సేవల ఎగుమతికి అగ్ర ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-12-14T05:46:00+05:30 IST

ఏ‍సరుకులనైతే చౌకగా ఉత్పత్తి చేయడం తమకు సాధ్యమవుతుందో ఆ సరుకుల తయారీ, వాణిజ్యానికే ప్రతి దేశమూ ప్రాధాన్యమివ్వాలనేది స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంత మౌలిక భావనలలో ఒకటి....

సేవల ఎగుమతికి అగ్ర ప్రాధాన్యం

ఏ‍సరుకులనైతే చౌకగా ఉత్పత్తి చేయడం తమకు సాధ్యమవుతుందో ఆ సరుకుల తయారీ, వాణిజ్యానికే ప్రతి దేశమూ ప్రాధాన్యమివ్వాలనేది స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంత మౌలిక భావనలలో ఒకటి. అయితే ఈ తర్కం ముడి పదార్థాలకు వర్తించదు. కారు కొనుగోలు దారుల వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోతుందని ఆటోమొబైల్ డీలర్ ఒకరు ఇటీవల నాకు చెప్పాడు. కారణమేమిటని ప్రశ్నించాను. కరోనా మహమ్మారి కారణంగా నిర్దిష్ట సెమి కాండక్టర్ విడి భాగం ఒకటి చైనా నుంచి దిగుమతి కావడంలో జాప్యం జరుగుతుండడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆ డీలర్ సమాధాన మిచ్చాడు. దిగుమతి చేసుకున్న విడిభాగాల కూర్పుతో కారును రూపొందించి కొనుగోలుదారులకు ఇవ్వడం పరిపాటి. అయితే ఒక కీలక విడి భాగం లేకపోవడంతో ఆ ప్రక్రియకు అంతరాయమేర్పడింది. ఆటోమొబైల్ కంపెనీలే కాదు ఫార్మాస్యూటికల్ కంపెనీలు కూడా కరోనా ఉపద్రవంతో తీవ్రంగా నష్టపోతున్నాయి. చైనా నుంచి ముడిపదార్థాల సరఫరాల్లో ఆలస్యం వల్లే ఈ విపత్కర పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల వల్ల ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోతున్నందున పలు దేశాలు ప్రపంచీకరణ విధానాల పై పునరాలోచన చేస్తున్నాయి. 


చైనా నుంచి సరఫరా అయ్యే ఒక ఔషధ ముడి పదార్థం ఖరీదు రూ.1000 అయితే, దాన్ని మన దేశంలో ఉత్పత్తి చేసుకోవడానికి అయ్యే వ్యయం రూ.1100 అనుకుందాం, ఔషధ ఉత్పత్తిదారులు సహజంగానే ఆ ఆవశ్యక పదార్థాన్ని చైనా నుంచి దిగుమతి చేసుకుంటారు. కరోనా, మరేదైనా ఆపదల వల్ల దాని సరఫరాల్లో జాప్యం జరిగితే ఉత్పత్తిదారు చెల్లించవలసిన బీమా కిస్తీ పెరిగిపోతుంది. ఈ పరిస్థితుల్లో చైనా నుంచి దిగుమతి చేసుకునే ముడి పదార్థం ధర రూ.1100 కి పెరుగుతుంది. ఈ కారణంగా తయారీ సరుకుల ప్రపంచీకరణ నుంచి ఉపసంహరించుకుని ఆవశ్యక పదార్థాలను స్వదేశంలోనే ఉత్పత్తి చేసుకోవడం మంచిదని అనేక దేశాలు భావిస్తున్నాయి. ఈ విషయాన్ని , ‘అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ’ ప్రచురించే ‘ఫైనాన్స్ అండ్ డెవలప్ మెంట్ ’ అనే జర్నల్ లో ఇటీవల వెలువడిన ఒక వ్యాసం పేర్కొనడం గమనార్హం. 


