దున్నే దళితుడికే భూమి దూరం దూరంగా..!

Published: Fri, 23 Sep 2022 01:39:46 ISTfb-iconwhatsapp-icontwitter-icon
దున్నే దళితుడికే భూమి దూరం దూరంగా..!

నిజానికి సాగు భూమి ఎవరి చేతుల్లో ఉండాలి? వ్యవసాయాన్ని, పశు పోషణను జీవనోపాధిగా ఎంచుకునే కుటుంబాల చేతుల్లో ఉండాలి. ఎందుకంటే, సాగు భూమి మిగిలిన ఆస్తిపాస్తుల వంటిది కాదు. అది ప్రకృతి వనరు. ఇతర జీవజాతులకు ఆవాసమయ్యేలా ప్రకృతి సజీవంగా కొనసాగడానికి, దానినే నమ్ముకుని ఉన్న ప్రజల జీవనోపాధిని కొనసాగించడానికి అది వనరుగా ఉండాలి. ఈ నిర్వచనం ప్రకారం రాష్ట్ర జనాభాలో 18శాతంగా ఉన్న దళితులకు మించి సాగు భూమి పొందడానికి హక్కు దారులు ఎవరు ఉంటారు?


కానీ రాష్ట్ర ప్రభుత్వ ‘రైతు బంధు పెట్టుబడి సహాయ పథకా’నికి ఉన్న 61,07,762 మంది లబ్ధిదారులలో దళితులు 8,10,372 (13 శాతం) మంది మాత్రమే ఉన్నారు. రైతు బంధు సహాయం పంపిణీ చేస్తున్న ఒక కోటీ 47లక్షల 56 వేల ఎకరాలలో, 2021 నాటికి దళిత కుటుంబాల చేతుల్లో ఉన్న సాగు భూమి విస్తీర్ణం కేవలం 13,52,145 (9 శాతం) ఎకరాలు మాత్రమే. 2021 వానా కాలంలో పంపిణీ చేసిన రైతుబంధు సహాయం రూ.7,377 కోట్ల 63 లక్షలలో దళిత సాగుదారులకు అందిన మొత్తం కేవలం రూ.676 కోట్ల 6లక్షలు (9 శాతం) మాత్రమే. అంటే, ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రైతుబంధు పథకంలో నిజమైన లబ్ధిదారులుగా ఉండాల్సిన దళిత సాగుదారులకు అందుతున్న వాటా అతి తక్కువ అని అర్థమవుతుంది.


దున్నేవారికి భూమి నినాదం కేంద్రంగా 1940–50 దశకాలలో తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం జరిగినా, 1970–80 దశకాలలో నక్సల్బరీ ఉద్యమాలు జరిగినా, 1969 నుంచి 2014 వరకూ వివిధ పేర్లతో ప్రభుత్వాలు భూ సంస్కరణలు అమలుచేసి భూ పంపిణీ చేశామని చెప్పుకున్నా, రాష్ట్రంలో దళిత కుటుంబాలకు ఇంకా సాగు భూమి హక్కుగా అందలేదని ప్రభుత్వ గణాంకాలే బయటపెడుతున్నాయి.


తెలంగాణా రాష్ట్రం ఏర్పడే 2014 నాటికి దళితులకు ఉన్న పట్టా భూములకు తోడు అదనంగా అసైన్డ్ భూములు, భూదాన్ భూములు, మిగులు భూములు, దేవాదాయ భూములు, ఇనామ్ భూములు, వక్ఫ్ భూములు, అటవీ భూములు, సి‌జే‌ఎఫ్ఎస్ భూములు పేరుతో భూ పంపిణీ చేశామని చెప్పుకున్నా, ఆ భూమి దళితుల చేతుల్లోకి సంపూర్ణ హక్కుగా రాలేదనీ, సాగుకు పనికిరాక కొంతా, పేదరికంవల్ల కొంతా వారి చేతుల్లోంచి జారిపోయిందనీ మనకు అర్థమవుతుంది. 2010–11లో చేసిన జాతీయ వ్యవసాయ లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర పరిధిలో దళితుల ఆధీనంలో ఉన్న కమతాలు 5 లక్షల 80 వేలు కాగా, వారి చేతుల్లో సాగు భూమి 11లక్షల 78 వేల ఎకరాలు. అంటే 2021 నాటికి పదేళ్లు గడిచినా దళిత కుటుంబాల సాగు భూమి గణనీయంగా పెరగలేదు. ఫలితంగా మెజారిటీ దళిత కుటుంబాల సభ్యులు, వ్యవసాయ కూలీలుగా మిగిలిపోయారు. లేదా అసంఘటిత రంగ కార్మికులుగా పొట్టచేత పట్టుకుని నగరాలకు వలస పోయారు.


