మార్కెట్‌యార్డుకు పోటెత్తిన టమోటా

ABN , First Publish Date - 2022-06-28T05:13:18+05:30 IST

మదనపల్లె మార్కెట్‌యార్డుకు టమోటాలు పోటెత్తాయి.

మార్కెట్‌యార్డుకు పోటెత్తిన టమోటా
మదనపల్లె మార్కెట్‌యార్డుకు వెల్లువలా వచ్చిన టమోటా

1520 టన్నుల టమోటా విక్రయాలు

ట్రాఫిక్‌లో నిలిచిపోయిన ట్రాక్టర్లు

వేలం పాటలో పాల్గొనలేక నష్టపోయిన రైతులు

అధికారుల వైఫల్యంపై ఆగ్రహం


మదనపల్లె టౌన్‌, జూన్‌ 27: మదనపల్లె మార్కెట్‌యార్డుకు టమోటాలు పోటెత్తాయి. సోమవారం మార్కెట్‌కు 1520 టన్నుల టమోటాలు విక్రయానికి రాగా టమోటాలు తీసుకొచ్చిన ట్రాక్టర్లు ట్రాఫిక్‌లో చిక్కుకోవడం, ట్రాక్టర్లలోని టమోటా అన్‌లోడ్‌ కాకపోవడం చాలావరకు రైతులు వేలం పాటలో పాల్గొనలేక నష్టపోయారు. దీంతో వారంతా మార్కెట్‌యార్డు కార్యదర్శిని చుట్టుముట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి. మదనపల్లె మార్కెట్‌యార్డులో రోజురోజుకు టమోటా విక్రయాలు పెరుగుతున్నాయి. టమోటా తీసుకొచ్చే ట్రాక్టర్లు బయటకు వెళ్లడానికి, టమోటాలను బయటకు తీసుకెళ్లే లారీలు లోపలికి రావడానికి ప్రత్యేకంగా ట్రాఫిక్‌ నిబంధనలు అమలు చేయడం లేదు. దీంతో ఒక్కసారిగా వేలాది మంది రైతులు, వందల సంఖ్యలో ట్రాక్టర్లు, లారీలు యార్డులోకి రావడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. దీంతో ఉదయం 8 గంటలకు వేలం పాటలు ప్రారంభమైనా 11 గంటల వరకు కూడా ట్రాక్టర్లలో ఉన్న టమోటాలు అన్‌లోడ్‌ కాలేదు. దీంతో ఆగ్రహించిన రైతులు మార్కెట్‌ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చి ఇన్‌చార్జి కార్యదర్శి అభిలా్‌షను చుట్టుముట్టారు. యార్డులో ట్రాఫిక్‌ను ఎందుకు నియంత్రించలేకపోతున్నారని నిలదీశారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న తమ ట్రాక్టర్లు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. మార్కెట్‌లో కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నా వారి సేవలు ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇన్‌చార్జి కార్యదర్శి అభిలాష్‌ అప్పటికప్పుడే వెళ్లి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. అధికారుల వైఫల్యంతో చాలామంది రైతులు తీసుకొచ్చిన టమోటాలు సమయానికి వేలం జరగక చాలా నష్టపోయారు. ఈ విషయాన్ని రైతులు మార్కెటింగ్‌ శాఖ మంత్రి గోవర్ధన్‌రెడ్డి, కమిషనర్‌ ప్రద్యుమ్నకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే మధ్యాహ్నం 2 గంటలకే టమోటాలను లోడ్‌ చేసుకున్న లారీలు రాత్రి 9 గంటలైనా మార్కెట్‌ గేటు దాటి బయటకు రాలేకపోతున్నాయి.


ఆక్రమణల వల్లే ట్రాఫిక్‌ సమస్య

మార్కెట్‌లో లైసెన్సు పొందిన ట్రేడర్లు అనుమతి లేకుండా అదనంగా స్థలాన్ని ఆక్రమించుకుని షెడ్లు వేశారు. భారీ లారీలు వచ్చిపోయేందుకు ఈ షెడ్లు ఆటంకం కల్గిస్తున్నాయి. మార్కెట్‌ అధికారులు ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారే కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ట్రాఫిక్‌ అదుపుతప్పి రైతులు నష్టపోయారు. వచ్చే పది రోజుల్లో మార్కెట్‌కు 2 వేల టన్నుల టమోటా విక్రయానికి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటికైనా జిల్లా మార్కెటింగ్‌ శాఖాధికారులు మదనపల్లె మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది.



Updated Date - 2022-06-28T05:13:18+05:30 IST