సమాఖ్య స్ఫూర్తికి సమాధి

ABN , First Publish Date - 2022-02-12T06:32:13+05:30 IST

దేశపాలన సమాఖ్య స్ఫూర్తితో నడుస్తుందా? తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు రూపొందించిన గణతంత్ర దినోత్సవ శకటాలను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?...

సమాఖ్య స్ఫూర్తికి సమాధి

దేశపాలన సమాఖ్య స్ఫూర్తితో నడుస్తుందా? తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు రూపొందించిన గణతంత్ర దినోత్సవ శకటాలను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది, బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న ఆ రాష్ట్రాలపై కేంద్రం దాడిగానే ప్రజలు భావించడంలో ఆశ్చర్యం లేదు. రాజ్యాంగ ప్రమాణాలు, నియమాలకు విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను బలహీనపరుస్తుండడంపై పలువురు ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లో మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.


భారత సమాఖ్య విధానంపై ప్రప్రథమ ప్రధాన దాడి 1959లో కేరళలో ఇఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వంపై జరిగింది. అధికరణ 356 (రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడంలో కేంద్ర ప్రభుత్వ అధికారాలను వివరిస్తుంది)ను ఉపయోగించడం ద్వారా, ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి వచ్చిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. ఆ రాజ్యాంగ అక్రమాన్ని ప్రోద్బలించినవారు కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ, కేంద్ర హోం మంత్రి గోవింద్ వల్లభ్ పంత్. నాడు ప్రధానమంత్రిగా ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ సమున్నత చరిత్రకు అదొక కళంకంగా మిగిలిపోయింది.


నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న 17 ఏళ్ళ కాలంలో అధికరణ 356ను మొత్తం ఎనిమిదిసార్లు ప్రయోగించారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తరువాత ఆ అధికరణను తరచుగా ఉపయోగించారు. ఒక అంచనా ప్రకారం ఇందిర ప్రధానిగా ఉన్న రెండు కాలాల (తొలుత 1966– 77; పిదప 1980–84 సంవత్సరాల మధ్య)లోనూ అధికరణ 356ను మొత్తం 50 సార్లు ప్రయోగించారు. సంవత్సరానికి సగటున 3 సార్లు కంటే ఎక్కువగా ‘356’ అమలులోకి వచ్చింది. ముఖ్యంగా రెండు దశలలో అధికరణ 356ను నిర్నిరోధంగా ఉపయోగించారు. తొలుత 1970–71లోనూ, మలిసారి 1980లోనూ అది జరిగింది. 1969లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చీలిక అనంతరం రాష్ట్ర ప్రభుత్వాలలో తన వర్గానికి ఆధిపత్యం సమకూరేందుకు ఇందిర సకల ప్రయత్నాలూ చేశారు. 1977లో అధికారాన్ని కోల్పోయి 1980లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఇందిర కాంగ్రేసేతర రాజకీయ పక్షాల మద్దతుతో నడుస్తున్న వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరఫ్ చేసేందుకై ఆమె ఆ అధికరణను తరచు ఉపయోగించుకున్నారు. 


రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1989 సార్వత్రక ఎన్నికలలో ఓడిపోవడంతో భారత రాజకీయాలలో ఇందిర శకం అంతమయింది. రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చిన దరిమిలా పాతిక సంవత్సరాల పాటు సంభవించిన రాజకీయ పరిణామాలను ఒకసారి సింహావలోకనం చేసుకుంటే ఆ కాలం భారత సమాఖ్య విధానంలో స్వర్ణయుగంగా అభివర్ణించవచ్చు. లైసెన్స్-పర్మిట్‌రాజ్ వ్యవస్థ కూలిపోయింది. సార్వత్రక ఎన్నికలలో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వకుండా దేశ పౌరులు అపూర్వ ప్రజాస్వామిక వివేకాన్ని ప్రదర్శించారు. అదే కాలంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. పాలనలో సహకార భావన విలసిల్లింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం గౌరవించుకున్నాయి.


