రూపాయి ఊగిసలాట సహించం

ABN , First Publish Date - 2022-06-25T09:24:41+05:30 IST

ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి తీవ్ర ఆటుపోట్లకు గురి కావడాన్ని తాము అనుమతించలేమని, భారీ ఆటుపోట్ల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైఖెల్‌.డి.పాత్రా చెప్పారు

రూపాయి ఊగిసలాట సహించం

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైఖెల్‌.డి.పాత్రా

న్యూఢిల్లీ : ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి తీవ్ర ఆటుపోట్లకు గురి కావడాన్ని తాము అనుమతించలేమని, భారీ ఆటుపోట్ల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైఖెల్‌.డి.పాత్రా చెప్పారు. అయితే రూపాయికి నిర్దిష్టస్థాయి ఏదీ నిర్ణయించలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని ఇతర కరెన్సీలతో పోల్చితే రూపాయి క్షీణత తక్కువగానే ఉన్నదంటూ మన చేతిలో ఉన్న 60 వేల కోట్ల విదేశీ మారకం నిల్వలే అందుకు కారణమని పీహెచ్‌డీఐసీసీఐ చాంబర్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ పాత్రా చెప్పారు. ‘‘రూపాయి ఏ స్థాయికి దిగజారుతుందనేది మేం చెప్పలేం, రూపాయి ఒక్కటే కాదు, డాలర్‌ ఏ స్థాయికి చేరుతుందో అమెరికన్‌ ఫెడరల్‌ కూడా చెప్పలేదు’’ అన్నారాయన. రూపాయి స్థిరత్వాన్నే తాము కోరుకుంటున్నామని, అస్తవ్యస్తంగా ట్రేడ్‌ కావడాన్ని ఆమోదించబోమని పాత్రా స్పష్టం చేశారు.  

తగ్గిన ఫారెక్స్‌ నిల్వలు దేశంలో ఫారెక్స్‌ నిల్వలు ఈ నెల 17వ తేదీతో ముగిసిన వారంలో 587 కోట్ల డాలర్లు తగ్గి 59,058.8 కోట్ల డాలర్లకు చేరాయని ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి. ఫారెక్స్‌ నిల్వల్లో ప్రధాన భాగం అయిన విదేశీ కరెన్సీ ఆస్తులు క్షీణించడమే ఇందుకు కారణం. ఇదే వారంలో బంగారం నిల్వలు కూడా 25.8 కోట్ల డాలర్ల మేరకు తగ్గి 4058.4 కోట్ల డాలర్లకు చేరాయి. 

Updated Date - 2022-06-25T09:24:41+05:30 IST