చిన్నకోడూరులో తెంపకుండా చేనులోనే వదిలేసిన టమాట
కిలో రూ. 8కి పడిపోయిన ధర
కూలీల, రవాణా ఖర్చులు కూడా రాని వైనం
తెంపకుండా చేనులోనే వదిలేస్తున్న రైతులు
చిన్నకోడూరు, మార్చి 27: చిన్నకోడూరు చెందిన రైతు దొమ్మాట రాజేశం ఎకరం, మెట్టుపల్లికి చెందిన రైతు స్వామి అర ఎకరంలో టమాట సాగు చేశారు. పంట ఏపుగా పెరిగి దిగుబడి బాగా వచ్చింది. తీరా చూస్తే మార్కెట్లో టమాట ధర పడిపోవడంతో పాటు కూలీల, రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో టమాటలను తెంపకుండా చేనులోనే వదిలేశారు. ఇలా మండలంలోని పలు గ్రామాల్లో టమాటను సాగు చేసిన రైతులు టమాటకు ధర లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో చేనులోనే వదిలేస్తున్నారు.
రైతులకు దు:ఖాన్ని మిగిల్చిన టమాట
మండల వ్యాప్తంగా 2,131 మంది రైతులు 1,650 ఎకరాల్లో కూరగాయాలు సాగు చేస్తుండగా, అందులో 230 మంది రైతులు 137 ఎకరాల్లో టమాట సాగు చేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ కంటే ఎక్కువ టమాట రావడంతో టమాట ధర అమాంతం తగ్గిపోయింది. కాగా గత వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా కురియడంతో కూరగాయల పంటలు బాగా దెబ్బతిన్నాయి. అనంతరం అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాల్లో మార్కెట్లో కిలో టమాట రూ. 60 నుంచి రూ. 70 వరకు ఉండగా, ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాట రూ. 8 నుంచి రూ.10 వరకు ఉంది. కనీసం కూలీల, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. కాసుల వర్షం కురిపిస్తుందనకున్న టమాట, ధర లేక దు:ఖాన్ని మిగిల్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.