ఆటల పండుగ

ABN , First Publish Date - 2021-07-24T06:05:52+05:30 IST

విశ్వక్రీడల సంరంభానికి తెరలేచింది. టోక్యో వేదికగా ఆరంభమైన ఈ క్రీడలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోని ఉత్తమోత్తమ క్రీడాకారుల సమాహారమైన ఈ పండుగలో పాల్గొంటే చాలన్నదే ప్రతి ఒక్కరి ఆకాంక్ష. అంతటి....

ఆటల పండుగ

విశ్వక్రీడల సంరంభానికి తెరలేచింది. టోక్యో వేదికగా ఆరంభమైన ఈ క్రీడలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోని ఉత్తమోత్తమ క్రీడాకారుల సమాహారమైన ఈ పండుగలో పాల్గొంటే చాలన్నదే ప్రతి ఒక్కరి ఆకాంక్ష. అంతటి ఉత్కృష్టమైన పోటీల్లో విజేతగా నిలిచి దేశ ప్రతిష్ఠను సమున్నతం చేసే సదవకాశం లభిస్తే అథ్లెట్లు జన్మధన్యమైనట్టే భావిస్తారు. ఇప్పుడలాంటి అరుదైన అవకాశమే మన దేశం నుంచి వెళ్లిన భారీ బలగానికీ దక్కింది. మొత్తం 127 మంది అథ్లెట్లు 18 ఈవెంట్లలో పాల్గొంటున్నారు. ఇక 41 క్రీడాంశాల్లో 339 ఈవెంట్ల కోసం ప్రపంచవ్యాప్తంగా సుమారు 11 వేల పైచిలుకు అథ్లెట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. 


నిజానికి, అడుగడుగునా సవాళ్లను ఎదుర్కొంటూనే ఈ ఆటల పండుగకు జపాన్‌ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ప్రభుత్వం ఎంతో ధైర్యంతో ఓకే చెప్పినా అక్కడి పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులాగానే ఉంది. ఈ ఒలింపిక్స్‌ మాకొద్దంటూ ఆ దేశంలో నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వేల మంది అథ్లెట్లు, అధికారులు, వాలంటీర్లు, మీడియా గుమికూడే టోక్యోలో ప్రస్తుతం అత్యయికస్థితి అమల్లో ఉంది. ఆ మాటకొస్తే.. కొవిడ్‌ విజృంభిస్తే ఒలింపిక్స్‌ను ఏ క్షణాన్నయిన రద్దుచేసే అవకాశాలనూ కొట్టివేయలేమంటూ స్వయంగా క్రీడల సీఈఓ చెప్పడం గుబులు రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఏడాదిపాటు వాయిదాపడిన ఈ పోటీలు సవ్యంగా సాగాలనే అందరూ ఆకాంక్షిస్తున్నారు. ప్రేక్షకులకు అనుమతి ఇవ్వకపోయినా జపాన్‌లోని వైద్య నిపుణులు మాత్రం ప్రభుత్వ చర్యల్ని తప్పుపడుతున్నారు. దేశంలో కేవలం 21 శాతం మందికే కొవిడ్‌ టీకా ఇచ్చారు. అలాగే బయటినుంచి అతిథుల సంఖ్యను కూడా పరిమితం చేయాలని కోరుతున్నారు. ఎలాగోలా ఈ ఒలింపిక్స్‌ పూర్తయినా.. వచ్చే నెల్లోనే పారా ఒలింపిక్స్‌ కూడా మొదలవుతాయి. అదీ ఒక సవాలే. ఇవన్నీ జపాన్‌ ఆర్ధిక సమస్యలకు అదనం. కొవిడ్‌ కారణంగా తడిసి మోపెడైన బడ్జెట్‌తో ఆ దేశం అల్లల్లాడుతోంది. 


