నేడు లక్ష ప్రాంతాల్లో మెగా వ్యాక్సిన్‌ శిబిరాలు

ABN , First Publish Date - 2022-07-10T13:17:28+05:30 IST

కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మెగా వ్యాక్సిన్‌ శిబిరాలు సుమారు లక్ష ప్రాంతాల్లో జరుగనున్నాయి.

నేడు లక్ష ప్రాంతాల్లో మెగా వ్యాక్సిన్‌ శిబిరాలు

ప్యారీస్‌(చెన్నై), జూలై 9: కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మెగా వ్యాక్సిన్‌ శిబిరాలు సుమారు లక్ష ప్రాంతాల్లో జరుగనున్నాయి. ఇందులో రెండో డోస్‌, బూస్టర్‌ డోస్‌ వేయించుకొనే వారికి ప్రాధాన్యం కల్పించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం 12 ఏళ్లకు పైబడిన అందరికీ రెండో డోస్‌ టీకాలు వేస్తున్నారు. రెండు డోస్‌లు వేసుకొని ఆరు నెలలు పూర్తయిన వారికి బూస్టర్‌ డోస్‌ వేసే పనులు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు చేపట్టాయి. ముందుగా రాష్ట్రంలో అందరికీ రెండు డోస్‌ల టీకాలు వేసే విధంగా శనివారాల్లో 50 వేల ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఆ తర్వాత లక్ష ప్రాంతాల్లో ప్రత్యేక కరోనా టీకా శిబిరాల నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు గత మే 8, జూన్‌ 12వ తేదీల్లో అన్ని జిల్లాల్లో శిబిరాలు నిర్వహించిన నేపథ్యంలో, 31వ ప్రత్యేక టీకా శిబిరం ఆదివారం లక్ష ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ శిబిరాలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆరోగ్యశాఖ ప్రజలకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 11.45 కోట్ల టీకాలు వేశామని, మొదటి డోస్‌ వేయించుకోనివారు, నిర్ణీత కాలంలో రెండో డోస్‌ టీకా వేయించుకోనివారు, రెండు డోస్‌లు వేయించుకొని ఆరు నెలలు పూర్తయి బూస్టర్‌ డోస్‌ వేసుకోని వారు అని సుమారు 1.45 కోట్ల మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఆదివారం బక్రీద్‌ పండుగ రోజు టీకా శిబిరాల్లో విధుల్లో పాల్గొనే ఆరోగ్యశాఖ సిబ్బందికి వచ్చే సోమవారం సెలవు ప్రకటించారు.


1,600 ఆరోగ్య కమిటీలు

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) పరిధిలోని 200 వార్డుల్లో ఒక వార్డులో 17 ప్రాంతాల్లో టీకా శిబిరాలు పనిచేయనున్నాయి. వీటితో పాటు 16 మొబైల్‌ టీకా శిబిరాలు  వినియోగించనున్నారు. ఒక్కో వార్డులో 8 ఆరోగ్య కమిటీలు చొప్పున 200 వార్డులకు 1,600 కమిటీలు విధుల్లో పాల్గొననున్నాయి. ఇప్పటివరకు టీకాలు వేయించుకోని వారి వివరాలు ఆరోగ్యశాఖ సిబ్బంది వద్ద ఉన్నందువల్ల, వారు ఆయా ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల వద్దకే వెళ్లి టీకాలు అందించనున్నారు. మొదటి డోస్‌ టీకా వేయించుకోని జిల్లాల్లో రాణిపేట ప్రథమస్థానంలో, కన్నియాకుమారి ద్వితీయ స్థానంలో, తేని తృతీయ స్థానంలో ఉన్నాయి. చెన్నై, కోవై, తిరుప్పూర్‌, పుదుకోట, కరూర్‌, సేలం, తిరువళ్లూర్‌, విల్లుపురం, తంజావూరు, రామనాఽథపురం, శివగంగ, తెన్‌కాశి జిల్లాల్లో 95 శాతం మంది మొదటి డోస్‌ వేసుకున్నారని అధికారులు తెలిపారు.

Updated Date - 2022-07-10T13:17:28+05:30 IST