అమ్మవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

ABN , First Publish Date - 2021-11-29T07:17:57+05:30 IST

తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ నిర్వహించనున్నారు.

అమ్మవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

తిరుచానూరు, నవంబరు 28: తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ నిర్వహించనున్నారు. మంగళవారం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 8న పంచమీ తీర్థంతో ఉత్సవాలు ముగుస్తాయి. సోమవారం ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఆలయ ప్రాంగణంలో లక్షకుంకుమార్చన నిర్వహిస్తారు. భక్తులు వర్చువల్‌గా ఈ సేవలో పాల్గొనేందుకు టీటీడీ అవకాశం కల్పించింది. సాయంత్రం 6.30నుంచి రాత్రి 8.30గంటల నడుమ పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపడతారు.

రేపు ధ్వజారోహణం : మంగళవారం ఉదయం 8-9గంటల మధ్య జరిగే ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా వాహనసేవలు మాడవీధుల్లో కాకుండా, ఆలయం ఎదుట ఉన్న వాహన మండపంలో జరుగుతాయి. ఉత్సవర్లు ఉదయం 8-9గంటల వరకు, రాత్రి 7-8గంటల వరకు సప్తవాహనాల్లో దర్శనమిస్తారు. ఈ సందర్భంగా ఆలయం ఎదుట పరిసరప్రాంతాల్లో రంగవల్లులు, విద్యుత్‌ దీపకాంతులతో ఆలయం స్వర్ణశోభితంగా మారింది. ప్రత్యేక క్యూలైన్లు, భక్తుల కోసం ప్రత్యేక షెడ్లు ఏర్పాటుచేశారు. వీఐపీ బ్రేక్‌, కొన్ని సేవలను టీటీడీ రద్దు చేసింది. 

వాహనసేవల వివరాలిలా...  : మంగళవారం ఉదయం ధ్వజారోహణం-రాత్రి చిన్నశేష, బుధవారం ఉదయం పెద్దశేష-రాత్రి హంస, గురువారం ఉదయం ముత్యపుపందిరి-రాత్రి సింహ, 3న కల్పవృక్ష-రాత్రి హనుమంత, 4న పల్లకీఉత్సవం, వసంతోత్సవం, గజవాహనం, 5న సర్వభూపాల, సర్వభూపాల, గరుడ, 6న సూర్యప్రభ, చంద్రప్రభ, 7న రథోత్సవం బదులుగా సర్వభూపాల, అశ్వవాహనం, 8న చివరిరోజున పంచమీతీర్థం(వాహనమండపంలో), ధ్వజావరోహణం.

Updated Date - 2021-11-29T07:17:57+05:30 IST