కృష్ణతత్త్వం నేటికీ ఆచరణ యోగ్యమా?

ABN , First Publish Date - 2022-08-19T05:30:00+05:30 IST

ప్రపంచంలోని ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులు ఆశ్చర్యకరమైనవేమీ కావు. జీవితంలో ప్రస్తుతం కొన్ని సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నంత మాత్రాన ఇవన్నీ ఊహించని పరిణామాలని కూడా చెప్పలేం. నిజమే! వైరస్‌ ఉద్ధృతి, జనజీవన సమస్యలు, తీవ్రమైన..

కృష్ణతత్త్వం నేటికీ ఆచరణ యోగ్యమా?

నేడు శ్రీకృష్ణాష్టమి

అంతర్గత బలహీనతలను అర్జునుడు భగవద్గీత ద్వారా ఏ విధంగా చేధించుకోగలిగాడో, 

అదే విధంగా నేటి తరం కూడా వాటిని వదుల్చుకోవడానికి...

సమస్త  మానవాళికీ భగవద్గీత ఉపయోగపడుతుంది. 


ప్రపంచంలోని ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులు ఆశ్చర్యకరమైనవేమీ కావు. జీవితంలో ప్రస్తుతం కొన్ని సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నంత మాత్రాన ఇవన్నీ ఊహించని పరిణామాలని కూడా చెప్పలేం. నిజమే! వైరస్‌ ఉద్ధృతి, జనజీవన సమస్యలు, తీవ్రమైన పోటీ, నేలను తాకుతున్న జీడీపీ సూచికలకు తోడు అసలేం జరుగుతోందో, ఏమి జరగబోతోందో అనే ఆత్రుతలు సమాజంలో కొనసాగుతూనే వున్నాయి. కొంతమంది భావోద్వేగాలకు లోనవుతున్నారు. అయినా, ఇవేవీ ఆశ్చర్యమైనవి కావు. ఇటువంటివి గతంలోనూ సంభవించాయి, ప్రస్తుతం సంభవిస్తున్నాయి, భవిష్యత్తులోనూ సంభవిస్తూనే ఉంటాయి.


అయిదు వేల సంవత్సరాల క్రితం ఇదే తరహాలో భావోద్వేగాలకు లోనైన అర్జునుణ్ణి గురించి ‘భగవద్గీత’ చెప్పింది. అత్యంత పరాక్రమశాలి, సమస్త అస్త్ర శస్త్ర విద్యా సంపన్నుడు, రణ రంగ ధీరుడైన అంతటి అర్జునుడు సైతం కురుక్షేత్ర సంగ్రామ ఆరంభంలో... తన ముందున్న పరిస్థితిని గ్రహించిన మరుక్షణం భావోద్వేగాలకు లోనయ్యాడు. తీవ్ర ఒత్తిడితో ఒళ్ళంతా కంపించింది. చేతిలోని గాండీవాన్ని జారవిడిచి, రథంలో కుప్పకూలిపోయాడు. యుద్ధాన్ని విరమించాలనుకున్నాడు. తన నిర్ణయాన్ని సమర్థించుకొనే వాదనలు వినిపించసాగాడు. కొన్నిసార్లు ఒత్తిడిని భరించలేక, ఆచరించాల్సిన విద్యుక్త ధర్మాలను వదిలిపెట్టి, మారుమూల ప్రదేశాలకు పారిపోయేలా పరిస్థితులు ప్రేరేపిస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితి అర్జునుడంతటి యోధుడికి కూడా తప్పలేదు. 


అర్జునుడి మాటలు విన్న శ్రీకృష్ణుడు ‘‘అనార్యజుష్టమస్వర్గ్యమ్‌ అకీర్తికరమర్జున... ప్రియమైన అర్జునా! ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్త భ్రాంతి నీకు ఎలా దాపురించింది? ఇది గౌరవనీయుడైన  వ్యక్తికి తగదు. ఇది ఉత్తమ గతులకు దారి తీసేది కాకపోగా, అపకీర్తి పాలుచేస్తుంది’’ అని హితవును బోధిస్తూ... కొనసాగించిన సంభాషణే ‘భగవద్గీత’గా విశ్వవిఖ్యాతమై నిలిచింది.


అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి తన గురువుగా స్వీకరించి తన తక్షణ కర్తవ్యమేమిటో తెలుపమని వేడుకున్నాడు.


కార్పణ్యదోషో పహతస్వభావః

పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః 

యచ్ర్ఛేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే

శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నమ్‌


‘‘నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియడం లేదు. ఆందోళన, పిరికితనం నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుణ్ణి, నీకు శరణాగతుణ్ణి. నాకు నిజంగా ఏది శ్రేయస్కరమో దాన్ని ఉపదేశించు’’ అని ప్రార్థించాడు. 

జీవితంలో ఎన్నో సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలంటే, ప్రామాణిక పరంపరకు చెందిన ఆచార్యుణ్ణి ప్రతి ఒక్కరూ తమ ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించవలసిన ఆవశ్యకతను పై సందర్భం సూచిస్తుంది. అటువంటి ఆచార్యుడు కచ్చితంగా విశుద్ధ కృష్ణ భక్తుడై ఉండాలి.


భగవద్గీత విన్న అర్జునుడు దృఢ నిశ్చయుడై, మనస్సులో ఉప్పొంగిన ఉత్సాహంతో... ధనుస్సు చేతపట్టి నిలచి, వీరోచితంగా పోరాడాడు. విజయాన్ని సాధించాడు. 


అర్జునుణ్ణి తన కర్తవ్యం వైపు నడిపించేలా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినదేమిటి? 

భగవద్గీతలో శ్రీకృష్ణుడు అస్త్ర శస్త్రాల గురించి గానీ, యుద్ధ నైపుణ్యాల గురించి గానీ ప్రస్తావించలేదు. మన నైపుణ్యాలు, నేర్పరితనం లాంటివేవీ... మన జీవితంలో ఎదురయ్యే ఆత్రుత, ఆవేదనల నుంచి మనల్ని కచ్చితంగా రక్షించగలవని చెప్పలేమనడానికి ఇదే నిదర్శనం. అర్జునుడికి కృష్ణుడు ఉపదేశించింది... జీవిత సత్యాల గురించి. తద్వారా, ఉన్నత జీవన విధానాల పట్ల అర్జునునికి ఉన్న అపోహలను కృష్ణుడు మార్చేశాడు.


‘‘ఈ దేహం మనం కాదు, మనమంతా ఆత్మ స్వరూపులం..’’ అంటూ మానవ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో జీవుని నిజమైన స్వరూపాన్ని గురించి వివరించాడు. సమస్త జీవులు ఆధ్యాత్మిక స్వరూపాలని, అయితే ప్రస్తుతం ఈ భౌతిక దేహంలో బంధితులై జీవిస్తున్నారన్న సత్యాన్ని బోధించాడు. 


దేహినోస్మిన్‌ యథా దేహే కౌమారం యౌవనం జరా

తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి


‘‘ఏ విధంగానయితే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యౌవనం, వార్థక్యాల ద్వారా సాగిపోతుందో, అదే విధంగా మరణ సమయంలో, జీవాత్మ మరో దేహం (శరీరం) లోనికి ప్రవేశిస్తుంది. ధీరుడైన వాడు ఈ విషయంలో మోహం చెందడు’’ అన్నాడు. 

కనుక కేవలం ఈ భౌతిక దేహం, భౌతిక జీవనానికి సంబంధించిన నైపుణ్య, ప్రావీణ్యతల మీద మాత్రమే మనం దృష్టి సారిస్తే సరిపోదు. ఆత్మ స్వరూపులమైన మనం ఉన్నతమైన ఆనందం, జ్ఞానం, శాశ్వత జీవనం కోసం పరితపించడం సహజం. కానీ, ఈ భౌతిక ప్రపంచం వాటిని అందివ్వలేదు.


