Advertisement

కలిసి...కదనం!

Sep 27 2020 @ 00:10AM

ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి న్యాయ వ్యవస్థపై గుర్రుగా ఉండటానికి హైకోర్టులో తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడం మాత్రమే కాదనీ, ఆర్థిక నేరస్థులపై పెండింగులో ఉన్న కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడమే ప్రధాన కారణమనీ చెబుతున్నారు. ఈ ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్‌ రమణ నేతృత్వంలోని ధర్మాసనం. అయితే సంబంధిత పిటిషన్‌పై విచారణను తొలుత జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ చేపట్టారు. ఆయన పదవీ విరమణ తర్వాత పిటిషనర్‌ అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ తన పిటిషన్‌ను పరిష్కరించవలసిందిగా న్యాయస్థానాన్ని అర్థించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏడాదిలోపు కేసుల విచారణ పూర్తికావాలన్న ప్రతిపాదనకు సుముఖంగా ఉండటంతో ఆ మేరకు ఆదేశాలు వెలువడ్డాయి. అయితే జగన్మోహన్‌ రెడ్డి మాత్రం తనను లక్ష్యంగా చేసుకునే ఈ ఆదేశాలు జారీ చేశారన్న అభిప్రాయంతో ఉన్నట్టు చెబుతున్నారు. ఫలితంగా న్యాయ వ్యవస్థతో నేరుగా ఢీ కొనడానికి జగన్‌ నిర్ణయించుకున్నారట!


ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టి దాని స్థానంలోకి రావాలంటే బీజేపీకి బలమైన ఆయుధం కావాలి. కుల, మత ప్రాతిపదికన ప్రజలను పోలరైజ్‌ చేయడం తేలిక! జగన్‌ వెనుక క్రైస్తవులు, ముస్లింలు ఉన్నారు. ఇప్పుడు హిందువులను తమ వైపునకు తిప్పుకోగలిగితే తెలుగుదేశం పార్టీ ఫినిష్‌ అవుతుందన్నది బీజేపీ నాయకుల అంచనాగా చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా రూపొందించుకున్న వ్యూహమే ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతోందని అంటున్నారు. హిందువులలో ఒక వర్గం బీజేపీకి మద్దతుగా నిలిచినంత మాత్రాన రాజకీయంగా జగన్‌కి కలిగే నష్టమేమీ లేదు. నష్టమంటూ జరిగితే తెలుగుదేశం పార్టీకి మాత్రమే! అందుకే హిందూ దేవాలయాలపై దాడులు జరిగినప్పుడల్లా బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి అనుమతిస్తున్నారు. జగన్‌ సహకారంతో హిందుత్వ ఎజెండాను రాష్ట్రంలో విస్తరింపజేయాలన్నది బీజేపీ వ్యూహంగా భావిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌–భారతీయ జనతా పార్టీల మధ్య సంబంధాలకు గండి పడిందా? ఈ వారంలో జరిగిన పరిణామాల ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని కేంద్ర మంత్రి అమిత్‌ షా హడావిడిగా ఢిల్లీకి పిలిపించుకోవడం, ఆ తర్వాత రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం ప్రారంభం అవడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇదంతా రెండు పార్టీల మధ్య అవగాహనతోనే జరుగుతోందని భావిస్తున్నవారు కూడా ఉన్నారు. అమరావతి భూముల వ్యవహారంలో మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు, సుప్రీంకోర్టు జడ్జి కుమార్తెలపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేయడంతో జగన్మోహన్‌ రెడ్డిని అమిత్‌ షా పిలిపించుకున్నారు. న్యాయ వ్యవస్థను వివాదంలోకి లాగడమే కాకుండా ప్రత్యక్షంగా ఘర్షణకు దిగడాన్ని ఈ సందర్భంగా అమిత్‌ షా తప్పుబట్టినట్టు వార్తలొచ్చాయి. ఈ పద్ధతి మార్చుకోవాలని జగన్‌ రెడ్డికి కేంద్ర హోం మంత్రి సూచించగా.. ఇంతదూరం వచ్చాక వెనక్కి వెళ్లలేననీ, రాష్ట్రప్రభుత్వం కోరిన విధంగా రాజధాని భూముల విషయంలో సీబీఐ విచారణ జరిపించాలనీ ముఖ్యమంత్రి వాదించినట్టు విశ్వసనీయ వర్గాల భోగట్టా! ఇరువురి మధ్య రెండు దఫాలుగా సమావేశం జరిగినా.. అవగాహన మాత్రం కుదరలేదన్నది ఢిల్లీ వర్గాల సమాచారం. జగన్‌ రెడ్డి ఢిల్లీ నుంచి తిరుపతికి తిరుగు ప్రయాణం అయ్యారో లేదో వైసీపీ ఎంపీలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ న్యాయ వ్యవస్థపై విమర్శలు చేశారు. అదే సమయంలో మంత్రి కొడాలి నాని తిరుపతిలో మాట్లాడుతూ– ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఏ భార్యను వెంటబెట్టుకుని రామ మందిరం శంకుస్థాపనకు వెళ్లారు? ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దాస్‌ సతీసమేతంగా శుభకార్యక్రమాల్లో పాల్గొంటున్నారా?’’ అని నిలదీశారు.


దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకులు భగ్గుమన్నారు. మంత్రి నానిని బర్తరఫ్‌ చేయాలని ఆందోళన కూడా చేశారు. ఇదంతా గమనించినప్పుడు రెండు పార్టీల మధ్య చెడిందన్న భావన సహజంగానే ఏర్పడుతుంది. అయితే రాష్ట్రంలో మాటల యుద్ధం జరుగుతుండగానే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించిన వ్యవసాయ బిల్లులకు వైసీపీ ఎంపీలు రాజ్యసభలో మద్దతు ఇవ్వడం గమనార్హం! కీలకమైన బిల్లుల ఆమోదం కోసం బీజేపీకి రాజ్యసభలో వైసీపీ సహకారం అవసరం. ఆ కారణంగా జగన్మోహన్‌ రెడ్డితో బీజేపీ పెద్దలు పూర్తిగా తెగదెంపులు చేసుకోలేరన్న అభిప్రాయం కూడా ఉంది. అదే సమయంలో న్యాయ వ్యవస్థకు రక్షణగా నిలిచామన్న అభిప్రాయాన్ని సంబంధిత వర్గాలకు చేరవేయడం కోసం జగన్‌ రెడ్డిని కేంద్ర హోం మంత్రి ఢిల్లీకి పిలిపించుకున్నారనీ, అంతేతప్ప వైసీపీతో తెగదెంపులు కాదనీ మరో వాదన వినిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి న్యాయ వ్యవస్థపై గుర్రుగా ఉండటానికి హైకోర్టులో తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడం మాత్రమే కాదనీ, ఆర్థిక నేరస్థులపై పెండింగులో ఉన్న కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడమే ప్రధాన కారణమనీ చెబుతున్నారు. ఈ ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్‌ రమణ నేతృత్వంలోని ధర్మాసనం. అయితే సంబంధిత పిటిషన్‌పై విచారణను తొలుత జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ చేపట్టారు. ఆయన పదవీ విరమణ తర్వాత పిటిషనర్‌ అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ తన పిటిషన్‌ను పరిష్కరించవలసిందిగా న్యాయస్థానాన్ని అర్థించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏడాదిలోపు కేసుల విచారణ పూర్తికావాలన్న ప్రతిపాదనకు సుముఖంగా ఉండటంతో ఆ మేరకు ఆదేశాలు వెలువడ్డాయి. అయితే జగన్మోహన్‌ రెడ్డి మాత్రం తనను లక్ష్యంగా చేసుకునే ఈ ఆదేశాలు జారీ చేశారన్న అభిప్రాయంతో ఉన్నట్టు చెబుతున్నారు.


