చిల్లర రాజకీయాలు సహించం

ABN , First Publish Date - 2022-01-20T05:31:10+05:30 IST

‘రాశిలో, వాసిలో, దమ్ములో దేంట్లోనూ తెలంగాణకు సాటిలేదు. తుపాకీ గుండులాంటి తెలంగాణతో పెట్టుకోవద్దు. తెలంగాణ అభ్యున్నతి కోసం అహరహం శ్రమిస్తోన్న సీఎం కేసీఆర్‌పై చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదు.’ అని ఎక్సైజ్‌, క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు.

చిల్లర రాజకీయాలు సహించం
కాజ్‌వే నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

రాశిలో, వాసిలో తెలంగాణకు సాటిలేదు : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

సీసీకుంట వద్ద కాజ్‌వే కమ్‌ చెక్‌డ్యామ్‌ నిర్మాణానికి శంకుస్థాపన


మహబూబ్‌నగర్‌, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ‘రాశిలో, వాసిలో, దమ్ములో దేంట్లోనూ తెలంగాణకు సాటిలేదు. తుపాకీ గుండులాంటి తెలంగాణతో పెట్టుకోవద్దు. తెలంగాణ అభ్యున్నతి కోసం అహరహం శ్రమిస్తోన్న సీఎం కేసీఆర్‌పై చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదు.’ అని ఎక్సైజ్‌, క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం సీసీకుంట మండలంలోని ఊకచెట్టు వాగుపై రూ.41 కోట్లతో నిర్మిస్తోన్న కాజ్‌వేకు, సీసీకుంట నుంచి కురుమూర్తి వరకు వేయనున్న సీసీ రోడ్డు పనులకు, అదేవిధంగా కురుమూర్తి ఆలయానికి ఘాట్‌రోడ్డు నిర్మాణానికి ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డితో కలిసి మంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీసీకుంటలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌పై జాతీయ పార్టీల నాయకులు చిల్లర మాటలు మాట్లాడడం ఆపాలన్నారు. సభ్యత, సంస్కారం, హోదా మరిచి చిల్లర వ్యవహారాలు చేయడం తగదన్నారు. 70 ఏళ్ల జాతీయ పార్టీల పాలనలో తెలంగాణ రైతాంగాన్ని, బడుగు, బలహీన వర్గాల వారిని మోసం చేశారని దుయ్యబట్టారు. వాట్సాప్‌లలో, సోషల్‌ మీడియాల్లో తప్పుడు ప్రచారాలు కాకుండా, తెలంగాణకు వారేం చేశారో, ఈయేడేళ్లలో తామేం చేశామో బహిరంగంగా చర్చిద్దామని సవాల్‌ విసిరారు. పది మంది రోడ్డు మీదకు వచ్చి కార్లకు అడ్డం పడితే చేసిన అభివృద్ధి ప్రజలకు తెలియకుండా పోదని, ఈ పిచ్చిచేష్టలు చేయిస్తున్నవారెవరో వారి బండారం త్వరలో బయటపెడతామని హెచ్చరించారు. ప్రతిపక్షాలు అభివృద్ధిలో కలిసిరావాలని, సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పాలమూరు జిల్లాను కోనసీమలా మార్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని అన్నారు.


ప్రతిపక్షాల కుట్రలు: ఆల వెంకటేశ్వరరెడ్డి

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో పాలమూరు జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తుంటే, ఓర్వలే ని ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలతో అభివృద్ధికి అడ్డుపడే కుట్రలు చేస్తున్నాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరెడ్డి విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు  తమ  ప్రభుత్వం కృషి చేస్తే, ప్రతిపక్షాల  నాయకులు కుట్రలు  పన్ని కేసులు వేశారని ఆరోపించారు. ఒక నాయకుడు రైతుబంధు వారోత్సవాలు ఎందుకంటున్నారని, ఇంకో నాయకుడు బ్రిడ్జీలు, కాజ్‌వేలతో అభివృద్ధి జరిగినట్లా అని ప్రశ్నిస్తున్నారని, మరో నాయకుడు చెక్‌డ్యాములు ఎందుకంటున్నారని, సోయిలేకుండా రాజకీయ లబ్ధికోసం మాట్లాడుతున్నారే తప్ప జరుగుతున్న అభివృద్ధిని గుర్తించడం లేదని విమర్శించారు. ఈ యేడేళ్లలో నియోజకవర్గంలో 21 చెక్‌డ్యామ్‌లు నిర్మించామన్నారు. సమావేశంలో టీశాట్స్‌ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ సాయిచంద్‌, అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, ఎంపీపీ హర్ష వర్ధనరెడ్డి, జడ్పీటీసీలు రాజశేఖర్‌రెడ్డి, వట్టెం రాజేశ్వరి, సర్పంచ్‌ మోహన్‌గౌడ్‌, ఎంపీటీసీ ఉషారాణి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కోట రాము, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు కరుణాకర్‌రెడ్డి, నాయకులు రాము, వజీర్‌బాబు, అజయ్‌కుమార్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, సింగల్‌విండో చైర్మన్లు ఉమామహేశ్వరరెడ్డి, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T05:31:10+05:30 IST