మరో రెండు నెలలు టమంట..!

ABN , First Publish Date - 2021-11-27T07:11:19+05:30 IST

టమాటా.. కళ్లెం లేని గుర్రంలా పరిగెడుతోంది. కొత్త రికార్డులు సృష్టిస్తూ.. సామాన్యుడి వంటింటికి అందనంత దూరం వెళ్లిపోతోంది. ఇటీవలే సెంచరీ దాటిన ధర...

మరో రెండు నెలలు టమంట..!

ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి ధర.. కేజీ 130

ఉల్లి సహా ఇతర కూరగాయలదీ అదే దారి

జనవరి వరకు తగ్గదు: పరిశోధన


న్యూఢిల్లీ, నవంబరు 26: టమాటా.. కళ్లెం లేని గుర్రంలా పరిగెడుతోంది. కొత్త రికార్డులు సృష్టిస్తూ.. సామాన్యుడి వంటింటికి అందనంత దూరం వెళ్లిపోతోంది. ఇటీవలే సెంచరీ దాటిన ధర.. తాజాగా కేజీ రూ.130కి చేరుకుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. అధికార పార్టీల్లో గుబులు రేపుతోంది. మరో రెండు వారాల్లోనే ధరలు తగ్గుతాయని కేంద్రం చెబుతుండగా.. ఓ పరిశోధన మాత్రం మరో రెండు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెబుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన అకాల వర్షాలే ఈ పరిస్థితికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. సెప్టెంబరు నుంచి కురుస్తున్న వర్షాలతో ఈ రాష్ట్రాల్లోని నర్సరీల్లో టమాటా నారు పూర్తిగా దెబ్బతిందని, దీంతో.. డిమాండ్‌కు తగ్గ స్థాయిలో మార్కెట్‌కు టమాటా రావడం లేదని అంటున్నారు. మదనపల్లెలోని హోల్‌సేల్‌ టమాటా మార్కెట్‌కు సాధారణంగా రోజుకు 400-500 టన్నుల టమాటాలు వస్తుంటాయి. ఇప్పుడిది సగానికి పైగా తగ్గిపోయింది.


ఈ ప్రభావం ధరలపై తీవ్రంగా కనిపిస్తోంది. మరో రెండు వారాల్లో ఉత్తరాది రాష్ట్రాల నుంచి తాజా టమాటా పంట వస్తుందని, అప్పుడు ధరలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయని కేంద్రం చెబుతోంది. ‘‘ఉత్తరాది రాష్ట్రాల్లో పండిన టమాటాలు.. డిసెంబరు తొలివారం నుంచి మార్కెట్లలోకి వస్తాయి. దీంతో.. ధరలు క్రమంగా తగ్గుతాయి. డిసెంబరు రెండో వారం తర్వాత మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. అయితే.. మరో రెండు నెలల పాటు టమాటా ధరలు ఇదే స్థాయిలో ఉంటాయని తాజాగా జరిగిన ఓ పరిశోధన తేల్చింది. టమాటా దిగుబడి అధికంగా ఉండే నాలుగు రాష్ట్రాల్లో ఈసారి పంట దిగుబడి భారీగా పడిపోయిందని, ఉత్తరాది రాష్ట్రాల నుంచి పంట అందుబాటులోకి వచ్చినా.. అది కనీస అవసరాలకు సరిపోదని చెప్పింది.


ఈ నాలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సాగవుతున్న పంట అందుబాటులోకి వచ్చిన తర్వాతే.. ధరలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. కాగా, ప్రస్తుతం ధరల్లో వస్తున్న అనూహ్య మార్పులు.. టమాటాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. మిగతా కూరగాయలూ మండుతున్నాయి. కొన్ని ఇప్పటికే అర్థ సెంచరీ పూర్తి చేసి.. సెంచరీ దిశగా సాగుతుండగా.. మరొకొన్ని అర్థ సెంచరీకి చేరువవుతున్నాయి. ఉల్లి ధర కేజీ రూ.50 దాటగా.. వంగ, బెండ, కాకర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ ధరలు రూ.50-60 మధ్య నమోదవుతున్నాయి. డిమాండ్‌కు తగ్గ స్థాయిలో కూరగాయల సరఫరా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో ఖరీఫ్‌ ఆలస్యంగా ప్రారంభమైందని.. మరో రెండు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

Updated Date - 2021-11-27T07:11:19+05:30 IST