ఫలితంగా న్యాయ వ్యవస్థతో నేరుగా ఢీ కొనడానికి జగన్‌ నిర్ణయించుకున్నారట! కేంద్రంలోని బీజేపీ పెద్దల మాటను జగన్‌ జవదాటరన్న అభిప్రాయం విస్తృతంగా ఉన్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి కల్పించుకుని ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిపించుకుని ఉంటారు. జగన్‌ రెడ్డి న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నప్పటికీ.. కేంద్రం పట్టించుకోవడం లేదన్న అపప్రథ తమకు చుట్టుకోకుండా ఉండటానికే అమిత్‌ షా ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఏదిఏమైనా ముఖ్యమంత్రి హస్తినకు వెళ్లి వచ్చిన తర్వాత రెండు పార్టీల మధ్య బెడిసికొట్టిందా? అన్న అభిప్రాయం మాత్రం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని ప్రధానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఒక మంత్రి చేసిన వ్యాఖ్యల తప్పొప్పులను ప్రభుత్వ సలహాదారు నిర్ణయించడం ఏమిటో తెలియదు! కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని బీజేపీ నాయకులు ఆందోళన చేసినప్పటికీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మాత్రం మౌనం వీడలేదు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మంత్రిని మందలించిన దాఖలాలు కూడా కనిపించలేదు. కొడాలి నాని కూడా తన వ్యాఖ్యల పట్ల కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. దీన్ని బట్టి అవసరమైతే బీజేపీ పెద్దలతో కూడా ఢీకొనడానికి తాము సిద్ధమేనన్న సందేశాన్ని జగన్‌ రెడ్డి ఇచ్చినట్టుగా భావించవచ్చు. రాజకీయ ప్రత్యర్థులను అడ్డగోలుగా తిట్టిపోయడానికి కొందరు మంత్రులను, శాసనసభ్యులను ముఖ్యమంత్రి నియమించుకున్నారు. అలాంటివారిలో కొడాలి నాని ముందువరసలో ఉన్నారు. కృష్ణా జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడాలి నాని భాష విన్నవారికి ఏవగింపు కలుగుతుంది. జగన్‌ రెడ్డికి మాత్రం ఇంపుగా ఉండివుండవచ్చు. లేనిపక్షంలో మంత్రిని ఆయన ఎప్పుడో కట్టడి చేసి ఉండేవారు. కృష్ణా జిల్లాలో ఒకప్పుడు ఉద్దండులైన నాయకులు ఉండేవారు. ప్రజా జీవితంలో ఉన్నవారందరూ ఆదర్శప్రాయంగా జీవించారు. అలాంటి వారసత్వం ఉన్న జిల్లా నుంచి ఇప్పుడు కొడాలి నాని వంటివారు మంత్రిగా ఉండడం ఆ జిల్లా ప్రజలకు అవమానకరం. నిజానికి కొడాలి నాని భాష అలా ఉండివుండకపోతే ఆ సామాజికవర్గం నుంచి ఆయనకు మంత్రి పదవిని ముఖ్యమంత్రి ఇచ్చివుండేవారు కాదన్న అభిప్రాయం కూడా ఉంది.


మత రాజకీయం!

కొడాలి నాని వ్యాఖ్యలు దుమారం రేపకముందే తిరుమలలో బ్రహ్మోత్సవాలకు పట్టువస్ర్తాలు తీసుకెళ్లిన జగన్మోహన్‌ రెడ్డి క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నందున.. శ్రీ వెంకటేశ్వరుడిపై తనకు నమ్మకం ఉందన్న డిక్లరేషన్‌ ఇవ్వాలని తెలుగుదేశం, బీజేపీ డిమాండ్‌ చేశాయి. ముఖ్యమంత్రి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా పట్టువస్ర్తాలు సమర్పించి వెళ్లిపోయారు. తిరుమలలో స్వామివారి దర్శనానికి వెళ్లే అన్యమతస్థులు డిక్లరేషన్‌ ఇవ్వాలన్న నిబంధన రాష్ట్రప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవోలోనే ఉంది. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అబ్దుల్‌ కలాం వంటివారు ఈ నిబంధనకు అనుగుణంగా డిక్లరేషన్‌ ఇవ్వగా.. మరికొందరు ప్రముఖులు పట్టించుకోలేదు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం అభ్యంతరకరంగా అనిపిస్తుంది కానీ, ఈ వివాదం ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి విషయంలోనే ఎందుకు తలెత్తింది? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన డిక్లరేషన్‌ ఇవ్వాలని ఏ రాజకీయ పార్టీ కూడా కోరలేదు. ఇప్పుడు మాత్రమే ఈ వివాదం తెర మీదకు రావడంతో రాష్ట్రంలో మత రాజకీయాలకు బీజం పడినట్టుగా భావించవలసి ఉంటుంది. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరగడం, రథాలను, విగ్రహాలను ధ్వంసం చేస్తూ పోవడాన్ని బట్టి ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతున్నదా? అన్న అనుమానం కలుగకమానదు. అంతర్వేదిలో రథం తగులబడినా, విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో వెండిసింహాలు మాయం అయినా, వాటి వెనుక తెలుగుదేశం పార్టీ ఉందని అధికార పార్టీకి చెందినవారు విమర్శిస్తున్నారు గానీ, తెర వెనుక మాత్రం ఏదో జరుగుతోందన్న అనుమానం బలంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కుల రాజకీయాలనే చూశాం. ఇకపై మత రాజకీయాలను చూడబోతున్నామా? అన్న సందేహం కలుగుతోంది. దేవాలయాలపై వరుసగా దాడులు జరగడాన్ని యాదృచ్ఛికం అని కొట్టిపారేయలేం. ప్రభుత్వం తలుచుకుంటే ఇలాంటి దుశ్చర్యలను ఆదిలోనే అరికట్టవచ్చు. కానీ అలా జరగడం లేదు. ఈ సంఘటనల వల్ల ఎవరికి లాభం అన్నది ఇప్పుడు చూద్దాం.


