రైతు గోడు పట్టని ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-11-30T01:38:40+05:30 IST

తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి, భరోసా కల్పించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు అండగా నిలిచేందుకు దేవినేని ఉమాతో కలసి బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావులు ఆదివారం పలు ప్రాంతాల్లో పర్యటించారు.

రైతు గోడు పట్టని ప్రభుత్వం
చిననందిపాడు వద్ద దెబ్బతిన్న మిర్చిని పరిశీలిస్తున్న మాజీ మంత్రి దేవినేని,బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు


భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

లక్షల ఎకరాల్లో పంట నష్టం

తక్షణమే నష్టపరిహారం, క్రాప్‌ ఇన్సూరెన్స్‌ ఇవ్వాలి

కౌలు రైతులను ఆదుకోవాలి

తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఉచితంగా విత్తనాలు అందించాలి

దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి దేవినేని, ఎమ్మెల్యే ఏలూరి

పర్చూరు, నవంబరు 29 : తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి, భరోసా కల్పించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు అండగా నిలిచేందుకు దేవినేని ఉమాతో కలసి బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావులు ఆదివారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. మండలంలోని చిననందిపాడు వద్ద నీటి మునిగి దెబ్బతిన్న మిర్చి పంటను పరిశీలించారు. పెద్ద ఎత్తున రైతులు అక్కడకు చేరుకొని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటల నష్టాన్ని స్వయంగా అంచనా వేసేందుకు వచ్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నష్టాన్ని అంచనా వేసి రైతుగోడు ప్రభుత్వానికి వినిపిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కానీ, మంత్రులు కానీ క్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలను తెలుసుకోకపోవటం విచారకరమన్నారు. కృష్ణా జిల్లా చల్లాపల్లిలో పంట మునిగిపోయి నష్టపోయిన రైతుకు నష్టపరిహారం రాదని నేతలు ఖరాఖండిగా చెప్పటంతో గత్యంతరం లేక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఇదా ప్రభుత్వం చేయాల్సిన పని అని నిలదీశారు.

ప్రతి రైతుకు 50 శాతం నష్టపరిహారం ప్రభుత్వమే చెల్లించాలి : ఏలూరి

నష్టపోయిన రైతులకు పెట్టిన పెట్టుబడిలో 50 శాతం నష్టపరిహారం ప్రభుత్వమే చెల్లించాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు డిమాండ్‌ చేశారు. మిర్చి, వైట్‌బర్లీ, పత్తి, వరి, కూరగాయల పంటలు సాగుచేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. 15-20 రోజుల్లో వరి పంట చేతికి వస్తుందన్న తరుణంలో ప్రకృతి వైపరీత్యం చావుదెబ్బకొట్టిందని చెప్పారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో తీవ్ర నష్టం మిగిల్చిందన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించటంలో ప్రభుత్వం విఫలమైందని, ఈక్రాప్‌, పంట నమోదు సాకుతో రైతులకు మొండిచేయి చూపకుండా నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఉషారాణి, మైనార్టీ నాయకులు షేక్‌ కరిముల్లా, ఎస్సీ సెల్‌ బేతపూడి సురేష్‌, మక్కెన శేఖర్‌బాబు, మువ్వా వెంకటశివరావు పాల్గొన్నారు. 



Updated Date - 2020-11-30T01:38:40+05:30 IST