2014 సార్వత్రక ఎన్నికలలో బీజేపీ గెలవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారత సమాఖ్య విధానానికి అపాయం వాటిల్లింది. ఏడున్నర సంవత్సరాల మోదీ పాలనలో అధికరణ 356ని ఎనిమిదిసార్లు ప్రయోగించారు. సంవత్సరానికి ఇంచుమించు ఒకసారి దాన్ని ప్రయోగించారు. అధికరణ 356ని ప్రయోగించడమనే ప్రమాణాన్ని ఆధారంగా చూస్తే రాష్ట్రాల హక్కులను గౌరవించడంలో ఇందిర కంటే మోదీయే ఎక్కువ గౌరవప్రదంగా వ్యవహరించారని చెప్పవచ్చు. అయితే పలు ఇతర విధాల మన సమాఖ్య విధానాన్ని ఆయన బలహీనపరిచారని చెప్పితీరాలి. మరే ఇతర ప్రధానమంత్రి కంటే ఆయనే మన సమాఖ్య పాలనకు ఎక్కువ చేటు చేశారు. ఐదు విధాలుగా సాగిన ఆ హానికర పాలనను మరింత వివరంగా చూద్దాం.


ప్రధాన విధానాలను, ముఖ్య చట్టాలను వాటిని అమలుపరచవలసిన రాష్ట్రాలను సంప్రదించకుండా రూపొందిస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల ఉపసంహరించుకున్న మూడు సాగు చట్టాలే ఇందుకొక ఉదాహరణ. అలాగే విద్య, సహకార సంఘాలు, బ్యాంకింగ్ మొదలైన వాటికి సంబంధించిన నిర్ణయాలను కూడా కేంద్రమే స్వయంగా తీసుకుని వాటిని రాష్ట్రాలపై రుద్దుతోంది. ఇది సమాఖ్య విధాన స్ఫూర్తిని పూర్తిగా మంటగలపడమే కాదూ?


రెండోది శాంతిభద్రతలు. ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశం. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల స్వతంత్ర ప్రతిపత్తిని బలహీనపరిచింది. తమ అధికార పరిధిలోని ప్రాంతాలలో స్వతంత్రంగా చర్యలు చేపట్టలేని పరిస్థితిని మోదీ సర్కార్ కల్పించింది. రాజకీయ అసమ్మతిని అణచివేసేందుకు ‘ఊపా’ను విచక్షణారహితంగా ప్రయోగించింది. జాతీయ దర్యాప్తు సంస్థకు విస్తృత అధికారాలు కల్పించింది. రాష్ట్రాలను సంప్రదించడం ద్వారా దేశాన్ని కలసికట్టుగా నడిపించేందుకు కొవిడ్ ఉపద్రవం ఒక అవకాశాన్ని కల్పించింది. అయితే మోదీ ప్రభుత్వం మొదటి నుంచీ ఏకపక్షంగా వ్యవహరించింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసేంతవరకు కొవిడ్‌ను ఒక మహమ్మారిగా ప్రకటించడాన్ని వాయిదా వేసింది. ఆ తరువాత కేవలం నాలుగు గంటల వ్యవధిని మాత్రమే ఇచ్చి లాక్‌డౌన్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాలను మాత్రమే కాదు, కేంద్రమంత్రి మండలిని కూడా సంప్రదించకుండానే లాక్‌డౌన్‌ను ప్రకటించారు లాక్‌డౌన్‌తో పాటు ‘జాతీయ విపత్తు నిర్వహణ చట్టం’ (ఎన్‌డిఎమ్‌ఏ)ను కూడా ప్రయోగించారు. ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించనే లేదు.


మూడోది -తనను వ్యతిరేకిస్తున్న రాజకీయ పక్షాలు, రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనపరిచేందుకు సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మొదలైన దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటుంది. నాలుగోది- తనను వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలపై ఒక పద్ధతి ప్రకారం దాడి చేసేందుకై ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మద్దతును మోసపూరిత పద్ధతులలో కూడగట్టుకునేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తోంది. స్వతంత్ర భారత ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థల స్రష్ట సర్దార్ వల్లభ్ భాయి పటేల్. ఆ అధికారులు పాలనా దక్షత కలిగివుండి కేంద్రం, రాష్ట్రాల మధ్య వారధులుగా ఉండాలని ఆయన భావించారు. అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల స్వార్థపర ఆదేశాలకు అనుగుణంగా కాకుండా రాజ్యాంగానికి నిబద్ధమై ఆ అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని సర్దార్ పటేల్ నిర్దేశించారు. ఇప్పుడు ఆయన స్థానంలో ఉన్న పెద్ద మనిషి తన అధికారుల నుంచి వ్యక్తిగత, సైద్ధాంతిక విధేయతను డిమాండ్ చేస్తున్నారు. బెంగాల్, మహారాష్ట్ర తదితర బీజేపీయేతర ప్రభుత్వాల పాలనలో ఉన్న రాష్ట్రాలలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేంద్రానికి అనుకూలంగా వ్యవహరించేలా ఒత్తిడి చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలలో సామరస్యం కొరవడేలా చేస్తున్నారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే రాజ్యాంగబద్ధ పాలన భావనకు విరుద్ధంగా మోదీ సర్కార్ వ్యవహరిస్తోంది.


