Advertisement

నేడే పరిషత్‌ పోరు

Apr 8 2021 @ 00:35AM

  1. గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌
  2. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌
  3. దుందుడుకు చర్యలకు వైసీపీ పన్నాగాలు?
  4. చివరిరోజు ప్రచారంలో పలుచోట్ల టీడీపీ సందడి

కర్నూలు, ఆంధ్రజ్యోతి: పరిషత్‌ పోరుకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ బుధవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో యథాతథంగా గురు వారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ జరగనుంది. అయితే ఫలితాలు వెల్లడించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యాహ్నం తర్వాత అధికారులు ఎన్నికల సామగ్రిని హుటా హుటిన పంపిణీ చేశారు. పార్టీ నిర్ణయా నికి అతీతంగా ఎమ్మిగనూరు, ఆలూరు, కోడుమూరు, ఆళ్లగడ్డ తదితర చోట్ల టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రచారంలో చివరి రోజైన మంగళవారం పలు చోట్ల టీడీపీ ప్రచార సందడి కనిపించింది. ఆది నుంచి వైసీపీ అరకొర ప్రచారానికే పరిమి తమైంది. పోలింగ్‌ రోజు దుందుడుకు చర్యలకు దిగవచ్చని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆత్మకూరు, నందికొ ట్కూరు, కోడుమూరు, పత్తికొండ తదితర చోట్ల అధికారుల ఒత్తిళ్లు, నాయకుల వేధింపుల మధ్య ఓటింగ్‌ జరగవచ్చని విపక్ష నాయకులు చెబుతున్నారు. 


ఆ ఇద్దరి మధ్య విభేదాలు

 నందికొట్కూరు వైసీపీ నాయకులు జడ్పీ ఎన్నికల్లోనూ తమ పంథాను వీడలేదు. టీడీపీ నాయకులను తన వర్గంలో చేర్చుకునేందుకు ఎమ్మెల్యే ఆర్థర్‌ పోటీ పడుతుండగా, సిద్ధార్థరెడ్డి మాత్రం తన వర్గానికి అధిక స్థానాలు దక్కించుకునే పనిలో పడ్డారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల మాదిరిగానే ఆ నాయకులు జడ్పీ ఎన్నికల్లోనూ మండలాలు పంచుకున్నారు. ఆరు మండలాలు ఉండగా.. 2 మండలాలు ఎమ్మెల్యే, 4 మండలాలు సిద్ధార్థరెడ్డి పంచుకున్నారు. ఎమ్మెల్యే వర్గానికి వ్యతిరేకంగా మున్సిపల్‌ ఎన్నికల్లో రెబల్స్‌ను నిలబెట్టారనే ఆరోపణలు సిద్ధార్థరెడ్డిపై ఉన్నాయి. ఈ ఎన్నికల్లోనూ ఇదేరీతిన అభ్యర్థులను పోటీలో నిలబెట్టారని తెలుస్తోంది. 


ఇక్కడ ఉండి అక్కడ మద్దతు

జిల్లాలో పలు చోట్ల టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అభ్యర్థులు చావో రేవో అన్న రీతిన పోటీలో ఉన్నారు. కర్నూలు రూరల్‌, కోడు మూరు నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటామని టీడీపీ అంచనా. కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌, హర్షవర్ధన్‌ రెడ్డి మధ్య వర్గపోరు కొనసాగుతోంది. హర్షకు సహకరించొద్దని ఎమ్మెల్యే నేరుగా లద్దగిరిలో కోట్ల కుటుంబానికి చెందిన ఓ మండలస్థాయి మాజీ ప్రజాప్రతినిధి సతీమణితో ఫోన్లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఆమె మాత్రం టీడీపీలో ఉంటూనే వైసీపీకి ఓట్లు వేయాలని చెబుతున్నట్లుగా సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా అభ్యర్థుల్ని నిలబెట్టి విజయం సాధించిన కోట్ల చక్రపాణిరెడ్డి ఈ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలవడం ఆ పార్టీకి  కలిసొచ్చే అంశం. ఇందులో భాగంగానే సోమవారం నుంచి లద్దగిరిలో హోరాహోరి ప్రచారం చేశారు. కానీ టీడీపీ మాటున ఉంటూ పక్క పార్టీకి ఓట్లేయాలంటున్న ఆ మహిళ పట్ల స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ అంశంపై స్థానిక నాయకులు కొందరు కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తిరుపతి ఉప ఎన్నికల బాధ్యతలో ఉన్నందున తిరిగి వచ్చాక ఆ వ్యవహారంపై దృష్టి సారిస్తారని నాయకులు చర్చించుకుంటున్నారు. 


