Advertisement

నేడు ‘పునర్విభజన’ ముసాయిదా.. పెరగనున్న ఖమ్మం నగరపాలక డివిజన్లు

Mar 5 2021 @ 23:49PM

ఆశావహులు, నగరవాసుల్లో విభజనపై ఉత్కంఠ 

ఖమ్మం కార్పోరేషన్‌, మార్చి 5: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తికావస్తోంది. పునర్విభజనకు సంబంధించి శనివారం ముసాయిదా విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. గతం కన్నా డివిజన్ల సంఖ్య పెరగటంతో.. ఏఏ డివిజన్లు విభజనకు గురవుతాయోనన్న ఉత్కంఠకు అందరిలోనూ కనిపిస్తోంది. ఇదిలా ఉంటే... కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావహులు.. పెరిగిన డివిజన్లకనుగుణంగా, తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం నగరంలో  50 డివిజన్లు ఉండగా. వాటిని 60కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాగా వచ్చేనెల 14వతేదీతో ఖమ్మం నగరపాలక పాలకవర్గం పదవీకాలం పూర్తవుతున్న దృష్ట్యా ఎన్నికలకు సిద్ధం కావాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ఈ నేపథ్యంలో గతనెల 24వతేదీ నుంచి డివిజన్ల పునర్విభజన ప్రారంభించాలని, అలాగే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, ఈనెల 6వ తేదీవరకు అంటే 10రోజుల్లో డివిజన్ల పునర్విభజన ముసాయిదా ప్రకటించాలని ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించారు. డివిజన్ల హద్దులను కూడా నిర్ణయిస్తున్నారు. ఇందుకు సంబంధించి నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌జయంతి ప్రత్యేక అధికారులను నియమించారు.

ప్రతీ డివిజన్‌కు 4,500మంది ఓటర్లు.

నగరపాలక సంస్థలో డివిజన్ల సంఖ్య పెరిగిన దృష్ట్యా ప్రతీ డివిజన్‌లో 4500 మంది ఓటర్లు ఉండేలా నిర్ణయించారు. దీంతో పలు డివిజన్లలో విభజన జరుగనుంది. అందుకే విభజనకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా, ఇంటి నెంబర్లను పరిశీలించి, 4,500 మంది ఓటర్లు పూర్తయిన తరువాత అక్కడ హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. గత నెలలోనే అధికారులు డివిజన్ల పునర్విభజనకు సంబంధించిన పనులు ప్రారంభించినా, డివిజన్ల హద్దులు నిర్ణయంలో తమపై ఒత్తిడి వస్తుందని రహస్యంగా ఉంచుతున్నారు. కాగా మొత్తం 12 డివిజన్లలో విభజన జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి.

వారం రోజుల పాటు సూచనలు, అభ్యంతరాల స్వీకరణ

డివిజన్ల పునర్విభజన ముసాయిదా ప్రకటించిన తరువాత ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి సూచనలు, అబ్యంతరాలను అధికారులు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించి 7, 8 తేదీల్లో అధికారులు ప్రకటన చేస్తారు. 9వ తేదీనుంచి 15వ తేదీ వరకు అంటే వారం రోజులపాటు ప్రజలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల నుంచి డివిజన్ల పునర్విభజనపై సూచనలు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం 16వ తేదీ నుంచి 21వ తేదీవరకు అంటే 6 రోజుల పాటు ఆ అభ్యంతరాలను పరిశీలించి, అవసరమైతే మార్పులు, చేర్పులు చేస్తారు. 22వ తేదీన తుది జాబితాను మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌కు పంపుతారు. అక్కడి నుంచి 23, 24 తేదీల్లో ప్రభుత్వానికి పంపి, 25వ తేదీన డివిజన్ల పునర్విభజన జాబితాను అధికారికంగా వెల్లడిస్తారు. 


Follow Us on:
Advertisement