నేడు జగన్నాథ రథయాత్ర

ABN , First Publish Date - 2022-07-01T06:39:17+05:30 IST

జిల్లా కేంద్రం అనకాపల్లిలో సుభద్ర బలభద్ర సమేత జగన్నాథస్వామి రథయాత్ర శుక్రవారం జరగనుంది. ఇందుకు సంబంధించి ఆలయ ఈవో జీవీ రమాభాయి విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం 10.30 గంటలకు తొలి రథాయాత్ర ప్రారంభం కానుంది.

నేడు జగన్నాథ రథయాత్ర
స్వామివారు అధిష్ఠించనున్న రథం

  గవరపాలెం అగ్గిమర్రిచెట్టు వద్ద స్వామి ఆలయం నుంచి ప్రారంభం

 ఉదయం నుంచి ఊరేగింపు .. రాత్రికి గుడ్స్‌షెడ్‌ వద్ద గల ఇంద్రజ్యమ్నహాల్‌కు చేరిక 

  భారీ ఏర్పాట్లు చేపట్టిన నిర్వాహకులు 8 పోలీసులు గట్టిబందోబస్తు

అనకాపల్లిటౌన్‌, జూన్‌ 30 : జిల్లా కేంద్రం అనకాపల్లిలో సుభద్ర బలభద్ర సమేత జగన్నాథస్వామి రథయాత్ర శుక్రవారం జరగనుంది. ఇందుకు సంబంధించి ఆలయ ఈవో జీవీ రమాభాయి విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం 10.30 గంటలకు తొలి రథాయాత్ర ప్రారంభం కానుంది. ముఖ్యఅతిథులుగా పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు హాజరుకానున్నారు. స్వామివారికి ఆలయ అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను అందంగా తీర్చిదిద్దబడిన రథంపై ఏర్పాటుచేస్తారు. అనంతరం రథోత్సవాన్ని ముఖ్యఅతిథులు ప్రారంభిస్తారు. గవరపాలెం అగ్గిమర్రిచెట్టు వద్ద గల జగన్నాథ ఆలయం నుంచి గవరపాలెం పురవీధుల గుండా రథాయాత్ర సాగుతుంది. సాయంత్రానికి చిననాలుగురోడ్ల జంక్షన్‌కు చేరుకున్న తరువాత స్టేషన్‌రోడ్డు, మళ్ల వీధి మీదుగా గుడ్స్‌షెడ్‌ వద్ద గల ఇంద్రజ్యమ్నహాల్‌కు రాత్రికి చేరుకుంటుంది. అక్కడ ఉత్సవమూర్తులను రథం పైనుంచి దించి ఇంద్రజ్యమ్నహాల్‌లో అలంకరిస్తారు. తొలిరోజు రాత్రి జగన్నాథస్వామి మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ పోలీసులు, ట్రాఫిక్‌ పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.  ఇదిలావుండగా, రథయాత్రకు బందోబస్తు కల్పించాలని డీఎస్పీ బి.సునీల్‌కు ఆలయ ఈవో జీవీ రమాభాయి, వైసీపీ నేతలు దాడి జయవీర్‌, పీలా రాంబాబు, పీలా శ్యామ్‌, ఆలయ మాజీ చైర్మన్‌ దాడి ఈశ్వరరావు గురువారం కోరారు. అలాగే, గవరపాలెం జగన్నాథస్వామి ఆలయంలో గురువారం రాత్రి రుక్ష్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కల్యాణాన్ని కన్నులపండువుగా జరిపారు.  ఆలయ అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ, శ్రీవారి ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ఈ వేడుక సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T06:39:17+05:30 IST