలు

కలికిరిలో గురువారం నిర్వహించే సమీక్షా సమావేశాల షెడ్యూలును కిశోర్‌కుమార్‌ రెడ్డి వెల్లడించారు. గురువారం ఉదయం 9 గంటలకు పీలేరు నియోజకవర్గం ప్రతినిధులతో సమీక్షలు మొదలు కానున్నట్లు ఆయన తెలిపారు. ఆ తరువాత 10.30కు రాజంపేట, 12 గంటలకు రైల్వేకోడూరు, 2 గంటలకు రాయచోటి, 3.30కు తంబళ్లపల్లె, 5 గంటలకు పుంగనూరు, 7.30కు మదనపల్లె నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షలు వరుసగా జరుగుతాయని వివరించారు. ఈ షెడ్యూలుకు అనుగుణంగా సమీక్షా సమావేశాలు ఆలస్యం కాకుండా ఉండేందుకు వేర్వేరుగా రెండు వేదికలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా పోలీసులు చేయాల్సిన బందోబస్తు ఏర్పాట్లను వాల్మీకిపురం సీఐ సురేష్‌, కలికిరి ఎస్‌ఐ లోకేష్‌ రెడ్డి, ఏఎస్‌ఐ మధుసూదనాచారి పరిశీలించారు. 

నేడు మినీ మహానాడు కలికిరిలో కల్యాణ మండపం వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న చినరాజప్ప, కిశోర్‌కుమార్‌ రెడ్డి


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.