28కె.పి.ఎం.ఆర్.కె.ఎం 5: రామకుప్పం మార్కెట్‌యార్డుకు భారీ స్థాయిలో వచ్చిన టమోటాలు
రామకుప్పం/ సోమల, జూలై 28: టమోటా ధరల పతనపరంపర కొనసాగుతోంది. గతనెల మొదటి వారంలో ఆకాశన్నింటిన టమోటా ధరలు గత పక్షం రోజులుగా నేలముఖం చూస్తున్నాయి. రామకుప్పం, కుప్పం, వి.కోట, ఏడోమైలు, పలమనేరు మార్కెట్లలో ఆదివారం 15కిలోల బాక్సు రూ.350 నుంచి రూ.400 వరకు పలికింది. సోమల మార్కెట్లో అయితే 15 కిలోల బాక్స్ కనిష్ఠంగా రూ.200 పలికింది. సోమవారం రూ.250 నుంచి రూ.270 వరకు పలకగా మంగళవారం ధరలు మరింతగా క్షీణించి బాక్సు ధర రూ.150 నుంచి రూ.220కి పడిపోయింది. అది కూడా అత్యంత నాణ్యంగా ఉన్న టమోటాలకే గిరాకీ ఉంటోంది. మచ్చల కాయలు, చిన్నసైజు కాయల కొనేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో మండిల్లో పేరుకు పోయిన ఆ కాయలను ట్రాక్టర్ల ద్వారా చెరువుల్లోకి తరలిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో బాటూ సరిహద్దు జిల్లాల్లో కూడా దిగుబడులు పెరిగాయి. తమిళనాడులో టమోటా దిగుబడులు ప్రారంభం కావడం, కర్ణాటక మార్కెట్లలో తక్కువ ధరలకు దొరుకుతుండడంతో తమిళనాడు వ్యాపారులు ఎక్కువగా అటువైపు వెళ్తున్నారు. దీంతో జిల్లాలోని మార్కెట్లలో గిరాకీ తగ్గిపోయింది. ఈ కారణంగా ధరలు పతనపరంపర కొనసాగుతోంది, బాక్సు ధర రూ.350 పలికితేనే తమకు పెట్టుబడి గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. స్ధానిక మార్కెట్లలో కిలో రూ.14కు విక్రయిస్తున్నారు.
నాణ్యత తక్కువగా టమోటాలను పారబోసేందుకు తరలిస్తున్న దృశ్యం