తడబడినా నిలబడ్డాడు

ABN , First Publish Date - 2021-07-28T06:11:16+05:30 IST

శ్రీనగర్‌ బటమలూ ప్రాంతంలోని నిరుపేద కుటుంబం షేక్‌ ఆసిఫ్‌ది. కానీ పెద్ద చదువులు చదవాలన్నది అతడి తపన. అందుకు తగ్గట్టుగానే కష్టపడ్డాడు.

తడబడినా నిలబడ్డాడు

చిన్నప్పుడు చదువులో టాప్‌. ఎన్నో ఆశయాలు, లక్ష్యాలు. కానీ పేదరికం దానికి బ్రేకులు వేసింది. ఫీజు కట్టలేక బడి మానేయాల్సివచ్చింది. ఇది పన్నెండేళ్ల కిందటి కథ. మరి ఇప్పుడు..! బ్రిటన్‌లో ఓ ఐటీ కంపెనీకి అధిపతి అతడు. సామాజిక సేవలోనూ ముందుంటాడు. తనలాంటి ఎంతోమంది యువతకు ఉద్యోగాలిచ్చి ప్రోత్సహిస్తున్న కశ్మీర్‌ కుర్రాడు... షేక్‌ ఆసిఫ్‌ జర్నీ ఇది... 


శ్రీనగర్‌ బటమలూ ప్రాంతంలోని నిరుపేద కుటుంబం షేక్‌ ఆసిఫ్‌ది. కానీ పెద్ద చదువులు చదవాలన్నది అతడి తపన. అందుకు తగ్గట్టుగానే కష్టపడ్డాడు. ప్రతి తరగతిలో టాప్‌గా నిలిచాడు. ఎనిమిదో తరగతిలోకి వచ్చాడు. ఆ సమయంలో వాళ్ల నాన్న రోగంతో మంచాన పడ్డారు. వచ్చే ఆ కాస్త సంపాదనా ఆగిపోయింది. ఏంచేయాలి? వేరే దిక్కు లేదు... చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని భుజాన వేసుకోవాల్సి వచ్చింది. దాని కోసం బడి మానేశాడు. 

‘‘మా నాన్న పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో చేసేవారు. మేం ఐదుగురు సంతానం. ఆయనకు వచ్చే జీతం మాకు ఏ మాత్రం సరిపోయేది కాదు. ఇక ఆయన అనారోగ్యం పాలయ్యాక నేనే కుటుంబ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా ఎనిమిదవ తరగతితోనే చదువు ఆపేశాను. చిన్న చిన్న దుకాణాల్లో రకరకాల పనులు చేశాను’’ అంటాడు ఆసిఫ్‌. 


ఐటీ కంపెనీలో... 

‘‘నాకు చిన్నప్పటి నుంచి కల... ఐటీ నిపుణుడిని కావాలని. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లక్ష్యం నుంచి వెనక్కి వెళ్లలేదు. భగవంతుడి దయవల్ల చదువు మానేసిన మరుక్షణం నుంచి ఒక్క రోజు కూడా ఖాళీగా లేను. నిరంతరం ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను. ఆ క్రమంలోనే స్థానిక ఐటీ కంపెనీలో చిరుద్యోగానికి చేరాను. అందులో ఆరేళ్లకు పైగా ఉన్నా. అదే సమయంలో గ్రాఫిక్స్‌ కూడా నేర్చుకున్నా. ఒకరోజు అనిపించింది... నేనే కంపెనీ పెడితే ఎలావుంటుందని! ఆ ఆలోచన నిద్ర పట్టనివ్వలేదు. వెంటనే కార్యాచరణ ప్రారంభించా. అయితే చివరి నిమిషంలో అవసరమైన డబ్బు సమకూరలేదు. దీంతో ఆ ప్రయత్నానికి బ్రేక్‌ పడింది’’ అంటున్న ఆసిఫ్‌కు అనుకోకుండా మరో అవకాశం వచ్చింది. 


అలా కలిసొచ్చింది... 

‘‘అది 2016. యూకే కంపెనీ ‘ట్రైమాక్స్‌ గ్రాఫిక్స్‌ అండ్‌ ప్రింటింగ్‌’ నుంచి పిలుపు వచ్చింది. ఆనందానికి హద్దులు లేవు. వెంటనే వెళ్లి అందులో చేరాను. ఆరు నెలలు గడిచాయి. ఒక రోజు ‘నువ్వు వేరే ఉద్యోగం చూసుకో. కంపెనీ నష్టాల్లో ఉంది. త్వరలోనే దీన్ని మూసేస్తున్నాం’ అని యజమానులు చెప్పారు. ఎన్నో ఆశలు పెట్టుకుని పరదేశంలో అడుగు పెట్టిన నాకు అది పెద్ద షాక్‌. జీవితం ఆగిపోయిందన్నంత బాధ. భవిష్యత్తు అంతా చీకటే అనుకున్న సమయంలో వెలుగు రేఖలా గూగుల్‌లో పనిచేసే బిజినెస్‌ డెవలపర్‌ ఒకరు నాకు అండగా నిలిచారు. తక్కువ ఖర్చులో సొంతంగా కార్యాలయం ఒకటి ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన సహకారం అందించి ఆదుకున్నారు’’ అంటూ నాటి రోజులు గుర్తు చేసుకున్నాడు అతడు. 


