నేడు, రేపు భారత్‌ బంద్‌

Published: Mon, 28 Mar 2022 02:59:47 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నేడు, రేపు భారత్‌ బంద్‌

  • కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక 
  • విధానాలకు నిరసనగా రెండ్రోజుల సమ్మె
  • పిలుపునిచ్చిన కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక
  • 20 కోట్ల మందికి పైగా సమ్మెలో పాల్గొంటారు: ఏఐటీయూసీ
  • సమ్మెకు మద్దతిచ్చిన బ్యాంకు ఉద్యోగుల సంఘాలు
  • బ్యాంకింగ్‌, రవాణా రంగాలపై తీవ్ర ప్రభావం?
  • విద్యుత్తు సంస్థలు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం


న్యూఢిల్లీ, మార్చి 27: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక రెండు రోజుల ‘భారత్‌ బంద్‌’కు పిలుపునిచ్చింది. సోమ, మంగళవారాల్లో జరిగే ఈ సమ్మె ప్రభావం అత్యవసర సేవలపై పడే అవకాశం ఉంది. రవాణా, బ్యాంకింగ్‌, రైల్వే, విద్యుత్తు రంగాలపై బంద్‌ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 28, 29 తేదీల్లో సార్వత్రిక సమ్మె చేపడుతున్నట్లు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జీత్‌ కౌర్‌ చెప్పారు. ఈ సమ్మెలో సంఘటిత, అసంఘటిత రంగాలకు చెందిన 20 కోట్ల మందికి పైగా పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. సమ్మె గ్రామీణ ప్రాంతాల్లోనూ జరుగుతుందని, వ్యవసాయ రంగానికి చెందిన కూలీలు, ఇతర వర్గాల కార్మికులు కూడా భాగస్వాములవుతారని ఆమె తెలిపారు. ఇప్పటికే బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, పోస్టల్‌, ఆదాయ పన్ను, కాపర్‌, బ్యాంకులు, బీమా వంటి పలు రంగాలకు చెందిన కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు అందించాయి. రైల్వే, రక్షణ శాఖల్లోని యూనియన్లు కూడా దేశవ్యాప్త సమ్మెకు పలు ప్రాంతాల్లో సంఘీభావం తెలిపాయని సంయుక్త వేదిక వెల్లడించింది.


కార్మిక చట్టాల్లో మార్పులు, ప్రైవేటీకరణ ప్రయత్నాలను మానుకోవాలని, జాతీయ ఉపాధి హామీ పథకం కింద మరిన్ని పనులు, వేతనాలు కల్పించాలని, కాంట్రాక్ట్‌ కార్మికులను క్రమబద్ధీకరించాలన్న డిమాండ్లతో ఈ సమ్మె చేపట్టినట్లు తెలిపింది. రహదారులు, రవాణా, విద్యుత్తు శాఖ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. హరియాణాలో ఎస్మా ప్రయోగించే అవకాశం ఉన్నప్పటికీ ఆయా విభాగాల సిబ్బంది సమ్మెలో పాల్గొంటారని వెల్లడించింది. సంయుక్త వేదికలో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్‌ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్‌పీఎఫ్‌, యూటీయూసీ సంఘాలు ఉన్నాయి. ఇక బ్యాంకు ఉద్యోగుల సంఘాలు కూడా సమ్మెకు సంఘీభావం తెలిపాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్‌ (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్‌.వెంకటాచలం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమ్మె వల్ల తమ బ్యాంకింగ్‌ సేవలు పాక్షికంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. సమ్మె రోజుల్లో బ్యాంకు కార్యకలాపాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. 


అప్రమత్తంగా ఉండండి: కేంద్ర విద్యుత్తు శాఖ 

రెండు రోజుల భారత్‌ బంద్‌ నేపథ్యంలో కేంద్ర విద్యుత్తు శాఖ అప్రమత్తమైంది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ఏజెన్సీలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. విద్యుత్తు సరఫరాలో ఆటంకాలు ఎదురవకుండా చూడాలని ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా, జాతీయ గ్రిడ్‌ స్థిరంగా ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. కార్మిక సంఘాలు ఈ నెల 28వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, కేంద్ర విద్యుత్తు సంస్థ, జాతీయ, ప్రాంతీయ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్లకు ఈ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది. విద్యుత్తు వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా నిరంతరాయంగా కరెంటు సరఫరా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని విద్యుత్తు సంస్థలను ఆదేశించింది. అన్ని రీజినల్‌/రాష్ట్ర కంట్రోల్‌ రూమ్‌ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. గ్రిడ్‌ నిర్వహణకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పేర్కొంది. అన్ని సబ్‌స్టేషన్ల వద్ద నిరంతరాయంగా సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ఆస్పత్రులు, రక్షణ శాఖ, రైల్వే వంటి అత్యవసర సేవలకు విద్యుత్తు సరఫరాలో ఆటంకాల్లేకుండా చూడాలని ఆదేశించింది. 


రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలో 80 లక్షల మంది..!

హైదరాబాద్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): భారత్‌ బంద్‌లో రాష్ట్రంలోని సుమారు 80 లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు పాల్గొంటున్నారని కార్మిక సంఘాలు వెల్లడించాయి. సమ్మెకు అఖిలభారత బ్యాంకు ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకింగ్‌ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. సెంట్రల్‌ బ్యాంక్‌ వద్ద  ఉద్యోగులు సోమవారం ఆందోళన చేయనున్నారు. జనరల్‌ ఇన్సూరెన్సు ఉద్యోగులు బషీర్‌బాగ్‌లో, ఎల్‌ఐసీ ఉద్యోగులు సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద ఽధర్నా చేయనున్నారు. రైల్వే కార్మికులు రైల్‌ నిలయం వద్ద నిరసన తెలియజేయనున్నారు. ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు తమ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తారని, ప్రైవేటురంగంలోని కార్మికులు పరిశ్రమల వద్ద నిరసనలు తెలియజేస్తారని ఏఐటీయూసీ కార్యదర్శి బోస్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల ఆటోలు, క్యాబ్‌లు ఉన్నాయని, ఇవన్నీ సోమవారం సమ్మెలో పాల్గొంటాయని, ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్టు భవన్‌ను ముట్టడిస్తామని ఆటో, క్యాబ్‌ డ్రైవర్‌ల జేఏసీ కన్వీనర్‌ వెంకటేశం చెప్పారు. 28, 29 తేదీల్లో సమ్మె ర్యాలీలు, సభలు నిర్వహించనున్నట్లు సీఐటీయూ ప్రకటించింది. సార్వత్రిక సమ్మెకు ఆర్టీసీ కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.