పసిపాప లేతనవ్వు వెయ్యి థెరపీలకు సమానం

May 9 2021 @ 01:24AM

‘మాతృత్వం ఒక తియ్యని కల’ అని చాలామంది అంటుంటారు. కానీ ఆ మాటల్లోని అర్థం అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. పిల్లలు జన్మించడం... ప్రతి చిన్న విషయానికీ ఆధారపడే దశ నుంచి పెరిగి పెద్దవారు కావటం... ఇలా అనేక దశలను దగ్గరగా చూడటం ఒక అదృష్టమని భావించే తల్లులు ఎందరో! అలాంటి ఒక తల్లి... యాంకర్‌, యాక్టర్‌ ఉదయభాను. నాలుగున్నరేళ్ల కిందట కవలలు పుట్టడంతో వృత్తి జీవితానికి దూరంగా జరిగిన ఆమె... ‘మదర్స్‌ డే’ సందర్భంగా మాతృత్వంలోని తన అనుభూతులను ‘నవ్య’తో పంచుకున్నారు... 

ఉదయభాను

‘‘అమ్మదనాన్ని ఎలా నిర్వచిస్తారని ఎవరైనా అడిగితే - చెప్పటానికి భాషలో మాటలు లేవంటాను. మన పసిపాప లేతనవ్వు - వెయ్యి థెరపీలకు సమానం. ఆ నవ్వు మనల్ని కమ్మేస్తుంది. అనిర్వచనీయమైన ఆనందాన్ని ఇస్తుంది. బాధలన్నీ మరిపిస్తుంది. నా ఉద్దేశంలో ఒక మహిళకు మాతృత్వం కన్నా గొప్ప అదృష్టం ఏదీ ఉండదు. మా అమ్మాయిలు ఆరాధ్య, నక్షత్రలను స్కానింగ్‌లో చూసిన క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయి. డాక్టర్‌ ముందు ఆరాధ్యను చూపించారు. ఆ తర్వాత దాని వెనకే ఒక చిన్న చుక్కలా కనిపించింది. అది నక్షత్ర. ఒక్కరు కాదు... ఇద్దరు. ఆ క్షణాలు తలుచుకుంటే ఇప్పటికీ మనసు పులకరిస్తుంది. 


ఏ రోజూ బాధపడలేదు... 

వాస్తవానికి నేను గర్భవతిని అయ్యే సమయానికి కెరీర్‌ పీక్‌లో ఉంది. ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండేది కాదు. ఆ సమయంలోనే ‘పిల్లలు-పిడుగులు’ అనే ప్రోగ్రామ్‌ చేస్తున్నా. పెద్ద పేమెంట్‌ ఇచ్చేవారు. బాగా విజయవంతమైన కార్యక్రమం అది. కానీ షూటింగ్‌కు చెన్నై వెళ్లాలి. డాక్టర్‌ నన్ను ట్రావెల్‌ చేయవద్దన్నారు. దాంతో ప్రోగ్రామ్‌ క్యాన్సిల్‌ చేసుకున్నా. ఆ తర్వాత దాదాపుగా నా వృత్తికి దూరమయిపోయా! ఇప్పుడు పిల్లలకు నాలుగున్నరేళ్లు. అంతకు ముందు ఏడాది... అంటే ఐదున్నరేళ్లు కెరీర్‌కు దూరంగా ఉన్నా ఏ ఒక్క రోజూ బాధపడలేదు. నా పిల్లలే నా ప్రపంచమైపోయారు. 


అది తలుచుకొంటే కన్నీళ్లు ఆగవు... 

నా పిల్లలే నాకు ప్రపంచమైపోవడానికి మరొక కారణం కూడా ఉందేమో అనిపిస్తుంది. దాదాపు ఆరున్నరేళ్ల క్రితం జరిగిన ఘటన అది! తలుచుకుంటే ఇప్పటికీ నాకు కన్నీళ్లు ఆగవు. ఆ బాధను ఎలా తట్టుకున్నానా అని నాకే ఆశ్చర్యమేస్తుంది. ఈ విషయాన్ని ఇప్పటిదాకా ఎవరితోనూ పంచుకోలేదు. ఎందుకో ఇప్పుడు చెప్పాలనిపిస్తోంది. ఆరున్నరేళ్ల క్రితం - నేను మొదటిసారి గర్భవతినయ్యా. డాక్టర్‌ నన్ను ప్రయాణాలు చేయవద్దన్నారు. కానీ అప్పటికే అమెరికాలో మూడు షోలు ఒప్పుకొన్నా. తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడ కూడా మంచి వైద్యం అందుబాటులో ఉంటుందన్న ఽధైర్యంతో అమెరికాకు వెళ్లా. ఒక షో పూర్తయింది. ఎందుకైనా మంచిదని న్యూయార్క్‌లో డాక్టర్‌ దగ్గరకు వెళ్లి స్కానింగ్‌ తీయించుకున్నా. అంతా బావుంది. స్కానింగ్‌లో చక్కని చుక్క నా పొట్టలో తిరుగుతోంది. రెండో షో పూర్తయింది. కొద్దిగా బ్లీడింగ్‌ మొదలయింది. డాక్టర్‌ దగ్గరకు వెళ్లా. ఏమి పర్వాలేదన్నారు. ఆ తర్వాత ఒకరోజు హోటల్‌లో ఉన్నాం. ఫ్రెండ్స్‌ వచ్చారు. డిన్నర్‌ చేస్తున్నాం. టీవీలో ఏదో హారర్‌ ఫిల్మ్‌ వస్తోంది. నాకు హారర్‌ ఫిల్మ్స్‌ అంటే భయం. ఒక భయంకరమైన సీను వచ్చింది. వెంటనే చిన్న పాటి కుదుపు. నాలోంచి ఏదో ఆత్మ పైకి ఎగిరిపోయినభావన. వెంటనే విపరీతమైన బ్లీడింగ్‌ కావడం మొదలయింది. ఆసుపత్రికి వెళ్లాం. అప్పటికే అంతా అయిపోయింది. ఇప్పటికీ ఆ క్షణాలు తలుచుకుంటే చాలు... గుండె ఆగినంత పనవుతుంది. ఆ ఘటన జరిగిన ఏడాది తర్వాత మళ్లీ గర్భవతినయ్యా. కవలలు పుట్టారు. భగవంతుడు ఒక బిడ్డను తీసుకుపోయి... ఇద్దరిని ఇచ్చాడు. 


