పోలీసు బాస్‌కు సవాళ్లు

Published: Fri, 24 Jun 2022 00:29:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పోలీసు బాస్‌కు సవాళ్లు

జిల్లాలో పెరిగిన సైబర్‌ క్రైమ్‌

నివురుగప్పిన నిప్పులా ఫ్యాక్షన్‌ పల్లెలు

నగరంలో వేధిస్తున్న ట్రాఫిక్‌ సమస్య 

అంతర్గత బదిలీల్లో రాజకీయ జోక్యం

ఉనికి కోల్పోయిన క్రైమ్‌ పార్టీ 

కనిపించని ఫ్రెండ్లీ పోలీసింగ్‌ 

మరో ఏడాదిన్నరలో ఎన్నికలు 

కొత్త ఎస్పీకి సమస్యల స్వాగతం 


కొత్త పోలీసు బాస్‌కు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఫ్యాక్షన్‌ పల్లెలు.. పెరిగిపోతున్న సైబర్‌ నేరాలు సవాల్‌గా మారనున్నాయి. ఇప్పటి వరకు ఎస్పీగా పని చేసిన సుధీర్‌కుమార్‌రెడ్డి శాఖాపరమైన సమస్యలపై దృష్టి సారించి గాడిలో పెట్టారు. ఊహించని విధంగా ఈయన బదిలీ కావడంతో కొత్త ఎస్పీగా సిద్ధార్థ కౌశల్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈయన ప్రత్యేకించి కొన్ని అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పోలీసు శాఖలో పెరిగిపోయిన రాజకీయ జోక్యం, సైబర్‌ నేరాలు, నగరంలోని ట్రాఫిక్‌ సమస్యలపై చర్యలు తీసుకోవాలి.


కర్నూలు, జూన్‌ 23

 

మరో ఏడాదిన్నరలో సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో ఎస్పీలను మార్చింది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాకు కూడా కొత్త ఎస్పీ వచ్చారు. సుధీర్‌ కుమార్‌ రెడ్డి 11 నెలల పాటే పని చేశారు. పోలీస్‌ శాఖలోని అంతర్గత విషయాలపైనే దృష్టి సారించిన ఆయన పోలీసు శాఖను గాడిలో తెచ్చేందుకు గట్టిగానే ప్రయత్నం చేశారు. స్టేషన్‌ల్లో సివిల్‌ పంచాయితీలు జరగకుండా, అవినీతి ఆరోపణలు జరగకుండా సుదూర ప్రాంతాలకు బదిలీ చేశారు.   పోలీసు అధికారులపై సైతం క్రిమినల్‌ కేసులను నమోదు చేయించారు. దీంతో పోలీసులు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవడానికి వెనుకంజ వేశారు. అయితే ఊహించని పరిణామంలో ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డి బదిలీ అయ్యారు. ఈ క్రమంలో కొత్త పోలీస్‌ బాస్‌గా సిద్దార్థ కౌశల్‌ బాధ్యతలు చేపట్టారు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. 36 ఫ్యాక్షన్‌ గ్రామాల్లో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నాలుగైదు ఏళ్లలో మూడు నాలుగు సంఘటనలు మినహాయించి పెద్దగా ఫ్యాక్షన్‌ ఘర్షణలు జరిగిన నేపథ్యాలు లేవు. అయితే ఎన్నికలు సమీపించే కొద్దీ గ్రామాల్లో రాజకీయ వైరం, కక్షలు పెరిగే అవకాశాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని వైసీపీ, టీడీపీ వర్గాలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీని వల్ల ఘర్షణలు చెలరేగే వాతావరణం లేకపోలేదు. నియంత్రించేందుకు ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


నేతల చేతుల్లో లాఠీ


జిల్లా పోలీసు శాఖపై రాజకీయ ప్రాబల్యం పూర్తిగా పెరిగిపోయింది. పోస్టింగ్‌లు ఇవ్వడంలోనూ రాజకీయమే. వారి ఆమోదముద్ర, సిఫార్సు లెటర్‌ లేకపోతే పోస్టింగ్‌ దక్కని పరిస్థితి. రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తేనే కీలక స్థానాలు దక్కుతున్నాయి. వీరి అండదండ లేని వారు ఏళ్ల తరబడి పోస్టింగ్‌ లేకుండా అప్రధాన్య పోస్టుల్లో మగ్గుతున్నారు. చాలా కేసులు రాజకీయ ప్రాభల్యంతో నీరుగారిపోయాయి. 


