నేడే కొమురవెల్లి మల్లన్న పట్నం వారం

ABN , First Publish Date - 2021-01-17T05:55:13+05:30 IST

పట్నంవారాన్ని పుర్సకరించుకుని కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

నేడే కొమురవెల్లి మల్లన్న పట్నం వారం
దూళి దర్శనం కోసం మల్లన్నకు ఒడిబియ్యం తీసుకువస్తున్న భక్తులు

చేర్యాల, జనవరి 16: పట్నం వారాన్ని పుర్సకరించుకుని కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇటీవల నిర్వహించిన మల్లన్న కల్యాణంతో బ్రహ్మోత్సవాలు వేభవంగా ప్రారంభయ్యాయి. సంక్రాంతి పర్వదినం అనంతరం వచ్చే మొదటి ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తుంటారు. ఈ వారం హైదరాబాదుకు చెందిన వేలాదిమంది భక్తులు కుటుంబాలతో కలిసి కొమురవెల్లికి తరలివస్తారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రానికే భక్తులు ఆర్టీసీ బస్సులు, పైవ్రేటు వాహనాల్లో కొమురవెల్లికి చేరుకున్నారు. స్వామివారిని ధూళి దర్శనం చేసుకుని ఒడిబియ్యాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. నేడు మల్లన్నకు బోనాలు, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఎల్లమ్మకు బోనాలు నివేదించనున్నారు. రేపు తోటబావి ప్రాంగణంలో హైదరాబాద్‌ యాదవ సంఘం ఆధ్వర్యంలో పెద్ధపట్నం, అగ్నిగుండాలు నిర్వహించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ రాజగోపురం ఆవరణలో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. స్నానాల కోసం తోటబావి, కోడెల స్తంభం, మల్లన్న చెరువు సమీపంలో ఏర్పాట్లు చేశారు. మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌ నేతృత్వంలో 8 మంది సీఐలు, 24 మంది ఎస్‌ఐలు, 24 మంది ఏఎ్‌సఐ, హెడ్‌ కానిస్టేబుళ్లు, 144 మంది కానిస్టేబుళ్లు, 49 మంది హోంగార్డులు, 27 బీడీ టీమ్స్‌తో పటిష్ట బందోస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు ఈవో బాలాజీ తెలియజేశారు.


ఆలయ స్టోర్‌లో పునరుద్ధరణ కమిటీ సభ్యుల తనిఖీ

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ స్టోర్‌లో బియ్యం, శనగపప్పును అక్రమంగా నిల్వచేశారన్న సమాచారం మేరకు శనివారం ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సభ్యులు దువ్వల మల్లయ్య, వజ్రోజు శంకరాచారి, బుస్స శ్రీనివాస్‌, జడ్పీటీసీ సిలివేరి సిద్దప్ప, గీస భిక్షపతి, ముత్యం నర్సింహులు తదితరులు తనిఖీలు చేశారు. అన్నదానం నిమిత్తం భక్తులు విరాళంగా అందించిన బియ్యంతో పాటు ఒడిబియ్యం 23.50 క్వింటాళ్లమేర నిల్వ ఉంచినట్లు గుర్తించారు. అక్రమంగా నిల్వ చేసిన 1.10 కిలోల శనగపప్పు పురుగుపట్టి పాడైపోయినట్లు గుర్తించారు. స్టోర్‌రూంలోని నిల్వలు, రికార్డులను పరిశీలించారు. విరాళాలకు రసీదులు లేకపోవడం, ఎంట్రీలో తేడా ఉండటాన్ని గుర్తించి లాక్‌డౌన్‌ నుంచి స్టార్‌ విభాగంలో పనిచేసిన ఉద్యోగులను విచారించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈవో బాలాజీకి సూచించారు. 


ప్రత్యే దర్శన టికెట్ల రీసైక్లింగ్‌.. పట్టుబడిన బ్యాంకు సిబ్బంది

మల్లన్న ఆలయ ప్రత్యే దర్శన టికెటన్ల రీసైక్లింగ్‌కు పాల్పడిన ఇద్దరు సిద్దిపేట హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు సిబ్బందిని శనివారం రాత్రి ఆలయ అధికారులు పట్టుకున్నారు. పట్నం వారం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చిన క్రమంలో ఈవో బాలాజీ శనివారం రాత్రి ప్రత్యేక దర్శన క్యూలైన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ భక్తుడు టికెట్ల రీసైక్లింగ్‌ విషయంపై ఈవోకు ఫిర్యాదు చేయగా.. కౌంటర్‌ తనిఖీ చేసి రెండోసారి అమ్ముతున్న టికెట్లతో పాటు రూ. 9,200 వేల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు సమాచారమివ్వడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేర్యాల సీఐ తెలిపారు.

Updated Date - 2021-01-17T05:55:13+05:30 IST