బ్రిటన్‌లోనే బిజినెస్‌... 

అండగా నిలిచిన బిజినెస్‌ డెవలపర్‌తోనే కలిసి లండన్‌లో సొంతగా ‘థేమ్స్‌ ఇన్ఫోటెక్‌’ పేరుతో వెబ్‌ డిజైనింగ్‌ కంపెనీ పెట్టాడు ఆసిఫ్‌. వెబ్‌ డిజైనింగ్‌, వెబ్‌, యాప్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలపింగ్‌, గ్రాఫిక్‌ డిజైనింగ్‌తో పాటు డిజిటల్‌ మార్కెటింగ్‌ సేవలు కూడా అందిస్తుందా కంపెనీ. కొద్ది కాలంలోనే అక్కడి ప్రముఖ ఐటీ కంపెనీలతో పోటీ పడే స్థాయికి వెళ్లింది. దీంతో మాంచెస్టర్‌లోని పెద్ద బిల్డింగ్‌లోకి ఆ సంస్థ మారింది. ‘‘ప్రొఫెషనల్‌ వెబ్‌ డెవలపర్‌, గ్రాఫిక్‌ డిజైనర్‌నే కాదు... నేడు నేనొక పారిశ్రామికవేత్తని కూడా’’ అంటున్న ఆసిఫ్‌ కంపెనీకి వివిధ సంస్థల నుంచి 16 అవార్డులు లభించాయి. 32 మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా, 200 మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. 


ఊరిని మరిచిపోలేదు... 

ఎంత ఎదిగినా మూలాలు మరిచిపోలేదు ఆసిఫ్‌. తన సొంత ఊళ్లో పిల్లలు, యువతకు ఐటీపై అవగాహన కల్పించే ఉద్దేశంతో 2018లో తిరిగి కశ్మీర్‌కు వచ్చాడు. డిజిటల్‌ మార్కెటింగ్‌, వెబ్‌, గ్రాఫిక్‌ డిజైనింగ్‌ తరగతులు నిర్వహిస్తున్నాడు. ‘‘దీనివల్ల కొంతవరకైనా నిరోద్యోగ సమస్య తగ్గుతుంది. వారికి ఉపాధి దొరుకుతుంది. శ్రమిస్తే నాలా సొంత వ్యాపారాలూ పెట్టుకొనే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ప్రాజెక్ట్‌ని ప్రారంభించాను. ఇప్పటికి 800 మందికి పైగా ఉచితంగా శిక్షణనిచ్చాను. ప్రస్తుతం వాళ్లంతా వివిధ కంపెనీల్లో పనిచేస్తున్నారు. నన్ను సంప్రతించాలనుకొనే ఏ కశ్మీర్‌ విద్యార్థికైనా అందుబాటులో ఉండేలా వెబ్‌సైట్‌ ఒకటి నెలకొల్పాను’’ అని వివరించాడు ఆసిఫ్‌. 


తీరు మారాలి... 

విద్యావిధానంపై తల్లితండ్రుల ఆలోచనా తీరు మారాలంటాడు ఆసిఫ్‌. డాక్టర్లు, ఇంజనీర్లే కాకుండా సమసమాజ నిర్మాణంలో ఇతర రంగ నిపుణుల పాత్ర కూడా ఎంతో ఉందని గుర్తించాలంటాడు. ఆ దిశగా తమ పిల్లల్ని ప్రోత్సహిస్తే అది వారి భవిష్యత్తుకే కాకుండా దేశ పురోగతికి కూడా పునాదులు వేస్తుందంటున్న ఆసిఫ్‌... లోయలోని నవతరానికి స్ఫూర్తి మంత్రమయ్యాడు.


పద్మశ్రీకి ప్రతిపాదన...

ఎనిమిదో తరగతితోనే చదువు ఆపేసినా ‘డిజిటలైజేషన్‌ ఇన్‌ బిజినెస్‌, ఆన్‌లైన్‌ బిజినెస్‌ ఐడియాస్‌, స్టార్ట్‌ ఏ బిజినెస్‌’ అనే మూడు పుస్తకాలు రాశాడు ఆసిఫ్‌. ప్రతిష్టాత్మక ‘ఐఐబీఏ 2020 ఇండియా’ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. అయితే కరోనా నేపథ్యంలో ఆ ఈవెంట్‌ రద్దయింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే ‘పద్మశ్రీ’ అవార్డ్‌కు నామినేట్‌ అయ్యాడు. అంతేకాదు... లోయలో ఆత్మహత్యలు నివారించేందుకు ‘లిజన్‌ టు మి’ అనే యాప్‌ తీసుకువచ్చాడు.

Updated Date - 2021-07-28T06:11:16+05:30 IST