రాష్ట్రంలో మత ప్రాతిపదికన రాజకీ యాలకు బీజం పడితే లాభపడేది భారతీయ జనతా పార్టీనే! నిజానికి రాష్ట్రంలో ఆ పార్టీకి పెద్దగా పట్టు లేదు. అందుకే గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ మాట్లాడటం ఏమిటి? అని మంత్రి కొడాలి నాని ఈసడించుకోగలిగారు. ఈ నేపథ్యంలో హిందూ దేవాలయాలపై వరుస దాడులతో బీజేపీ క్రియాశీలకం అయింది. హిందువుల మనోభావాలను తామే కాపాడతామన్న అభిప్రాయాన్ని వ్యాపింపజేయడానికి కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. దీన్నిబట్టి వైసీపీ–బీజేపీ స్పష్టమైన అవగాహనతోనే ఉన్నాయని పలువురు అనుమానిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టి దాని స్థానంలోకి రావాలంటే బీజేపీకి బలమైన ఆయుధం కావాలి. కుల, మత ప్రాతిపదికన ప్రజలను పోలరైజ్‌ చేయడం తేలిక! ముఖ్యమంత్రి జగన్‌ వెనుక క్రైస్తవులు, ముస్లింలు ఉన్నారు. ఇప్పుడు హిందువులను తమ వైపునకు తిప్పుకోగలిగితే తెలుగుదేశం పార్టీ ఫినిష్‌ అవుతుందన్నది బీజేపీ నాయకుల అంచనాగా చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా రూపొందించుకున్న వ్యూహమే ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతోందని అంటున్నారు. హిందువులలో ఒక వర్గం బీజేపీకి మద్దతుగా నిలిచినంత మాత్రాన రాజకీయంగా జగన్మోహన్‌ రెడ్డికి కలిగే నష్టమేమీ లేదు. నష్టమంటూ జరిగితే తెలుగుదేశం పార్టీకి మాత్రమే! అందుకే హిందూ దేవాలయాలపై దాడులు జరిగినప్పుడల్లా బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి అనుమతిస్తున్నారు. ఇదే తరహా ఆందోళనలు తెలుగుదేశం పార్టీ చేపట్టి ఉంటే కఠినంగా వ్యవహరించి ఉండేవారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే కేసులకు భయపడి ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు. కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించి బీజేపీ కార్యకర్తలు మాత్రం వీధుల్లోకి రాగలుగుతున్నారు. రాష్ర్టాన్ని మత ప్రాతిపదికన విడగొట్టడానికి ఢిల్లీ స్థాయిలోనే అవగాహన కుదిరిందో లేదో తెలియదు. బీజేపీలో ఉన్న చంద్రబాబు వ్యతిరేకులంతా ఇటీవల కాలంలో క్రియాశీలకం అయ్యారు. విగ్రహాలను ధ్వంసం చేసిన సందర్భాలలో కూడా ముందుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును తిట్టి, ఆ తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి మీదకు వెళుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏ భార్యను తీసుకుని అయోధ్యకు వెళ్లారని మంత్రి కొడాలి నాని ప్రశ్నించినా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మౌనంగా ఉండటం బీజేపీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


