వెండితెర లేడీ విలన్లు!

Apr 27 2021 @ 19:23PM

వెండితెరపై హీరోగా, హీరోయిన్‌గా నటించడం సులభమే! కానీ నెగెటివ్‌ షేడున్న పాత్రలతో మెప్పించడం కాస్త కష్టమే! ఇక మహిళలు తెరపై విలన్లుగా మెప్పించాలంటే సవాల్‌తో కూడిన పనే. అయితే  ఈ విషయంలో ‘మేం ఏ మాత్రం తక్కువ కాదు’ అని గతంలో చాలామంది నటీమణులు నిరూపించారు. ఇప్పుడూ ఆ వరవడి కొనసాగుతోంది. అలా మహిళ్లల్లో విలనీగా మెప్పించిన ఈతరం నాయికలపై ఓ లుక్కేద్దాం...

పవర్‌ఫుల్‌ నీలంబరి...
రమ్యకృష్ణ దక్షిణాది భాషల్లో గ్లామర్‌ డాల్‌గా గుర్తింపు పొందిన కథానాయిక. హీరోయిన్‌గా     గ్లామర్‌ పాత్రలే కాకుండా భక్తిరస చిత్రాల్లో అమ్మవారి పాత్రలతో కూడా మెప్పించారామె!  ఆమెలో రౌద్రంగా కనిపించే కోణం కూడా ఉందని రజనీకాంత్‌ ‘నరసింహ’ చిత్రం నిరూపించింది. అందులో నీలాంబరి పాత్రకు ఎంతగా గుర్తింపు వచ్చిందో అందరికీ తెలిసిందే! మహిళల్లో బలమైన విలన్‌ అని గుర్తింపు ఆమెకు ఈ చిత్రం  ద్వారా వచ్చింది. ‘బాహుబలి’లో శివగామిగా ఆమెలో రాజసం ఎంతగానో ఆకట్టుకుంది. ‘‘అయితే అప్పట్లో రజనీకాంత్‌కు ఎదురుగా నెగెటివ్‌ షేడున్న పాత్ర పోషించడానికి చాలా భయపడ్డా’’ అని రమ్యకృష్ణ పలు సందర్భాల్లో వివరించారు.


‘మల్లి’గా మెప్పించింది..
ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన రాశి ఎన్నో చిత్రాల్లో కథానాయికగా మెప్పించారు. 1997 ‘పెళ్లి పందిరి’ చిత్రం నుంచి ఆరేళ్లు సక్సెస్‌ఫుల్‌ కథానాయికగా వెలుగొందారు. పలు చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో కూడా కనిపించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ‘నిజం’ చిత్రంలో ఆమె పోషించిన మల్లి పాత్ర ఒక ఎత్తు. అప్పటి వరకూ అందమైన కథానాయికగా పలు భాషల్లో కొనసాగిన ఆమె ఒక్కసారిగా గోపీచంద్‌కు ప్రేయసిగా, ఓ డిఫరెంట్‌ లుక్‌లో నెగెటివ్‌ షేడున్న పాత్ర పోషించి పరిశ్రమను ఆశ్చర్యపరచింది. గ్లామర్‌ చుట్టూ హీరోయిన్‌ పాత్రలు తిరుగుతున్న తరుణంలో ఈతరం తెలుగమ్మాయిలు కూడా నెగటివ్‌ షేడున్న పాత్రలు పోషించగలరని రాశి నిరూపించారు. కొంతకాలం సినిమాకు విరామం ఇచ్చిన ఆమె ఇప్పుడు సెకెండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టారు.

కామెడీ విలన్‌ శకుంతల..
దివంగత తెలంగాణ శకుంతల కామెడీ పాత్రలతోనే కాదు.. కామెడీ విలన్‌గా కూడా అలరించారు. కొన్ని సినిమాల్లో సీరియస్‌ విలన్‌గా కూడా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. ఎక్కువగా ఆమె ప్యాక్షన్‌ పాత్రలతో ఆకట్టుకున్నారు. రౌద్రమైన చూపు, గళం ఆమె పోషించిన పాత్రలకు ప్రత్యేక అలంకరంగా నిలిచాయని చెప్పాలి. కామెడీ విలనీగా తెలంగాణ శకుంతలది ఓ ప్రత్యేకమైన మార్క్‌ అనే చెప్పాలి. అలాగే జయసుధ సోదరి సుభాషిణి ‘అరుంధతీ’, విజయ లలిత ‘సాహసవీరుడు సాగరకన్య’, సరిత ‘అర్జున్‌’ వంటి చిత్రాల్లో నెగెటివ్‌ షేడున్న పాత్రలతో ఆకట్టుకున్నారు. 

ఇక ఈతరం నాయికల్లో చూస్తే మంచు లక్ష్మి, అనసూయ, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రెజీనా, వంటి తారలు పాత్రలకు హద్దులు పెట్టుకోకుండా, స్టార్‌డమ్‌ వెనుక పడకుండా తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని, నిడివితో సంబంధం లేకుండా పాత్రకు ప్రాధాన్యం ఉంటే విలన్‌గా చేయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు.


