రేపు తిరుపతిలో ఐఎ్‌సటీఎఫ్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-01T07:13:03+05:30 IST

సరికొత్త ఆవిష్కరణలే లక్ష్యంగా తిరుపతిలో శనివారం ఐఎ్‌సటీఎఫ్‌ ప్రారంభిస్తున్నట్లు అధ్యక్షుడు ప్రొఫెసర్‌ డాక్టర్‌ నారాయణరావు వెల్లడించారు.

రేపు తిరుపతిలో ఐఎ్‌సటీఎఫ్‌ ప్రారంభం
మీడియాతో మాట్లాడుతున్న నారాయణరావు

సరికొత్త ఆవిష్కరణలే లక్ష్యమని అధ్యక్షుడి వెల్లడి


తిరుపతి అర్బన్‌, జూన్‌ 30: సరికొత్త ఆవిష్కరణలే లక్ష్యంగా తిరుపతిలో శనివారం ఇన్నోవేషన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫౌండేషన్‌ (ఐఎ్‌సటీఎఫ్‌) ప్రారంభిస్తున్నట్లు అధ్యక్షుడు ప్రొఫెసర్‌ డాక్టర్‌ నారాయణరావు వెల్లడించారు. గురువారం స్థానిక కెన్సెస్‌ హోటల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్‌ పురోగమిస్తోందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రచురితమవుతున్న పరిశోధనా పత్రాల్లో మన దేశం మూడో ర్యాంకులోను, నాణ్యమైన పరిశోధనా పత్రాలు వెల్లడించడంలో తొమ్మిదో స్థానంలో ఉందన్నారు. సమాచార, నేవిగేషన్‌, రిమోట్‌ సెన్సింగ్‌, వ్యాక్సిన్ల తయారీ, త్రీడీ టెక్నాలజీ వంటి కీలక రంగాల్లో పరిశోధనలు విస్తృతమయ్యాయన్నారు. ప్రపంచ దేశాలకు నేడు భారత్‌.. కీలక వ్యాక్సిన్లను అందిస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, పీహెచ్‌డీ స్కాలర్లు, ఔత్సాహిక శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లను అధునాతన పరిశోధనలవైపు మరింత ఆసక్తి చూపేలా ప్రోత్సహించాల్సి ఉందన్నారు. ఈ లక్ష్యంతోనే తిరుపతిలో ఐఎ్‌సటీఎఫ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. కెన్సెస్‌ హోటల్లో శనివారం ఉదయం 11గంటలకు జరిగే ఈ ప్రారంభోత్సవంలో డీఆర్‌డీవో చైర్మన్‌ డాక్డర్‌ సతీష్‌ రెడ్డి, డీఎ్‌సటీ సెక్రటరీ డాక్టర్‌ చంద్రశేఖర్‌లతోపాటుగా జాతీయ స్థాయి శాస్త్ర, సాంకేతిక రంగ నిపుణులు హాజరు కానున్నారన్నారు. ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల్లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపై ఉన్న ఆసక్తికి అనుగుణంగా వారిని ప్రోత్సహిస్తూ.. లాభాపేక్ష లేకుండా పనిచేయడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశమని ప్రకటించారు. ఐదు యూనివర్సిటీలు, ఐఐటీ, ఐసర్‌ వంటి ప్రముఖ విద్యా సంస్థలు ఉన్న కారణంగానే తిరుపతిని తాము వేదికగా చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎ్‌సటీఎఫ్‌  ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ టి.నారాయణరావు, మీడియా అడ్వైజర్‌ ఎ.దేవరాజన్‌, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ డి.సి.రెడ్డి, ప్రొఫెసర్‌ విజయ భాస్కర్‌రావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T07:13:03+05:30 IST