పరిష్కారం కాని ట్రాఫిక్‌ సమస్య


కర్నూలు నగరంలో ట్రాఫిక్‌ సమస్య ప్రధానంగా వేధిస్తోంది. దశాబ్దకాలంగా ట్రాపిక్‌ సమస్య పరిష్కరిస్తామని ప్రతి ఎస్పీ బాధ్యతలు తీసుకున్న కొత్తలో చెబుతూనే ఉన్నారు. ఆ తర్వాత కొంత కాలానికి ఆ సమస్యను  మరిచిపోతున్నారు. ఆటో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆకతాయిలు బైక్‌ విన్యాసాలు చేస్తూ తోటి వాహనచోదకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గతంలో పని చేసిన ఎస్పీలు ఒకరిద్దరు ట్రాఫిక్‌ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ తర్వాత ఎస్పీలు మారడం, ట్రాఫిక్‌ విభాగానికి డీఎస్పీ స్థానం ఖాళీగా ఉండడం, అందులో పని చేసే సీఐలు, ఎస్‌ఐలు ట్రాఫిక్‌ సమస్యలపై పెద్దగా పట్టించుకోకపోవడం, చలాన్లకే పరిమితం కావడంతో ట్రాఫిక్‌ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. అసలు కర్నూలు నగరంలో ట్రాఫిక్‌ విభాగం ఉందా అన్నట్టుగా పరిస్థితి తయారైంది. సుమారు 50కి పైగా కూడళ్లు ఉన్నా ఒకటో రెండో కూడళ్లలో మాత్రమే ట్రాఫిక్‌ పోలీసులు కనిపిస్తారు. ప్రధానంగా బళ్లారి చౌరస్తా, ఆర్టీసీ బస్టాండు, కలెక్టరేట్‌, గాయత్రి ఎస్టేట్‌ వద్ద నిత్యం ట్రాఫిక్‌ సమస్య వేధిస్తోంది. 


పెరిగిన సైబర్‌ క్రైమ్‌ 


జిల్లాలో సైబర్‌ నేరాలు పెరిగిపోయాయి. గత ఐదేళ్లతో పోలిస్తే.. ఇటీవల కాలంలో రోజుకో సైబర్‌ క్రైమ్‌ జరుగుతోంది. కర్నూలు జిల్లా వాసుల నిరక్షరాస్యతను ఆసరాగా తీసుకున్న సైబర్‌ నేరస్థులు చెలరేగిపోతున్నారు. ఆన్‌లైన్‌లో డబ్బులను స్వాహా చేసేస్తున్నారు. బీహార్‌, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన సైబర్‌ నేరస్థులు యథేచ్ఛగా సొమ్ము స్వాహా చేస్తుంటే.. ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఫిర్యాదు చేస్తే.. పెద్దగా ఫలితాలు కనిపించడం లేదు. ఒకటి రెండు కేసుల్లో మాత్రమే జార్ఖండ్‌ తదితర ప్రాంతాలకు వెళ్లి నేరస్థులను పట్టుకువచ్చినా ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సైబర్‌ నేరస్థులను అరెస్టు చేయడంలో పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. ప్రత్యేక స్థాయిలో సిబ్బంది లేకపోవడం, ఇతర రాష్ట్రాలకు వెళ్లి నేరస్థులను పట్టుకోవాలంటే వ్యయ ప్రయాసాలతోపాటు లక్షల్లో ఖర్చులు వస్తుండటంతో పోలీసులు పెద్దగా ఈ నేరాలపై స్పందించడం లేదు. ఉన్నతస్థాయి వ్యక్తుల ఫిర్యాదులకు మాత్రమే స్పందిస్తున్నారే తప్ప.. సామాన్యులను పట్టించుకున్న దాఖలాలు లేవు. 