తెలుగుతెర జయమ్మ...
ఈ మధ్యకాలంలో అతి బలమైన లేడీ విలన్‌ ఎవరంటే బలంగా వినిపించే పేరు.. వరలక్ష్మీ శరత్‌కుమార్‌. ‘క్రాక్‌’ సినిమాలో ఆమె పోషించిన జయమ్మ పాత్ర ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుంది. అంతకు ముందు తమిళంలో ఆమె ఎన్నో చిత్రాల్లో కథానాయికగా, విలన్‌గా నటించినా జయమ్మ పాత్రకు వచ్చిన రెస్పాన్స్‌ మరే సినిమాలకు రాలేదనే చెప్పాలి. ‘‘కథలో ఉన్న ఇంపాక్ట్‌ను బట్టే నేను సినిమా అంగీకరిస్తా. జయమ్మ పాత్ర గురించి వినగానే తెలుగులో నాకు ఇదొక ల్యాండ్‌మార్క్‌ అవుతుందనిపించింది. సినిమా విడుదల అయ్యాక అదే నిజమైంది’’ అని వరలక్ష్మి శరత్‌కుమార్‌ చెప్పారు.

సమంత నెగెటివ్‌ రోల్‌...
ప్రయోగాలు చేయడానికి సమంత ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటి వరకూ బబ్లీగర్ల్‌, పక్కింటి అమ్మాయి, బరువైన పాత్రల్లో కనిపించిన సామ్‌ ఇప్పుడు నెగెటివ్‌ షేడున్న పాత్రల బాట పట్టారట. హిందీ పాపులర్‌ సిరీస్‌ ‘ఫ్యామిలీమ్యాన్‌ 2’లో ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే! అయితే అందులో ఆమెది నెగెటివ్‌ షేడున్న పాత్రట. ఇంతకాలం గ్లామర్‌తో ఆకట్టుకున్న సమంత నెగెటివ్‌ పాత్రలో ఎలా ఉంటారో చూడాలి.


‘పుష్ప’లోనూ అనసూయ కీలకం..
హాట్‌ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ సినిమాల్లో కూడా తన సత్తా బాగానే చాటుతున్నారు. ఆచితూచి కథలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్న ఆమె కథలో పాత్రకు ప్రాధాన్యం ఉంటే నెగెటివ్‌ షేడున్న పాత్ర  చేయడానికైన సిద్ధమే అని చాలాకాలం క్రితం చెప్పారు. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘క్షణం’ చిత్రంలో ఆమె ఎసీపీ జయ భరద్వాజ్‌గా నటించారు. అందులో ఆమెది పోలీస్‌ పాత్రే అయినా క్లైమాక్స్‌కి వచ్చే సరికి ఆమెది నెగెటివ్‌ షేడున్న పాత్ర అని తెలుస్తుంది. ఆ సినిమాలో అనసూయ నటన ఆమెకు మంచి అవకాశాలు తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఆమె ప్రత్యేక గీతాల్లో కూడా నటిస్తున్నారు. తాజాగా నటిస్తున్న ‘పుష్ప’లో కూడా ఆమెది చాలా కీలకమైన పాత్ర అని, కాస్త నెగటివ్‌ షేడ్‌లో ఉంటుందని సమాచారం.

ఇంటెలెక్చువల్‌ రెజీనా
కెరీర్‌ బిగినింగ్‌ నుంచి రెజీనా గ్లామర్‌ పాత్రలకే పరిమితమయ్యారు. అక్కడక్కడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలూ పోషించారు. వెంకట్‌ రాంజీ దర్శకత్వం వహించిన ‘ఎవరు’ చిత్రంలో మాత్రం ఆమెది ఓ ఇంటెలెక్కువల్‌ క్యారెక్టర్‌. చేసిన క్రైమ్‌ బయట పడకుండా చాలా ఇంటెలిజెంట్‌గా దర్శకుడు ఆమె పాత్రను తీర్చిదిద్దారు. అయితే అది పూర్తిగా నెగెటివ్‌, గ్రేడ్‌ షేడ్‌ ఉన్న పాత్ర అని తర్వాత తెలుస్తుంది.

పవర్‌ఫుల్‌ ఐరేంద్రి...
అమెరికాలో ఉండగా రెండు, మూడు ఇంగ్లిష్‌ చిత్రాల్లో నటించారు మంచు లక్ష్మి. తెలుగులో ఆమె అరంగేట్రం విలన్‌ పాత్రతో జరిగింది. సిద్ధార్థ్‌ హీరోగా నటించిన ‘అనగనగ ఓ ధీరుడు’ చిత్రం తెలుగులో లక్ష్మి నటించిన తొలి చిత్రం. అందులో ఐరేంద్రిగా మంచులక్ష్మి నెగెటివ్‌ షేడున్న పాత్ర పోషించి ఉత్తమ విలన్‌ గా నంది పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత కూడా ఆమె వైవిధ్యమైన పాత్రలు పోషించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.