తిరునగరి ప్రస్థానంలో చారిత్రాత్మక ఘట్టం

ABN , First Publish Date - 2022-08-15T08:15:42+05:30 IST

తిరుపతి ప్రస్థానంలో సోమవారం జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవం చారిత్రాత్మక ఘట్టం కానుంది.

తిరునగరి ప్రస్థానంలో చారిత్రాత్మక ఘట్టం

తిరుపతి జిల్లాలో నేడే తొలి జెండా పండుగ

ఇంకోవైపు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సందడి

స్వాతంత్య్ర దినోత్సవానికి ప్రతిష్టాత్మకంగా  ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం


తిరుపతి ప్రస్థానంలో సోమవారం జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవం చారిత్రాత్మక ఘట్టం కానుంది. ఒకే రోజు రెండు విశేష సందర్భాలు కలసి వచ్చాయి. ఒకటి దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌.. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ వేడుకలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో తిరుపతి కేంద్రంగా జిల్లా ఏర్పాటయ్యాక తొలిసారి జిల్లా స్థాయి స్వాతంత్య్ర దిన వేడుకలు జరగనున్నాయి. దాంతో జిల్లా అధికార యంత్రాంగం సైతం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. 


తిరుపతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): తిరుపతి ప్రత్యేకత ఈనాటిది కాదు. సుమారు క్రీస్తు శకం 3వ శతాబ్ది నుంచి తిరుపతికి పౌరాణికంగా, ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా ఘనమైన నేపథ్యముంది. కాలం గడిచేకొద్దీ అనేక మైలురాళ్లను అధిగమించి ఇపుడున్న స్థితికి చేరుకుంది. జనావాసంగా కుగ్రామం నుంచి అంతకంతకూ స్థాయి పెంచుకుంటూ 1886 ఏప్రిల్‌ ఒకటి నాటికే మున్సిపల్‌ పట్టణంగా మారింది. ఆపై 1962 అక్టోబరు ఒకటి నాటికి సెకండ్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా, 1965 డిసెంబరు 12న ఫస్ట్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా, 1970 ఫిబ్రవరి 13న స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా, 1998 అక్టోబరు 7న సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా ఎదిగిన తిరుపతి పట్టణం చివరికి 2007 మార్చి 2 నాటికి మున్సిపల్‌ కార్పొరేషన్‌స్థాయి అందుకుని నగరంగా ఆవిర్భవించింది. అయితే తిరుపతి అభివృద్ధి పరుగు అంతటితో ఆగిపోలేదు. తర్వాత పదిహేనేళ్ల ప్రస్థానంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 4న మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఈ పర్యాయం జిల్లా కేంద్రంగా అవతరించింది. చిత్తూరు జిల్లా నుంచి చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు సెగ్మెంట్లు పూర్తిగానూ, నగరి పాక్షికంగానూ, నెల్లూరు జిల్లా నుంచి గూడూరు, సూళ్లూరుపేట సెగ్మెంట్లు పూర్తిగానూ, వెంకటగిరి పాక్షికంగానూ తిరుపతి జిల్లాలో చేరిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో సోమవారం తిరుపతిలో జిల్లా స్థాయి స్వాతంత్య్ర దిన వేడుకలు తొలిసారి జరగనున్నాయి. 


వేడుకలకు వేదికైన పోలీస్‌ పరేడ్‌ మైదానం

తిరుపతి జిల్లాలో తొలిసారిగా జరుగుతున్న జెండా పండుగకు ఎంఆర్‌పల్లెలోని పోలీస్‌ పరేడ్‌ మైదానం వేదికైంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి హోదాలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని తొమ్మిది గంటలకు ఆవిష్కరించనున్నారు. 9.05గంటలకు గౌరవ వందనం, పరేడ్‌గ్రౌండ్‌ సందర్శన, 9.15 గంటలకు ముఖ్య అతిథి సందేశం, 9.45గంటలకు వివిధశాఖల ప్రగతి వాహనాల ప్రదర్శన, 10గంటలకు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, 10.30గంటలకు ప్రశంసా పత్రాల ప్రదానం, 11గంటలకు వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ సందర్శన, 11.30గంటలకు జాతీయ గీతాలాపన ఉంటుంది. కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రజాప్రతినిధులు, న్యాయకోవిదులు, ప్రజలు, అధికారులు, స్వచ్చంధ సంస్థలు హాజరై వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. అలాగే టీటీడీ పరిపాలనా భవనం వద్ద, నగరపాలక సంస్థ, తుడా, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ స్వాతంత్ర దిన వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. 

Updated Date - 2022-08-15T08:15:42+05:30 IST