బస్‌ చార్జీల పెంపుపై నేడు వామపక్షాల నిరసన

ABN , First Publish Date - 2022-07-02T09:06:34+05:30 IST

బస్‌ చార్జీల పెంపుపై నేడు వామపక్షాల నిరసన

బస్‌ చార్జీల పెంపుపై నేడు వామపక్షాల నిరసన

అమరావతి, విజయవాడ, జూలై 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల కాల పరిమితిలో రెండోసారి డీజిల్‌ సెస్‌ పేరుతో ప్రజలపై రూ.500 కోట్లు భారం మోపుతూ ఆర్టీసీ బస్‌ చార్జీలను పెంచడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. చార్జీల పెంపుదలను నిరసిస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్‌స్టేషన్ల ముందు నిరసనలు, ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. శుక్రవారం ఈమేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు తదితర వామపక్ష పార్టీల నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల నిరసనల ఫలితంగా డీజిల్‌ రేటు లీటరుకు రూ.10 తగ్గిన తరుణంలో సెస్‌ పేరుతో భారం మోపడం శోచనీయం అన్నారు. 30 కిలోమీటర్లపైన ప్రయాణించే ప్రయాణీకులందరిపైనా రూ.10 నుంచి రూ.100 వరకు ధర పెంచడం గర్హనీయమన్నారు. ప్రభుత్వం విద్యార్థుల బస్‌ పాసుల రేట్లను పెంచడం అన్యాయమన్నారు. పెంచిన చార్జీల నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2022-07-02T09:06:34+05:30 IST