నేడు సద్దుల బతుకమ్మ

ABN , First Publish Date - 2022-10-03T06:00:09+05:30 IST

తెలంగాణలో జరుపుకునే పర్వదినాల్లో బతుకమ్మ పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలి పూలు పేరుతో ఎంగిలి కాని, వాడని పూలతో పేర్చిన బతుకమ్మ దుర్గాష్టమి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.

నేడు సద్దుల బతుకమ్మ

 కరీంనగర్‌ కల్చరల్‌, అక్టోబర్‌ 2: తెలంగాణలో జరుపుకునే పర్వదినాల్లో బతుకమ్మ పండుగకు ప్రత్యేక స్థానం ఉంది.  ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలి పూలు పేరుతో ఎంగిలి కాని, వాడని పూలతో పేర్చిన బతుకమ్మ దుర్గాష్టమి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ప్రకృతిలో లభించే ప్రతీ పూవును ఏరికోరి నేర్పుతో పోటీతత్త్వంతో వివిధ రూపాల్లో బతుకమ్మలను తయారు చేస్తారు. వాటిని గృహాలు, వీధులు, ఆలయాల్లో నిల్పి వలయంగా తిరుగుతూ మహిళలు పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతారు. గుమ్మడి పూలలోని పసుపు వర్ణపు దుద్దును గౌరీ దేవిగా భావించి అందులో పసుపు గౌరమ్మను నిల్పుతారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి పసుపు గౌరిని అలంకరించుకొని పరస్పరం వాయినాలు పంచుకుంటారు. గోధుమలు, పెసళ్లు, బియ్యం, మినుములు, తదితర ధాన్యాలతో తయారు చేసిన సత్తు (పిండి వంటలను) ప్రసాదంగా స్వీకరిస్తారు. జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ పండుగను సోమవారం జరుపుకోనున్నారు. ఇందుకోసం నగరపాలక సంస్థ, జిల్లా యంత్రాంగం తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో డివిజన్లలోని ఆయా కూడళ్లలో, ఆలయాల్లో ఏర్పాట్లు చేశారు. మానేరుడ్యాం, మానకొండూరు, కొత్తపల్లి, బొమ్మకల్‌, చింతకుంట చెరువుల వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు  చేశారు. 

Updated Date - 2022-10-03T06:00:09+05:30 IST