అయితే వీర్రాజు ఒక వ్యూహం ప్రకారమే ప్రతిదాడి చేయలేదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి సహకారంతో హిందుత్వ ఎజెండాను రాష్ట్రంలో విస్తరింపజేయాలన్నది బీజేపీ వ్యూహంగా భావిస్తున్నారు. వైసీపీ–బీజేపీ అనుసరిస్తున్న ఎత్తుగడలను గమనించిన తెలుగుదేశం పార్టీ కూడా హిందువుల తరఫున పోరాడటానికి సిద్ధపడుతున్నట్టు చెబుతున్నారు. నిజంగానే వైసీపీ–బీజేపీ మధ్య అవగాహన ఉందా? లేక ఢిల్లీ పరిణామాలు సూచిస్తున్నట్టుగా రెండు పార్టీల మధ్య చెడిందా? అన్నది తేలడానికి మరి కొంతకాలం వేచిచూడాల్సిందే! అది అలా ఉంచితే, హిందూ ప్రార్థనా మందిరాలపై దాడుల విషయంలో కొంతమంది పీఠాధిపతులు, మఠాధిపతులు వ్యవహరిస్తున్న తీరు ప్రశ్నార్థకంగా ఉంది. గతంలో ఏ చిన్న సంఘటన జరిగినా తీవ్ర విమర్శలు చేసిన స్వాములు.. ఇప్పుడు వరుస సంఘటనలు జరుగుతున్నప్పటికీ మౌనాన్ని ఆశ్రయించడంలోని ఆంతర్యం ఏమిటో తెలియదు. మేధావుల బాటలో స్వాములు కూడా ముఖ్యమంత్రికి భయపడిపోతున్నారా? లేక ఇతరత్రా ప్రలోభాలకు లొంగిపోతున్నారా? అన్నది తేలాల్సి ఉంది. విశాఖ శారదాపీఠానికి చెందిన స్వరూపానందనే తీసుకుందాం. గతంలో ఏం జరిగినా అపచారమని ఘోషించిన ఈ స్వామి ఇప్పుడు అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఆనందిస్తున్నారు. అవును మరి.. మంత్రులు, అధికారులు ఆయన ముందు మోకరిల్లుతున్నారు కదా! హిందువులందరికీ ఆయనే ఏకైక ప్రతినిధి అన్నట్టుగా రాష్ట్రప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. ఇంతకాలం పెద్దగా గుర్తింపునకు నోచుకోని ఈ స్వామికి ఇంతకంటే ఏమి కావాలి! అంతర్వేదిలో కాలిపోయిన రథం స్థానంలో కొత్త రథాన్ని ఉత్కృష్టమైన కలపతో చేయించాలని స్వరూపానంద సెలవిచ్చారని మంత్రులు చెప్పుకొచ్చారు. దేవాలయాలకు చెందిన రథాలను నాణ్యమైన కలపతో కాకుండా మునగచెట్టు, జిల్లేడు చెట్టుతో చేయిస్తారా? జరుగుతున్న దాన్ని బట్టి మన స్వాములలో కొందరు సర్వసంగ పరిత్యాగులు కాదని నమ్మాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రులు తమ వద్దకు రావాలనీ, తద్వారా తమ పరపతి పెరగాలనీ సదరు స్వాములు కోరుకుంటున్నట్టుగా ఉంది. సన్యసించినవారికి రాజకీయాలు ఎందుకు? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. హిందూ ధర్మాన్ని మాత్రమే మనసా, వాచా ఆచరించే మఠాధిపతులు, పీఠాధిపతులు సాదాసీదా జీవితాన్నే గడుపుతున్నారు. రాజకీయాల రంగులు అంటించుకోరు. దురదృష్టవశాత్తు అలాంటి స్వాములకు ఆదరణ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ముఖ్యమంత్రులు స్పాన్సర్‌ చేసే స్వాములకు మాత్రమే ఇప్పుడు గిరాకీ ఉంటోంది. హిందూ ధర్మానికి ఇలాంటి వారే ఇప్పుడు దిక్సూచి కావడం నిజంగా విషాదమే!


డ్రగ్స్‌ వార్తల కనువిందు!