భగవద్గీతను విన్న అర్జునుడు... శ్రీకృష్ణుడే సర్వకారణ కారణుడని, పరమ సత్యమని, దేవాదిదేవుడని గ్రహించి సంపూర్ణ శరణాగతి చేశాడు:


పరం బ్రహ్మ పరం దామ పవిత్రం పరమం భవాన్‌

పురుషం శాశ్వతం దివ్యమ్‌ ఆదిదేవ మజం విభుమ్‌

ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా

అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే

‘‘నీవే పరబ్రహ్మానివి, పరంధాముడివి, సర్వోన్నతమైన వాడివి, పవిత్రత కలిగించేవాడివి, నిత్య సనాతనుడైన భగవంతుడివి, ఆది పురుషుడివి, జన్మ రహితుడివి, అత్యున్నతుడవు. మహర్షులైన నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు లాంటి వారు ఇది చాటి చెప్పారు, ఇప్పుడు స్వయంగా నీవే నాకు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నావు’’ అన్నాడు అర్జునుడు.


భగవద్గీతను పఠించిన తర్వాత అర్జునుడిలా ప్రతి ఒక్కరూ పై విధంగా నిర్ధారణకు వచ్చినప్పుడే వారి గీతాపఠనం సంపూర్ణమైనదని అర్థం. అంతేగాక, ప్రతిజీవి తాను ఏ విధంగా శ్రీకృష్ణునితో సంబంధం కలిగి ఉన్నదీ కూడా గుర్తించగలుగుతారు.


మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః

మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి


‘‘భౌతిక జగత్తులోని జీవాత్మలు నా సనాతనమైన అంశలే. కానీ, భౌతిక శక్తి ద్వారా బంధితులై, మనస్సుతో కలిపి ఉన్న ఆరు ఇంద్రియాలతో వారు ప్రయాస పడుతున్నారు’’ అని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా ఆ భగవంతుణ్ణి సేవించడమే ప్రతి జీవాత్మ తాలూకు కర్తవ్యం. కనుక, భగవద్గీత జీవన పోరాటం నుంచి పలాయనం చిత్తగించాలని బోధించదు. శ్రీకృష్ణుణ్ణి శరణువేడి జీవన పోరాటాన్ని కొనసాగించాలని ప్రోత్సహిస్తుంది.


అప్పటి పరిస్థితులతో పోల్చితే కచ్చితంగా నేటి పరిస్థితులు ఎంతో మార్పు చెందాయనేది స్పష్టంగానే కనిపిస్తుంది. అయితే, అర్జునుడు పొందిన భావోద్వేగ స్థితిని...  ప్రస్తుత పరిస్థితులతో పోల్చినప్పుడు. వ్యక్తులు అంతర్గతంగా ఏ మార్పూ చెందలేదని తెలుస్తుంది. కేవలం బాహ్యంగా మాత్రమే మానవుడు మార్పు చెందాడు. వాస్తవానికి, ఆత్రుత, ఆవేదనలు నేటి సమాజంలో అప్పటికన్నా మరిన్ని రెట్లు అధికంగా... అపాయకర స్థితికి చేరాయి. ఇటువంటి పరిస్థితుల్లో భగవద్గీత కూడా కచ్చితంగా ఆవశ్యకమైనదే. అంతర్గత బలహీనతలను అర్జునుడు భగవద్గీత ద్వారా ఏ విధంగా చేధించుకోగలిగాడో, అదే విధంగా నేటి తరం కూడా వాటిని వదుల్చుకోవడానికి... సమస్త మానవాళికీ భగవద్గీత ఉపయోగపడుతుంది. 


పవిత్ర శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రతిఒక్కరూ భగవద్గీతను పఠించాలి. తమ జీవితాలను శాంతి, సౌభాగ్యాలతో వర్థిల్లేలా తీర్చిదిద్దుకోవాలి. అయిదేళ్ళ బాల్యం నుంచే పిల్లలకు భగవద్గీతలోని బోధనలను నేర్పిస్తే... అది వారు విలువలతో కూడిన, సంస్కారవంతులైన పౌరులుగా ఎదగడానికి దోహదపడుతుంది. భగవద్గీత, శ్రీకృష్ణుని శరణాగతి జీవితంలో ఎటువంటి పరిస్థితిలోనైనా చక్కగా వ్యవహరించగల మనోధైర్యాన్ని అనుగ్రహిస్తాయి.


సత్యగౌర చంద్రదాస ప్రభూజీ,

అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్‌,

హైదరాబాద్‌, 9396956984  

Updated Date - 2022-08-19T05:30:00+05:30 IST