ఐదోది- ప్రధానమంత్రి వ్యక్తిపూజను పెంపొందించడం. భారత్ (రాష్ట్రాలు, కేంద్రం సమాన భాగస్వాములుగా ఉన్న) ఒక సమాఖ్య రాజ్యం అన్న భావనను బలహీనపరుస్తోంది. విద్యావైద్యాలు, సాంఘిక సంక్షేమం మొదలైన రంగాలకు సంబంధించిన పథకాలు, కార్యక్రమాల అమలును నరేంద్రమోదీతో వ్యక్తిగతంగా ముడిపెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధం. మోదీ నియంతృత్వ వైఖరికి అది అద్దం పడుతోంది. మోదీ వ్యక్తి పూజ రాష్ట్రాలపై గుర్తించని ఆర్థిక భారాన్ని కూడా మోపుతోంది. పిఎమ్ -కేర్స్ ఫండ్‌నే తీసుకోండి. అదంతా ఒక గోప్య వ్యవహారం. జవాబుదారీతనం పూర్తిగా కొరవడిన ఆ ఫండ్ సమాఖ్య విధాన సూత్రానికి పూర్తి ఉల్లంఘన. ఈ ఫండ్‌కు వివిధ కార్పొరేట్ కంపెనీలు ఇస్తున్న విరాళాలకు ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత’ కింద పన్ను మినహాయింపు ఇస్తున్నారు. అయితే ప్రతి రాష్ట్రంలోనూ ఉన్న ముఖ్యమంత్రి సహాయక నిధికి వచ్చే విరాళాలకు అటువంటి పన్ను మినహాయింపు ఏదీ లేదు.


ఇందిరాగాంధీతో పోల్చితే నరేంద్ర మోదీ అధికరణ 356ను తక్కువగానే ఉపయోగించారు. అయితే న్యాయబద్ధంగా దేశంలో అంతర్భాగంగా ఉన్న ఒక రాష్ట్రాన్ని రద్దు చేసిన ఒకే ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ అపూర్వ గౌరవం ఆయనకే సొంతం సుమా! గతంలో కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్న గోవా, అరుణాచల్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, హిమాచల్‌లు ప్రస్తుతం రాష్ట్ర ప్రతిపత్తితో వర్ధిల్లుతున్నాయి. ఇందుకు భిన్నంగా, తొలి నుంచీ ఒక రాష్ట్రంగా ఉన్న జమ్మూ-కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. మోదీ ప్రభుత్వ దురహంకారానికి ఇదొక నిదర్శనం. భారత ప్రధానమంత్రి ఒకరు మన సమాఖ్య విధానంపై చేసిన అత్యంత అనాగరిక దాడి అది. కశ్మీర్ యేతర రాష్ట్రాల హక్కులనూ బలహీనపరచడంలో అధికరణ 356ను కాకుండా ఇతర సాధనాలను మోదీ సర్కార్ ఉపయోగించుకుంది. లక్ష్య పరిపూర్తిలో సఫలమయింది కూడా. మీడియా మద్దతును నయాన భయాన పొందడం, న్యాయవ్యవస్థను వశపరచుకోవడం, మన అత్యుత్తమ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యపరచడం, సాయుధ బలగాల రాజకీయీకరణ, మెజారిటీవాద సంస్కృతిని పెంపొందించడంతో పాటు మన దృఢ సమాఖ్య వ్యవస్థను బలహీనపరచడం నరేంద్ర మోదీ నేతృత్వంలోని నవ భారత్ సాధించిన ప్రధాన విజయాలలో ఒకటి.


రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2022-02-12T06:32:13+05:30 IST