విశాఖ బంద్‌కు సంఘీభావంగా ఆదివారం విశాఖలో ప్రచారం నిర్వహిస్తున్న దళిత సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాసంఘాల జేఏసీ పిలుపు
అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం
ఆర్టీసీ డిపోలు, ముఖ్యకూడళ్ల వద్ద నిరసన
నేడు, రేపు దేశవ్యాప్త సమ్మె
విశాఖపట్నం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం విశాఖ బంద్ జరగనున్నది. ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుని నిరసిస్తూ, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించనప్పటికీ, అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపినందున బంద్‌ను విజయవంతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నరసింగరావు అన్నారు. ఉదయం నుంచే ఆర్టీసీ డిపోలు, ముఖ్య కూడళ్ల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని పాఠశాలలను మూసివేయాలని డిమాండ్ చేయడంలేదని, అయితే ప్రభుత్వ కార్యాలయాలను మాత్రం పూర్తిగా మూసివేస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.
నేడు, రేపు సార్వత్రిక సమ్మె
ఇదిలావుండగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, మానిటైజేషన్ ఆపాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కాంట్రాక్టు/ అవుట్ సోర్సింగ్/ స్కీమ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ పలు సంఘాలు 28, 29 తేదీల్లో దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈపీఎఫ్ వడ్డీ రేటు పెంచాలని, కనీస పెన్షన్ రూ.7,500 ఇవ్వాలని, హమాలీ, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, బ్యాంకుల ప్రైవేటీకరణ ఆపాలని, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
మధ్యాహ్న భోజనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు : హెచ్ఎంలకు డీఈవో ఆదేశం
విశాఖపట్నం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్త సమ్మెలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కూడా పాలుపంచుకోవడంతో విద్యా శాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. 28, 29 తేదీల్లో జరగనున్న సార్వత్రిక సమ్మెలో తాము కూడా పాల్గొంటామని ఈ నెల 19వ తేదీనే మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా విద్యా శాఖకు నోటీసు ఇచ్చింది. దీనిపై విద్యా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ఎటువంటి అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పాఠశాలల ప్రఽధానోపాధ్యాయులకు డీఈవో ఎల్.చంద్రకళ ఆదేశించారు.