మరుగుదొడ్లలో మాయ

ABN , First Publish Date - 2021-02-27T06:33:24+05:30 IST

బహిరంగ మల, మూత్ర

మరుగుదొడ్లలో మాయ

క్వాలిటీని పట్టించుకోని జీహెచ్‌ఎంసీ

పలు ప్రాంతాల్లో పాడవుతోన్న టాయిలెట్లు

రూ.30 కోట్ల వరకు ఖర్చు ఒక్కో టాయిలెట్‌కు 

రూ.3 నుంచి రూ.7 లక్షలు 

నిర్వహణ పేరిట రూ.25 కోట్లకు స్పాట్‌


ఇది జూబ్లీచెక్‌పోస్ట్‌ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టాయిలెట్‌. పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాక ముందే పాడైంది. స్ట్రక్చర్‌ అధ్వానంగా మారింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టాయిలెట్‌లు ప్రారంభించిన మూన్నాళ్లకే  పాడయ్యాయి. మరి కొన్ని ఏరియాల్లో అందుబాటులోకి రాకముందే అధ్వానంగా మారాయి. సివరేజ్‌ పైపులైన్‌కు అనుసంధానం చేయకుండా, నీటి వసతి కల్పించకుండా వదిలేయడంతో చాలా ప్రాంతాల్లో మరుగు దొడ్లు అలంకారప్రాయంగా మారాయి. నిర్వహణ పనుల పర్యవేక్షణకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని అధికారులు గొప్పలు చెబుతుండగా, మెజార్టీ టాయిలెట్లు కంపుకొడుతున్నాయి.


హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : బహిరంగ మల, మూత్ర విసర్జనరహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు గ్రేటర్‌లో ఏడు వేల ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఎన్నికల ముందు నిర్ణయించారు. పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టింది. సంస్థ నిధులతో కొన్ని టాయిలెట్లు ఏర్పాటు చేయగా, ఇంకొన్ని బిల్ట్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌(బీఓటీ) పద్ధతిలో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. కెఫేలు ఏర్పాటు చేసుకుంటూ ప్రైవేట్‌ ఏజెన్సీలు టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నాయి. కొన్ని యాడ్‌ ఏజెన్సీలు ప్రకటనల స్పేస్‌ కోసం టాయిలెట్ల ఏర్పాటుకు ముందుకువచ్చాయి. సీటింగ్‌ కెపాసిటీని బట్టి ఒక్కో టాయిలెట్‌కు జీహెచ్‌ఎంసీ రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వెచ్చించింది. దాదాపు 28 నుంచి రూ.30 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. 5 వేలకుపైగా టాయిలెట్ల ఏర్పాటు పూర్తయ్యిందని, ఇందులో మెజార్టీ వినియోగంలోకి వచ్చాయని అధికారులు చెబుతున్నారు. 


నాణ్యత లేకున్నా... 

నగరంలో రోడ్ల పక్కన ఏర్పాటు చేసే వస్తువులకు రక్షణ ఉండదన్నది గతంలో పలుమార్లు రుజువైంది. చెత్త బుట్టలు విరిగిపోవడం, దొంగిలించడం, చివరకు మ్యాన్‌హోల్‌ కవర్లూ తీసుకెళ్లి కొందరు అమ్ముకున్న ఉదంతాలూ ఉన్నాయి. గత అనుభవాల నేపథ్యంలో రోడ్ల పక్కన ఏర్పాటు చేసే వస్తువులు/స్ట్రక్చర్లకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలన్న కనీస విషయాన్ని జీహెచ్‌ఎంసీ మరిచింది. దీంతో రక్షణా చర్యలు తీసుకోకుండా ఏర్పాటు చేసిన ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టాయిలెట్లు విరిగిపోతున్నాయి. కొన్నిచోట్ల గుర్తు తెలియని వ్యక్తులు పాడు చేస్తుండగా, మరి కొన్నిప్రాంతాల్లో నాణ్యతా లోపం కారణమవుతోంది. దీంతో వాటిని వినియోగించుకునే పరిస్థితి కూడా ఉండడం లేదు. నిర్వహణ సరిగా లేక, స్ట్రక్చర్లు అధ్వానంగా మారి చాలా ప్రాంతాల్లో టాయిలెట్లు నిరూపయోగంగా మారుతున్నాయి. ఏర్పాటుకు ముందు నాణ్యతా ప్రమాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోక పోవడం వల్లే ఈ దుస్థితి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం వ్యవహారంలో ఏజెన్సీలకు మేలు చేసేలా కొందరు అధికారులు వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. 


ఏజెన్సీలకు బాధ్యతలు

క్షేత్రస్థాయిలో టాయిలెట్లు పూర్తిస్థాయిలో అందుబాటులో లేని పరిస్థితి ఉండగా, నిర్వహణ ఖర్చు పేరిట యేటా జీహెచ్‌ఎంసీ రూ.22 కోట్ల నుంచి రూ.25 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతోంది. క్లస్టర్ల వారీగా టాయిలెట్ల మెయింటెనెన్స్‌ బాధ్యతలను పలు ఏజెన్సీలకు అప్పగించారు. నిత్యం రెండు పర్యాయాలు టాయిలెట్లు శుభ్రపర్చాలని సూచిస్తూ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడాన్ని తప్పనిసరిగా మార్చారు. అయినా, చాలా ప్రాంతాల్లో మరుగుదొడ్లు దుర్గంధపూరితంగా మారాయి. కొన్ని టాయిలెట్ల వద్ద క్యూఆర్‌ కోడ్‌ కనిపించడం లేదు. ఇది ఎవరి పని అన్నదీ ప్రశ్నార్థకంగా మారింది. మొత్తంగా ప్రజల అవసరాల పేరిట పన్నుల రూపంలో వారు చెల్లిస్తోన్న కోట్ల రూపాయలను కొందరు కుమ్మక్కై కొల్లగొడుతున్నారు.

Updated Date - 2021-02-27T06:33:24+05:30 IST