‘రేపటి మనిషి’ పుస్తకావిష్కరణ

ABN , First Publish Date - 2022-05-23T09:07:56+05:30 IST

రాజకీయ పార్టీలకు అతీతంగా పాలకుల స్వభావాన్ని విశ్లేషించగలిగిన ధీశాలి చల్లగుళ్ల నరసింహారావు అని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి కొనియాడారు.

‘రేపటి మనిషి’ పుస్తకావిష్కరణ

సి.నరసింహారావుకు ప్రముఖుల నివాళి

హైదరాబాద్‌ సిటీ, మే22(ఆంధ్రజ్యోతి): రాజకీయ పార్టీలకు అతీతంగా పాలకుల స్వభావాన్ని విశ్లేషించగలిగిన ధీశాలి  చల్లగుళ్ల నరసింహారావు అని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి కొనియాడారు. మాదాపూర్‌లోని హోటల్‌ దసపల్లాలో సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, మనస్తత్వ నిపుణుడు నరసింహారావు సంస్మరణ సభ ఆదివారం జరిగింది. నరసింహారావుకి నివాళిగా మిత్రులు రూపొందించిన ‘రేపటి మనిషి’ పుస్తకాన్ని ఆయన కుటుంబసభ్యులు ఆవిష్కరించారు. తన విశ్లేషణలో ఏపీ సీఎం జగన్‌ వ్యక్తిత్వాన్ని మాత్రమే విప్పి చెప్పారని కానీ, ఎన్నడూ ఆ పార్టీని విమర్శించలేదని, అదీ నరసింహారావు స్వభావమని సుజనాచౌదరి  పేర్కొన్నారు. తనను అంతా ధైర్యవంతుడు అనుకుంటున్నారు కానీ, అసలైన ధైర్యవంతుడు నరసింహారావు అని  వైఎ్‌సఆర్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.


అంత నిర్భయంగా, నిష్కర్షగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తంచేసేవారని చెప్పారు. వ్యక్తిస్వేచ్ఛ, రాజ్యంపాత్ర మధ్య హద్దులను ఎరిగిన వ్యక్తి నరసింహారావు అని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ ప్రశంసించారు. ఆశావాదాన్ని, హేతువాదాన్ని చివరివరకు ఆచరించిన వ్యక్తి నరసింహారావు అని కొనియాడారు. ఆచార్య ఎన్జీరంగా, రాజాజీ వంటివారితో నరసింహారావుకు ఉన్న ఆత్మీయ అనుబంధం గురించి మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు వివరించారు. ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు, మాజీ మంత్రి యలమంచిలి శివాజీ, సీనియర్‌ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి, రంగస్థల నిపుణుడు గుమ్మడి గోపాలకృష్ణ, ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-23T09:07:56+05:30 IST