2014 జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్రం ఉనికిలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 జూలై 26న జారీ చేసిన జీవో నంబర్ 1కి అనుబంధంగా విడుదల చేసిన గణాంకాలలో తెలంగాణా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో 9 లక్షల కుటుంబాలు ఉంటే, అందులో మూడు లక్షల కుటుంబాలకు అసలు సాగు భూమి లేదనీ, మరో రెండు లక్షల 40 వేల కుటుంబాలకు ఎకరం లోపు మాత్రమే భూమి ఉన్నదనీ, మరో లక్షా 67 వేల 942 మంది రెండున్నర ఎకరాల లోపు భూమిని కలిగి ఉన్నారనీ స్పష్టం చేసింది. ప్రభుత్వ నిధులతో భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి కొనుగోలు చేసి ఇస్తామనీ, మూడెకరాల లోపు ఉన్న దళిత కుటుంబాలకు, మూడెకరాలు ఉండేలా భూమిని కొని భర్తీ చేస్తామనీ ప్రభుత్వం ప్రకటించింది. 2018 వరకూ అరకొరగా నడచిన ఈ పథకం ద్వారా కేవలం 6,242 కుటుంబాలకు 15,571 ఎకరాల భూమిని మాత్రమే కొనుగోలు చేసి ఇచ్చారు.


ప్రభుత్వాలు 1973 భూ సంస్కరణల చట్టం అమలు చేస్తే భూ గరిష్ఠ పరిమితి ప్రకారం మిగులు భూములను తేల్చి, భూమి లేని పేదలకు సాగు భూమిని హక్కుగా అందించాలి. ఈ ప్రక్రియకు బదులు ఎస్‌సి ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా ఈ భూమిని ప్రభుత్వం కొంటానని చెప్పింది. ఆ నిధులకు ఇంతకు మించిన సార్థకత ఏమీ ఉండదు కాబట్టి ఇది సాధ్యమే అనే జవాబు వచ్చింది. కానీ ఆచరణలో అలా జరగలేదు. 


2014 నుంచి 2021 వరకూ బడ్జెట్టులో రూ.85,913 కోట్లు ఎస్‌సి సబ్‌ప్లాన్ నిధులు కేటాయించినా, నిజానికి ఖర్చు చేసింది కేవలం రూ.47,685 కోట్లు మాత్రమే. ఖర్చు చేసిన నిధులు పక్కదారి పట్టాయన్న విమర్శలు ఎలాగూ ఉన్నాయి. మిగిలిన నిధులతో సాగు భూములను పూర్తి స్థాయిలో కొని ఇవ్వకపోగా, కొనుగోలు చేసిన భూముల విషయంలో కూడా దళిత కుటుంబాలు అనేక సమస్యలను ఎదుర్కొన్నాయి. సాగునీటి సౌకర్యం లేకపోవడం, దారి లేకపోవడం, సాగుయోగ్యం కాకపోవడం, పెట్టుబడి అందకపోవడం లాంటి అనేక సమస్యలను ఈ కుటుంబాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విషయం డి‌బి‌ఆర్‌సి, డి‌బి‌ఎఫ్ లాంటి సంస్థల అధ్యయనంలో వెల్లడైంది.


ఒకపక్క గ్రామీణ జీవితంలో వ్యవసాయాన్ని అంటిపెట్టుకుని ఉన్న దళిత కుటుంబాలకు భూమి దక్కటం లేదు. మరోపక్క ఆధిపత్య కులాలలో అత్యధికులు తమ ప్రధాన జీవనోపాధులను నగరాలకు, ఇతర రంగాలకు వేగంగా మార్చుకుంటున్నా, సాగు భూములను మాత్రం తమ కబ్జాలోనే ఉంచుకుంటున్నారు. మొత్తం రైతుబంధు లబ్ధిదారులలో 21శాతంగా ఉన్న ఆధిపత్య కులాల చేతుల్లో ఇంకా 43,99,000 ఎకరాల (30 శాతం) భూమి ఉన్నది.


