Advertisement

పాకశాస్త్రంలో పతకాలు పట్టేశాడు

Jan 13 2021 @ 00:23AM

అతడి చేతిలో పడితే పండ్లు పువ్వులుగా మారిపోతాయి. కూరగాయలు లతల్లా అందంగా అల్లుకుపోతాయి. పదిహేడేళ్ల ప్రాయంలోనే పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించి... ‘కలినరీ ఒలింపిక్స్‌’లో నాలుగు రజత పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన చెన్నై చెఫ్‌ యశ్వంత్‌కుమార్‌ ఉమాశంకర్‌ జర్నీ ఇది... 


యశ్వంత్‌ బాల్యం అందరి పిల్లల్లా సాగలేదు. బొమ్మలతో ఆడుకోలేదు. చుట్టుపక్కల పిల్లలతో కలిసి తిరగలేదు. వంటింట్లో నాన్న ఉమాశంకర్‌ ధనపాల్‌ వంటలు చేస్తుంటే... ఆయన వెంటే ఉండేవాడు. పాకశాస్త్రంలో ఆయన ప్రావీణ్యుడు. చెన్నైలోని ఓ ప్రముఖ స్టార్‌ హోటల్‌లో పేరున్న చెఫ్‌. ‘కలినరీ ఒలింపిక్స్‌’లో భారత్‌కు రెండుసార్లు కాంస్య పతకాలు తీసుకొచ్చారు. రకరకాల వంటలు వండడం... వండినదాన్ని అందంగా అలంకరించడం... కాయగూరలు, పండ్లను శిల్పాల్లా చెక్కడం... ఇవే చిన్న వయసులో యశ్వంత్‌ను వంట గది వైపు అమితంగా ఆకర్షించాయి.   


తొమ్మిదేళ్లకే పోటీల్లో... 

నాన్న వంటలు చూస్తూ పెరిగిన యశ్వంత్‌కు చివరకు అదే తన జీవిత ఆశయంలా మారింది. గరిట పట్టడం రాని వయసులోనే పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించాడు. వండటమే కాదు... ఆ వంటను చూడగానే తినాలనిపించేలా ఆకర్షణీయంగా అలంకరించడంలోనూ నైపుణ్యాన్ని సాధించాడు. తొమ్మిదేళ్ల వయసులోనే చెన్నైలో జరిగిన కుకరీ కాంపిటీషన్‌లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నాడు. అది మొదలు అతడి ప్రావీణ్యం జాబితాలో రోజుకో రుచికరమైన వంట వచ్చి చేరుతోంది. పండైనా... కూరగాయ అయినా విభిన్నమైన డిజైన్‌లో ఒదిగిపోతోంది.  

‘పతక’ స్థాయిలో ప్రదర్శన... 

పాకశాస్త్రంపై ఉన్న మక్కువతో యశ్వంత్‌ చదువును కూడా పక్కన పెట్టేశాడు. గత ఏడాది జర్మనీలో జరిగిన ‘కలినరీ ఒలింపిక్స్‌ 2020’లో ఏకంగా నాలుగు రజత పతకాలు నెగ్గి చరిత్ర సృష్టించాడు. 59 దేశాల నుంచి మొత్తం రెండు వేల మంది చేయి తిరిగిన చెఫ్‌లు పోటీపడిన ఈ ఒలింపిక్స్‌లో యశ్వంతే పిన్న వయస్కుడు. వెజిటబుల్‌ కార్వింగ్‌, కలినరీ ఆర్ట్‌కు సంబంధించిన నాలుగు విభాగాల్లో పాల్గొని ఈ పతకాలు పట్టాడు.‘‘ఒక పోటీలో మా నైపుణ్యం ప్రదర్శించడానికి మూడు గంటల సమయం ఇచ్చారు. ఇందులో భాగంగా గుమ్మడికాయతో పాటు ఏవైనా మరో నాలుగు పండ్లను ఎంచుకోవాలి. వీటితో పాటు సమయ పరిమితి లేని మరికొన్ని వెజిటబుల్‌ కార్వింగ్‌లో పోటీల్లో కూడా పాల్గొన్నాను. నిపుణుల బృందం వాటిని పరిశీలించి, ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తుంది’’ అంటూ తన గెలుపు గురించి చెప్పుకొచ్చాడీ యువకుడు. 


