టమోటా రూ.100

ABN , First Publish Date - 2022-05-23T05:55:05+05:30 IST

టమోటా ధర అంతే. పడిపోతే కిలో రూపాయి అవుతుంది.

టమోటా రూ.100

పది రోజులుగా అదే ధర  

బెంబేలెత్తిపోతున్న సామాన్యులు 


చాగలమర్రి, మే 22: టమోటా ధర అంతే.  పడిపోతే కిలో రూపాయి అవుతుంది. పెరిగితే అమాంతం అందనంత ఎత్తులోకి వెళుతుంది. ఇప్పుడు  టమోటా కేజీ రూ.100.ఈ ధర వింటేనే అటువైపు చూడలేని పరిస్థితి. ఇంత ధర పెట్టి కొనలేమని సామాన్య, మధ్య తరగతి ప్రజలు అంటున్నారు. ఎండలు, తుపానుల వల్ల కొత్తగా సాగు చేసేందుకు అవకాశం లేకపోవడంతో టమోటా ఉత్పత్తి తగ్గిపోయింది.  డిమాండ్‌ బాగా పెరిగింది. మదనపల్లి, కలికిరి, గుర్రంకొండ, చిత్తూరు నుంచి టమోటాలు చాగలమర్రికి దిగుమతి అవుతాయి. గతంలో 25 కిలోల బాక్సు రూ.400 వరకు పలికేది. ప్రస్తుతం రూ.2 వేల వరకు పలుకుతోంది. ఈసారి ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. వంకాయలు, బీరకాయలు, చిక్కుడుకాయలు, కాకరకాయలు, మిరపకాయలు రూ.60 నుంచి రూ.80 చేరుకున్నాయి. మునగ కాయలు, బీన్స్‌, క్యాలిఫ్లవర్‌ రూ.100కు చేరుకున్నాయి. ధరల పెరుగుదలతో పేదవారే కాకుండా చిన్న చిన్న హోటళ్లతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న చిరు వ్యాపారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. సామాన్య ప్రజలు ఒక్కపూట కూడా కూరలు వండుకునే పరిస్థితి లేదని వాపోతున్నారు. 


కొనలేకున్నాం


కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. టమోటా వంద రూపాయలంటే మాటలా? రూ.300 తీసుకెళ్లినా మూడు రకాల కూరగాయలు రావడం లేదు. 


-ఖాజా, మేస్త్రీ 


వ్యాపారం చేయలేకపోతున్నాం:


పెరిగిన కూరగాయల ధరలతో వ్యాపారం చేయలేక పోతున్నాం. ఏదైనా కిలో రూ.100 పలుకుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో  టమోటా తోటలు దెబ్బతిని ధరలు పెరిగాయి. దూర ప్రాంతాల నుంచి సరుకు తేవడం వల్ల ధర పెరిగింది. 


- బుర్రాన్‌దిన్‌, కూరగాయల వ్యాపారి

Updated Date - 2022-05-23T05:55:05+05:30 IST