ఈసారి విశ్వక్రీడల్లో వివిధ దేశాలు సాధించే పతకాల సంఖ్యపై ఓ సంస్థ ఇటీవల సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం అమెరికా, రష్యా, చైనా, జపాన్‌ దేశాలు తొలి నాలుగు స్థానాల్లో నిలుస్తాయట. అయితే భారత్‌ 19 పతకాలు సాధిస్తుందని, జాబితాలో మన స్థానం 18 అని కూడా తేల్చేసింది. ఏదేమైనా 2016 రియో ఒలింపిక్స్‌లో అందుకున్న రెండు పతకాలను అధిగమించి ఈసారి రెండంకెల సంఖ్యలో మెడల్స్‌ మోసుకొస్తారని దేశం ఎదురుచూస్తోంది. డబుల్‌ డిజిట్‌లో పతకాలు తెస్తారన్న మాట మరీ అతిశయోక్తిగా ఉన్నదని క్రీడా నిపుణుల వాదన. ఎవరి అంచనాలు ఎలావున్నా నానాటికీ తీసికట్టుగా తయారవుతున్న మన క్రీడా వ్యవస్థనుంచి అరడజను కంటే పతకాలు ఆశించడం అత్యాశే. తెలుగమ్మాయి పీవీ సింధుతోపాటు వినేశ్‌ ఫొగట్‌, నీరజ్‌ చోప్రా, దీపికా కుమారి, బజ్‌రంగ్‌ పూనియా తదితరులు పతకాల రేసులో ముందున్నారు. 


ప్రతి ఒలింపిక్స్‌కు ముందు చర్చించుకునే అంశమే అయినా అసలు పతక సాధనలో మన దుస్థితికి కారణాలు అనేకం. పాఠశాల నుంచి విశ్వవిద్యాలయాలదాకా ఏ స్థాయిలోనూ చెప్పుకోదగ్గ సదుపాయాల్లేవు. నిజం చెప్పాలంటే మనదేశంలో అసలు క్రీడా సంస్కృతే లేదు. ఒలింపిక్స్‌లో భారత్‌ గత 120 ఏళ్ళలో అందుకున్న స్వర్ణాల సంఖ్య, అమెరికా స్విమ్మర్‌ మైకేల్‌ ఫెల్ప్స్‌ ఒకే విశ్వక్రీడలో సాధించిన వాటితో దాదాపు సమానం. తలసరి ఆదాయం మనకంటే తక్కువగా ఉన్న కెన్యా, జమైకా లాంటి దేశాలు కూడా పతకాలు నెగ్గుతున్నాయి. దేశం తరపున ఒకటీ అరా పతకాలు వస్తున్నాయంటే అది ఆయా క్రీడాకారుల ప్రతిభాపాటవాల వల్లే తప్ప, మన క్రీడా వ్యవస్థ గొప్పతనంతో కాదు. భారత్‌లో క్రీడా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. చదువే ముఖ్యమని, ఆటలు సరదాకే తప్ప కెరీర్‌గా తీసుకోలేమని భావించినంతకాలం ఈ పరిస్థితి మారదు. ప్రభుత్వాలు క్రీడలకు కేటాయించే నిధులను ఖర్చు చేయడంలో పారదర్శకత లేకపోవడం, ఆటల్ని కెరీర్‌గా ఎంచుకునేవారిని పట్టించుకోకపోవడం, రాజకీయ జోక్యం, క్రీడా సంఘాల కుమ్ములాటల్ని నిరోధించనంత కాలం విశ్వక్రీడల్లో పురోగతిని ఆశించలేం. ఈ దిశగా ఓ సుదీర్ఘ ప్రణాళిక అవశ్యం. క్రీడారంగంలోని అవలక్షణాలన్నింటినీ చక్కదిద్దే దిశగా రాబోయేరోజుల్లోనైనా అడుగులు పడతాయని ఆశిద్దాం.

Updated Date - 2021-07-24T06:05:52+05:30 IST