పడిపోయిన టమాట

ABN , First Publish Date - 2022-08-08T05:35:13+05:30 IST

పడిపోయిన టమాట

పడిపోయిన టమాట
ధర లేక పొలంలోనే వదిలేసిన టమాట

  • నష్టాల్లో టమాట రైతులు 
  • ఓ వైపు వర్షాలు, మరోవైపు తగ్గిన ధర
  • పెట్టుబడులు కూడా రాని వైనం
  • దిక్కుతోచని స్థితిలో రైతులు 

మర్పల్లి, ఆగస్టు 7: ఎంతో ఆశతో టమాట పంట వేసి ఆర్థికంగా లాభం పొందవచ్చని ఎదురుచూసిన రైతులకు నిరాశే మిగిలింది. ఒకవైపు ఎడతెరిపిలేని వర్షాలు, మరోవైపు మార్కెట్‌లో ధర లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలోని పంచలింగాల, సిరిపురం, మర్పల్లి, కొత్లాపురం, ఈర్లపల్లి గ్రామాల్లో రైతులు అత్యధికంగా టమాట పంటను సాగుచేశారు. నెల రోజుల క్రితం కిలో టమాట కిలో ధర రూ.60 నుంచి రూ.100 పలకగా.. మార్కుట్‌లో పంట పోటెత్తడంతో ప్రస్తుతం కిలో రూ.5 కూడా పలకడం లేదు. దీంతో మార్కెట్‌కు తరలిస్తే కనీసం రవాణా చార్జీలు కూ డా రావడం లేదని రైతులు టమాటలను తెంపకుండా పొలంలో నే వదిలేస్తున్నారు. తెంపితే కూలి మీద పడుతోందన్నారు. ధర పెరుగుతుందేమోనని ఆశతో ఉన్న రైతులకు అధిక వర్షాలతో పంట నీట మునిగి మొక్కలు కుళ్లిపోతున్నాయని వాపోతున్నా రు. ఎకరానికి రూ.40వేల నుంచి రూ.50వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేయగా, పంట చేతికొచ్చే సమయంలో ఇటు వాన లతో నష్టపోగా, ఉన్న పంటను మార్కెట్‌కు తరలిస్తే గిట్టు బాటు ధర లభించక రైతులు విలవిల్లాడుతున్నారు.


  • పెట్టుబడి రూ.50వేలు.. రాబడి రూ.వెయ్యి : బోయిని లావణ్య, మహిళా రైతు, సిరిపురం

రూ.50వేలు పెట్టుబడి పెట్టి ఎకరం జాగలో టమాట పంట సాగుచేశాను. పంట చేతికందడంతో మార్కెట్‌కు తరలిస్తే 20కేజీల బాక్స్‌ రూ.100 కూడా పలకడం లేదు. ఇప్పటి వరకు టమాట పంట సాగు చేసి కేవలం వెయ్యి రూపాయల టమాటలే విక్రయించా. మార్కెట్‌లో ధర లేకపోయేసరికి పంటను పూర్తిగా తొలగించి ఇతర పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నాం.

Updated Date - 2022-08-08T05:35:13+05:30 IST