ఎస్పీగా సిద్దార్థ కౌశల్‌ బాధ్యతలు


శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం

వాట్సాపుల్లో ఎల్లవేళలా 

అందుబాటులో ఉంటాం

ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ 


కర్నూలు, జూన్‌ 23: కర్నూలు జిల్లా ఎస్పీగా సిద్ధార్థ కౌశల్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ సుధీర్‌కుమార్‌ రెడ్డి నుంచి ఈయన బాధ్యతలు తీసుకున్నారు. గతంలో ఎస్పీగా ఉన్న సుధీర్‌ కుమార్‌ రెడ్డి కోనసీమకు బదిలీ అయిన విషయం తెలిసిందే. మొదటగా జిల్లా పోలీసు కేంద్రానికి చేరుకున్న ఆయనకు ఏఆర్‌ సిబ్బంది గౌరవ వందనం చేశారు. అనంతరం బాధ్యతలు చేపట్టిన ఆయన విలేకరులతో మాట్లాడారు. వాట్సా్‌పల్లో 24 గంటలు అందుబాటులో ఉంటామని చెప్పారు. మహిళల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తామని తెలిపారు. ఫ్యాక్షన్‌ గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఉంచుతామని పేర్కొన్నారు. అసాంఘిక కార్యక్రమాలపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపడతామని వివరించారు. ప్రతి బాధితుడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గుట్కా, గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, నాటుసారా తయారీ వంటివి వాటిని అరికడతామని చెప్పారు.


ఎస్పీ గురించి..


2012వ బ్యాచ్‌కు చెందిన ఈయన సొంత రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌. మొదటగా గ్రేహౌండ్స్‌లో విధులు నిర్వహించారు. పార్వతీపురం, విశాఖపట్నంలో ఏఎ్‌సపీగా పని చేశారు. 2018లో మొదటిసారి గుంతకల్లు రైల్వే ఎస్పీగా, 2019లో ప్రకాశం జిల్లా ఎస్పీగా పని చేశారు. గత ఏడాది జూలై 14 నుంచి కృష్ణా జిల్లా ఎస్పీగా పని చేస్తూ కర్నూలుకు బదిలీపై వచ్చారు. 


పలువురి అభినందనలు


ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు పలువురు పోలీసు అధికారులు స్వాగతం పలికారు. ట్రైనీ ఐపీఎస్‌ అధికారి ధీరజ్‌, అడిషనల్‌ ఎస్పీలు ప్రసాద్‌, నాగబాబు, కర్నూలు డీఎస్పీ మహేష్‌, ఆదోని డీఎస్పీ వినోద్‌ కుమార్‌, ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ యుగంధర్‌బాబు, ఇలియాజ్‌బాషా, రవీంద్రరెడ్డి, జిల్లా పోలీస్‌ కార్యాలయం ఏవో సురే్‌షబాబు, పలువురు సీఐలు, ఆర్‌ఐలు ఎస్‌ఐలు, ఏఆర్‌ సిబ్బంది ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కర్నూలు రేంజ్‌ డీఐజీ సెంథిల్‌కుమార్‌ను ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. 


ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి


ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌


కౌతాళం, జూన్‌ 23: సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ అన్నారు. గురువారం మండల పరిధిలోని కామవరంలో పల్లె నిద్ర కార్యక్రమానికి వచ్చారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు గ్రామస్థులు తరలి వచ్చారు. ఎల్‌ఈడీ తెర ద్వారా రోడ్డు భద్రత, నేరాలు, దిశ చట్టం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరూ కక్షలు కార్పణ్యాలకు వెళ్లకుండా సోదరభావంతో మెలగాలని సూచించారు. గ్రామాల్లో భూవివాదాల కారణంగా గొడవలు, హత్యలు జరుగుతున్నాయని, వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. ఏ అధికారి అయిన ప్రజలకు ఇబ్బందులు పెట్టినా, అవినీతికి పాల్పడినా 14400 అనే నెంబరు ద్వారా నేరుగా ఏసీబీకి సమాచారం చేరవేయవచ్చని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వినోద్‌కుమార్‌, సీఐ మహేశ్వర రెడ్డి,  ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి, తహసీల్దార్‌ చంద్రశేఖర వర్మ, సర్పంచ్‌ వసంత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.