ఇక చలనచిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్‌ విషయానికి వద్దాం. బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ హీరోలు, హీరోయిన్లకు డ్రగ్స్‌ వాడకంతో సంబంధం ఉన్నట్టు నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో లీకులు ఇవ్వడమే కాకుండా కొంతమందికి నోటీసులు కూడా జారీ చేయడంతో న్యూస్‌ చానెళ్లకు, ముఖ్యంగా జాతీయ చానెళ్లకు మంచి మేత దొరికింది. దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలన్నీ గాలికి పోయాయి. కొవిడ్‌ కారణంగా దేశంలో సగటున రోజుకు వెయ్యి మంది మరణిస్తున్నా, రోజూ కొత్తగా దాదాపు లక్ష మందికి వైరస్‌ సోకుతున్నా మీడియాకు అప్రధానం అయిపోయింది. సినీ తారల వ్యక్తిగత జీవితాల పట్ల జనానికి కూడా ఆసక్తి ఉంటుంది కనుక రేటింగ్స్‌ పరంగా కూడా చానెళ్లకు మేలే జరుగుతోంది. ఇంతకీ ఎన్సీబీ చేస్తున్న హడావిడి వల్ల ఏం జరుగుతుందన్న ప్రశ్నకు మాత్రం ఎవరి వద్దా సమాధానం లేదు. ముంబయిలో కొలువుదీరిన నార్కోటిక్స్‌ అధికారులు విచారణ పేరిట ప్రముఖ తారలను పిలిపించుకుంటూ వినోదాన్ని పంచుతున్నారు. ఈ వ్యవహారంలో కేంద్రబిందువైన హీరో సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకుని ఏ లోకాన ఉన్నారో తెలియదు. మధ్యలో తలదూర్చిన కంగనా రనౌత్‌కు కేంద్రప్రభుత్వం సీఆర్పీఎఫ్‌ సిబ్బందితో రక్షణ కల్పించింది. ఆమె ఎవరి పేరు పలికితే వారికి నోటీసులు పంపుతున్నారు. ఎప్పుడో రెండేళ్ల క్రితం జరిగాయని చెబుతున్న చాటింగ్‌ల ఆధారంగా ఎన్సీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం ప్రకారం మత్తుమందులు వినియోగించినవారు అధికారులకు దొరికితే ఆరు నెలల శిక్ష పడుతుంది.


ఈ శిక్ష పడాలంటే ఎవరైనా మత్తుమందు వాడుతున్నప్పుడు అధికారులకు పట్టుబడాలి. లేనిపక్షంలో మత్తు పదార్థాలు వాడిన రెండురోజుల లోపు వారు వాటిని వాడినట్లు అధికారులు ఆధారాలతో రుజువు చేయాలి. ఇప్పుడు ఎన్సీబీ చేస్తున్న విచారణ అంతా ఎప్పుడో జరిగిన చాటింగ్‌ ఆధారంగా మాత్రమే కావడం గమనార్హం! చాటింగ్‌ ఆధారంగా ఫలానావారు రెండేళ్ల క్రితం మత్తుపదార్థాలు వాడినట్టుగా అధికారులు రుజువు చేయలేరు. అలాంటప్పుడు ఈ హడావిడి అంతా ఎందుకు అంటే రాజకీయం! కేంద్రప్రభుత్వ నిర్ణయాలు, విధానాలకు వ్యతిరేకంగా బాలీవుడ్‌లో నిరసన స్వరాలు వినిపిస్తుంటాయి. ఈ స్వరాలను అదుపు చేయడానికి ప్రస్తుత విచారణ ఉపయోగపడుతుంది. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా ప్రముఖ హీరోయిన్‌ దీపికా పదుకోన్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా ‘‘మాల్‌ హై క్యా’’ అని ఎప్పుడో ఆమె అడిగిందని చెప్పి అధికారులు ఇప్పుడు విచారణ చేస్తున్నారు. కొంతకాలం క్రితం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి హడావిడే జరిగింది. తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు డ్రగ్స్‌ వాడినట్టుగా ప్రచారం జరగడం, రాష్ట్ర ఎక్సైజ్‌ అధికారులు అనుమానితుల జాబితాలో ఉన్న నటీనటులను రోజుల తరబడి విచారించడాన్ని చూశాం. చివరకు ఏం తేల్చారు. అంటే, అధికారుల నుంచి సమాధానం ఉండదు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం సదరు విచారణ ఉపయోగపడింది. పరువు కోసం తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రభుత్వం ముందు మోకరిల్లింది. అంతే అప్పటినుంచి ఘనత వహించిన మన చిత్రపరిశ్రమ పెద్దలు అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కీర్తించడాన్ని మనం చూస్తున్నాం. ముంబయిలో ఎన్సీబీ అధికారులు ఆడుతున్న డ్రామా తర్వాత బాలీవుడ్‌లో నిరసన గళాలన్నీ కేంద్రప్రభుత్వానికి దాసోహం అవుతాయేమో తెలియదు. అప్పటివరకు ప్రజలకు వినోదం పంచడానికి మన జాతీయ మీడియా ఏమాత్రం మొహమాటం లేకుండా పోటీలు పడి మరీ చర్చలు నిర్వహిస్తూ తరించిపోతూనే ఉంటుంది!

ఆర్కే

 

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.