నాన్నతో విదేశాలకు వెళుతూ... 

‘‘కలినరీ ఒలింపిక్స్‌’ అనేది ఒకటుందని చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, పురాతనమైన కలినరీ ఆర్ట్స్‌ పోటీ. ఒలింపిక్‌ గేమ్స్‌లా నాలుగేళ్లకోసారి జరుగుతుంది. ఆరేళ్ల కిందట తొలిసారి పాకశాస్త్రంలో పోటీపడ్డాను. ఇప్పుడు ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన ‘కలినరీ ఒలింపిక్స్‌’లో భారత్‌ తరుఫున పాల్గొనడమంటే, నిజంగా నా కల నిజమైనట్టుగా ఉంది. నాకు స్ఫూర్తి మా నాన్నే. దేశవిదేశాల్లో ఆయన పని చేసిన ప్రతి చోటకూ వెళ్లాను. అక్కడి రుచులు, అభిరుచులు తెలుసుకున్నాను. అంతేకాదు... ప్రముఖ చెఫ్‌ల వంటలు దగ్గరుండి పరిశీలించగలిగాను. వాటి గురించి మాట్లాడి అవగాహన పెంచుకొనేందుకు నాన్నతో విదేశీ పర్యటనలు ఎంతో దోహదపడ్డాయి.


ఇవేకాకుండా వేసవి సెలవుల్లో ‘కలినరీ అకాడమీ ఆఫ్‌ ఇండియా’లో శిక్షణ తీసుకున్నాను. అది నాకు ఎంతో ఉపయోగపడింది. అయితే నా అభిరుచి కోసం పదో తరగతి మధ్యలో వదిలేయాల్సి వచ్చింది. స్కూల్‌కు వెళుతూ ఒలింపిక్స్‌కు సన్నద్ధమవ్వడం నాకు సాధ్యం కాలేదు. అందుకే బడి మానేయాలని నిర్ణయం తీసుకున్నాను’’ అంటున్న యశ్వంత్‌, తరువాత ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌’ (ఎన్‌ఐఓఎస్‌) ద్వారా పరీక్షలు రాసి పాసయ్యాడు. 


ఓడినా వెనకడుగు వేయలేదు... 

ఆరంభంలో యశ్వంత్‌ ఎన్నో పోటీల్లో పాల్గొన్నాడు. కానీ గెలిచినవి ఒకటో రెండో! అలాగని నిరాశపడలేదు. పోటీల నుంచీ తప్పుకోలేదు. ‘‘మా నాన్న 2012, 2016 ‘కలినరీ ఒలింపిక్స్‌’లో పాల్గొని, కాంస్య పతకాలు గెలిచారు. కార్వింగ్‌లో ఆయన అద్భుతాలు చేస్తారు. పండ్లు, కూరగాయలను రంగవల్లుల్లా తీర్చిదిద్దుతారు. వాటిని చూసి నేను కూడా నాన్నలా పేరు తెచ్చుకోవాలనుకున్నా. ఒలింపిక్స్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నా’’ అంటాడీ యువ చెఫ్‌. తొలినాళ్లలో గెలుపు ముంగిట తడబడినా ఆ తరువాత తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నాడు.


దేశంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘సూపర్‌ చెఫ్‌ చెన్నై’ పోటీల్లో వరుసగా మూడేళ్లు మొదటి స్థానం దక్కించుకున్నాడు. ‘కలినరీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ టోర్నీలో 5 స్వర్ణాలు సహా ఏడు పతకాలు గెలిచాడు. సెలబ్రిటీ చెఫ్‌ కావాలనుకుంటున్న యశ్వంత్‌ వంటలకు సంబంధించిన సొంత బ్రాండ్‌ ఒకటి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. సంకల్పమే బలంగా... ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా... దూసుకుపోతున్న ఈ చెన్నై కుర్రాడి ఆశయం నెరవేరాలని కోరుకొంటూ... మనమూ ఆల్‌ ద బెస్ట్‌ చెబుదాం. Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.