పకడ్బందీ ఏర్పాట్లు

పోలింగ్‌ నిర్వహణలో భాగంగా 44 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, 44 మంది ఎస్‌ఎస్‌టీ బృందాలు, 341 మంది వీడియోగ్రాఫర్లను ఏర్పాటు చేశారు. 44 మంది ఆర్వోలు, 88 మంది  ఏఆర్వోలు, 135 మంది జోనల్‌ అధికారులు, 223 మంది రూట్‌ ఆఫీసర్లు, 2,143 మంది ప్రొసీడింగ్‌ అధికారులు, 8,462 మంది పోలింగ్‌ అధికారులను నియమించారు. 

130 అత్యంత సమస్యాత్మక, 110 సమస్యాత్మక, 244 సాధారణ పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఇబ్బందులు తలెత్తకుండా మైక్రో అబ్జర్వర్‌లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా తక్షణమే ఉన్నతాధికారులకు వీరు సమాచారం చేరవేస్తారు. 


పోలింగ్‌ కేంద్రాలకు సామగ్రి

కర్నూలు(న్యూసిటీ), ఏప్రిల్‌ 7: జిల్లాలోని 44 మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్‌ జరగనుంది. ఎన్నికలు జరిగే మండలాల్లో ఎంపీడీవో కార్యాలయాల నుంచి పోలింగ్‌ సామగ్రిని సిబ్బంది తీసుకెళ్లారు. హైకోర్టు తీర్పుకోసం బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేచిచూసిన అధికా రులు, ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో వెంటనే పని ప్రారంభించారు. ఆర్టీసీ, ప్రైవేట్‌ వాహనాల్లో సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రా లకు సామగ్రితో వెళ్లారు. 53 జడ్పీటీసీ స్థానాలకు గాను 16 ఏకగీవ్రం అయ్యాయి. నామినేషన్‌ వేసిన వారిలో ఇద్దరు మృతిచెందారు. ఆ రెండు స్థానాలు మినహా 35 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 807 ఎంపీటీసీ స్థానాలకుగాను  312 ఏకగీవ్రం అయ్యాయి. నామినేషన్‌ వేసినవారిలో 10 మంది మృతిచెందారు.  ఆ స్థానాలు మినహా.. 482 స్థానా లకు పోలింగ్‌ జరుగుతోంది. 44 మండలాల్లో 1,785 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జడ్పీటీసీ స్థానాలకు 146 మంది, ఎంపీటీసీ స్థానాలకు 1,308 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. పోలింగ్‌ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్స్‌, పీపీఈ కిట్లను సమకూర్చారు. 2,932 బ్యాలెట్‌ బాక్సులను ఏర్పాటు చేశారు. మొత్తం 15,34,252 మంది ఓటర్లు ఉన్నారు.


ఎడమచేతి చిటికెన వేలికి..

ఓటరు ఎడమచేతి చూపుడు వేలికి సిరా గుర్తు వేస్తారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో ఇప్పటికే ఆ వేలుకు ఇంకు గుర్తు వేసినందున, పరిషత్‌ ఎన్నికల్లో ఎడమచేతి చిటికెన వేలుకు ఇంకు గుర్తు వేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్‌ ఆఫీసర్‌ తప్పకుండా ఎడమచేతి చిటికెన వేలుకు ఇంకు రాయాలని అధికారులు సూచించారు. 


నేడు సెలవు

పరిషత్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం గురువారం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలకు కూడా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. 


ఏర్పాట్లు పూర్తి..

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశాము. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎంపీడీవో కార్యాలయాల వద్ద పోలింగ్‌ సామగ్రిని సిద్ధంగా ఉంచు కోవాలని ఆదేశాలు జారీచేశాము. మధ్యాహ్నం 3 గంటలకు అనుకూల తీర్పు రావడంతో పోలింగ్‌ మెటీరియల్‌ను సిబ్బందికి అందజేశాము.  - వెంకట సుబ్బయ్య, జడ్పీ సీఈవో


సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులో.. 

రుద్రవరం, ఏప్రిల్‌ 7: రుద్రవరం ఉన్నత పాఠశాలలో పోలింగ్‌ సిబ్బందికి సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బంది పడ్డారు. విద్యుత్‌ సౌకర్యం ఉన్నా గదుల్లో లైట్లు లేకపోవడంతో సెల్‌ లైట్ల సహాయంతో పని చేసుకున్నారు. చీకట్లోనే విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొందని, నీరు కూడా లేదని, భోజనం సాయంత్రం 4 గంటలకు పెట్టారని జాన్సన్‌ అనే ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.  రాత్రి 8.45 గంటలకు అధికారులు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. 

 


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.