వీళ్ళే కాక, వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులతో సహా అసలు వ్యవసాయంతో సంబంధం లేని అనేకమంది గతం నుంచి ఉన్న తమ భూములను కౌలుకు ఇస్తూనే, కొత్తగా వ్యవసాయ భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. జీవనోపాధి వనరుగా ఉండాల్సిన సాగు భూమిని ఆస్తిగా మార్చి స్పెక్యులేటివ్ మార్కెట్ సరుకుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న భూముల ధరలతో ఏ ఒక్క దళిత కుటుంబమూ, లేదా వాస్తవ సాగుదారు కుటుంబమూ భూమి కొనుక్కునే పరిస్థితి లేక, కౌలు రైతులుగా మారుతున్నారు.


మెరుగైన జీవనోపాధి, దాని నుంచి తగిన ఆదాయమూ ఉన్నప్పుడే ఏ కుటుంబమైనా అభివృద్ధి చెందుతుంది. ఎటువంటి హక్కులు, గౌరవం లేకుండా కేవలం కూలీ పనిపై ఆధారపడేవాళ్ళు మెరుగైన జీవన ప్రమాణాలను అందుకోవడం కష్టం. అందుకే వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకునే గ్రామీణ సాగుదారుల చేతుల్లోనే సాగు భూములు ఉండాలని, ఆదివాసీలకే అడవులపై హక్కు ఉండాలని మనం మాట్లాడేది. కానీ విషాదం ఏమిటంటే, కమ్యూనిస్టు పార్టీల ఎజెండాలో భూమిపై చర్చ ఒక అంశంగా కూడా లేకుండా పోయింది. దళిత, బహుజనుల కోసం ఏర్పడిన రాజకీయ పార్టీలు, సంస్థలు కూడా దీనిని ఒక కీలక అంశంగా మాట్లాడడం లేదు. దళిత కుటుంబాల పిల్లలకు చదువు, చదువు ఆధారిత జీవనోపాధి తప్పకుండా అవసరమే అయినా, మొత్తంగా గ్రామీణ దళిత కుటుంబాల జీవనోపాధి అంశాన్ని అది పరిష్కరించదు. తగిన చదువు, నైపుణ్యాలు లేకుండా వ్యవసాయేతర రంగాల్లో మొత్తం గ్రామీణ దళిత కుటుంబాలకు ఉపాధి అవకాశాలు దొరకవు.


దేశ, రాష్ట్ర సహజ వనరులను వ్యవసాయంతో సంబంధం లేనివాళ్లకూ, కార్పొరేట్ కంపెనీలకూ ప్రభుత్వాలు అప్పగించేసే ప్రక్రియను మనం ఆపలేమనీ, అది పెట్టుబడిదారీ విధాన సహజ ప్రక్రియ అనీ, కాబట్టి భూమి సమస్యను లేవనెత్తడంవల్ల ఉపయోగం లేదనీ భావిస్తున్న వాళ్ళు కూడా ఎదురవుతున్నారు. మిగిలిన డిమాండ్ల మాటెలా ఉన్నా, భూమి సమస్యను మాట్లాడిన ప్రతిసారీ, రాజ్య హింస విరుచుకుపడుతుందని ఆలోచిస్తున్నవాళ్ళు ఉన్నారు.


చెరువులు, ప్రాజెక్టులు ఎన్ని కట్టుకున్నా, వాటి ఆయకట్టు పరిధిలో గ్రామీణ దళిత కుటుంబాలకు గుంట భూమి కూడా లేనప్పుడు, ఎస్‌సి సమగ్ర అభివృద్ధి ప్రణాళికను ప్రభుత్వాలు సరిగా అమలు చేయనప్పుడు, హక్కుగా రావాల్సిన నిధులు కూడా విడుదల చేయనప్పుడు, దళిత కుటుంబాల పిల్లలకు సరైన చదువు అందించనప్పుడు, స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకుల నుంచి సబ్సిడీపై ఋణాలు దొరకనప్పుడు, దళిత కుటుంబాలకు భూమిని హక్కుగా అందించాల్సిన పథకాలు కూడా ఆపేసినప్పుడు న్యాయం ఎలా దొరుకుతుంది? చట్టబద్ధంగా భూ సంస్కరణలు అమలు కావాలనీ, వ్యవసాయేతర ఆదాయాలు ప్రధానంగా కలిగినవాళ్ళు వ్యవసాయ భూములు కొనకూడదనే చట్టం రావాలనీ కోరుతూ, నిజమైన ప్రజా సంస్థలు, పార్టీలు ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కానప్పుడు, భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలకు విముక్తి దొరకదు.

కన్నెగంటి రవి

రైతు స్వరాజ్య వేదిక

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.