అనుక్షణం వారి వెంటే... 

చాలా మంది పిల్లలను పెంచటం చాలా కష్టమనుకుంటారు. ఎవరో ఒకరి సాయం తీసుకుంటారు. నేను మాత్రం ఎవరి సాయం తీసుకోలేదు. స్నానం చేసి బట్టలు వేయటం దగ్గర నుంచి వంట వండి తినిపించటం దాకా అన్నీ నేనే చేస్తా. నా చిన్ని ప్రపంచంలో వారిద్దరే యువరాణులు. అన్నీ వాళ్ల చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. కవలలు రెండు రకాలుగా ఉంటారు. ఒకే విధమైన పోలికలతో ఉన్నవారిని ఐడెంటికల్‌ ట్విన్స్‌ అంటారు. వేర్వేరు పోలికలు ఉన్నవారిని ఫ్రేటర్నల్‌ ట్విన్స్‌ అంటారు. ఆరాధ్య, నక్షత్రలు ఫ్రేటర్నల్‌ ట్విన్స్‌. చూడటానికి కాదు... వారి వ్యక్తిత్వాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఆరాధ్యకు పూర్తిగా నా పోలికలే వచ్చేశాయి. దానికీ హారర్‌ సినిమాలంటే భయం. నక్షత్ర అసలు దేనికీ భయపడదు. వాళ్లిద్దరూ పుట్టిన తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. ముందుకన్నా క్షమాగుణం పెరిగింది. స్థిరత్వం వచ్చింది. నా బిడ్డలే కాదు... ఏ బిడ్డ ఏడుస్తున్నా- అయ్యో అనిపిస్తుంది. వెంటనే ఎత్తుకోవాలనిపిస్తుంది. 


ఆ భయం చాలా రోజులు వెంటాడింది... 

నా పిల్లలను ఇంత జాగ్రత్తగా చూసుకోవటానికి కారణం నా చిన్నతనంలో జరిగిన సంఘటనే అనుకుంటా. మా నాన్నగారు నా ఐదో ఏటే చనిపోయారు. అమ్మ, నేను మాత్రమే ఉండేవాళ్లం. అమ్మ ఆయుర్వేద వైద్యం చేసేది. ఆమెకు వేర్వేరు ఊళ్లలో రెండు క్లినిక్‌లు ఉండేవి. వారంలో ఐదు రోజులు ఒక క్లినిక్‌లో... శని, ఆదివారాలు వేరే క్లినిక్‌లో ఉండేది. నాకు ఏడేళ్ల వయస్సు ఉన్నప్పుడు అనుకుంటా- అమ్మ టీవీఎస్‌50 మీద వెళ్తుంటే చీర చెంగు వెనక చక్రంలో పడిపోయింది. అమ్మ కింద పడిపోయింది. ఒళ్లంతా దెబ్బలతో అమ్మను ఇంటికి తీసుకువచ్చారు. ఆమెను చూడగానే విపరీతంగా ఏడుపు వచ్చేసింది. ‘అమ్మకు ఏదైనా అయితే నా బతుకేమిటి?’ అనే భయం నరనరాల్లోనూ వ్యాపించింది. ఆ భయం నన్ను చాలా రోజులు వెంటాడింది. ఇప్పటికీ ఆ ఘటన కల రూపంలో వస్తే ఒళ్లంతా చెమటలు పడతాయి. వెంటనే లేచిపోతా! ఆ భయం వల్లే అనుకుంటా- నా బిడ్డలను నేను క్షణం కూడా వదలను. కొవిడ్‌ సమయంలో ఆ భయం మరింత పెరిగింది. పిల్లలను ఎక్కడికీ వెళ్లనివ్వటం లేదు. కొవిడ్‌ మొదటి దశలోనే నాకు వైరస్‌ సోకింది. చాలా ఇబ్బంది పడ్డాం. కరోనా విషయంలో అందరికీ నేను చెప్పేదొక్కటే... ఈ మహమ్మారిని తట్టుకోవటం అంత సులభం కాదు. అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండండి. మీ మీద మీ కుటుంబం మొత్తం ఆధారపడి ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. కుటుంబంలో ఏ ఒక్కరు లేకపోయినా మొత్తం పరిస్థితులే మారిపోతాయి! 


అనుభూతిని ఆస్వాదించండి...  

చివరగా అందరికీ నేను చెప్పేదొకటే! మాతృత్వం ఒక అందమైన అనుభవం. కేవలం మహిళలకు మాత్రమే పరిమితమైన అనుభవం. ప్రపంచంలో సంపదనంతా ఇచ్చేసినా మగవారు దీనిని అనుభవించలేరు. అలాంటి అనుభవాన్ని, అనుభూతిని ఆస్వాదించండి. ఆనందించండి.. 

హ్యాపీ మదర్స్‌ డే!’’


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.