సేవల రంగంలో పరిస్థితులు భిన్నమైనవి. సేవల రంగంలో ప్రపంచీకరణ విధానాలు మరింతగా ప్రగాఢమవనున్నాయని అదే జర్నల్ లో వెలువడిన మరో వ్యాసం వెల్లడించింది. ఇంటర్నెట్ ద్వారా అందించే ఆన్‌లైన్ ట్యూషన్, టెలిమెడిసిన్, ట్రాన్స్ లేషన్స్, సినిమాలు, సాప్ట్ వేర్ మొదలైన సేవలపై కొవిడ్ మహమ్మారి, ఇతర విపత్తులు ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపలేవు. తయారీ సరుకులకు బదులుగా సేవలను ఎగుమతి చేసినపక్షంలో మనం అనేక ప్రయోజనాలు పొందగలుగుతాము. పైన ప్రస్తావించినట్టు కరోనా లాంటి ఉపద్రవాలు సేవల ఎగుమతి కి అవరోధం కాబోవు. సేవల రంగంలో పనిచేసే ఉద్యోగులు నిపుణ విద్యావంతులు. వారి వేతన భత్యాలు సాపేక్షంగా అధిక మొత్తంలో ఉండడం కద్దు. మేధమెటిక్స్ లో ఆన్ లైన్ ట్యూషన్ సమకూర్చే వ్యక్తి గంటకు రూ.1000 ఆదాయం తప్పక లభిస్తుంది. ఆంగ్ల భాషా నైపుణ్యాలు గల యువజనులు మన దేశంలో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. సేవల ఎగుమతి వల్ల వారందరూ లబ్ధి పొందగలుగుతారు. మనకు సహజ వనరుల కొరత ఉంది. బొగ్గు నిక్షేపాలు తక్కువగా ఉన్నాయి. జల విద్యుదుత్పత్తిలో మన సామర్థ్యానికి పలు పరిమితులు ఉన్నాయి. ఇతర ముడి పదార్థాల నిల్వలు కూడా చాలా తక్కువే . వ్యవసాయ యోగ్యమైన భూమి కూడా విస్తారంగా లేదు. 


మన పరిశ్రమలకు అవసరమైన అనేక ఖనిజాలను దిగుమతి చేసుకోవలసిన పరిస్థితిలో ఉన్నాం. అలాగే ఎరువుల తయారీకి అవసరమైన ఫాస్పేట్ లను కూడా విధిగా దిగుమతి చేసుకోవలసి ఉంది. ఆహార ధాన్యాలను మరింతగా ఎగుమతి చెయ్యాలంటే ఫాస్పేట్ లను మరింతగా దిగుమతి చేసుకోవలసి ఉంది. ఫాస్పేట్‌లను తగినంతగా దిగుమతి చేసుకోలేని పక్షంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఎగుమతులు తగ్గిపోతాయి. 


సేవల విషయంలో అటువంటి సమస్యలు ఉండవు. అయితే సేవల రంగంలో ప్రపంచ మార్కెట్ లో ఆధిపత్యం సాధించాలంటే విద్యారంగం పట్ల మన దృక్పథం మారాలి. విద్యా విధానాల్లో మౌలిక మార్పుల అవసరం ఎంతైనా ఉంది. మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త విద్యా విధానం మాతృభాషలు, ప్రాంతీయ భాషాలకు అగ్ర ప్రాధాన్యమిచ్చింది. మంచిదే. అయితే ఇంగ్లీష్, ఫ్రెంచ్, చైనీస్, జపనీస్ మొదలైన భాషలను నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది మనమే . ఈ వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. ఇంగ్లీష్, ఇతర విదేశీ భాషలలో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు మనం తప్పకుండా అగ్ర ప్రాధాన్యమివ్వాలి. అయితే మన సంస్కృతికి నష్టం జరిగేలా ఇది ఉండకూడదు. సింధు లోయ ప్రజలు తమ సంస్కృతిని ఇండస్ భాషలో సృజించుకున్నారు. ఆ తరువాత వారు తమ సంస్కృతిని ప్రాకృతం, సంస్కృతం మొదలైన భాషలకు ప్రదానం చేశారు. భాషలు మారాయి గానీ సంస్కృతి నిశ్చలంగా, నిండుగా నదీ ప్రవాహంలా ప్రవహిస్తోంది. అదే విధంగా మన సంస్కృతి సంస్కృతం, తమిళం, తెలుగు మొదలైన భాషల నుంచి ఆంగ్లంలోకి ప్రవహించవచ్చు. తద్వారా మన సంస్కృతి విశ్వవ్యాప్తమయ్యేందుకు విశేష దోహదం జరుగుతుంది. కనుక ఆంగ్ల భాషను మనం ఆమోదించి అనుసరించాలి. మన పురోగమనానికి దాన్ని ఒక రాజ మార్గంగా చేసుకోవాలి. ఆ భాషలో ఉత్కృష్ట నైపుణ్యాలను సాధించుకునేందుకు ప్రాధాన్యమివ్వాలి. ఇదే జరిగితే మన స్వీయ సంస్కృతిని విడ నాడకుండానే మన యువత సేవల ఎగుమతిలో ఘనాపాఠీలు అవగలుగుతారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఇతోధికంగా అభివృద్ధిని సాధిస్తుంది. 


మరి సేవల రంగం పురోగతికి మన ఉద్యోగస్వామ్య వ్యవస్థ తోడ్పడుతుందా? తోడ్పడదనే చెప్పాలి. ఎందుకంటే తయారీ రంగం వల్లే ప్రభుత్వాధికారులకు ఆర్జనావకాశాలు ఉంటాయి. భూమి కొనుగోలు, పర్యావరణ పరమైన అను మతులు మొదలైన వ్యవహారాలలో వారు తమ స్వప్రయోజనాలను కూడా చక్క బెట్టుకోవడం కద్దు. సేవల రంగం ఇటువంటి అవకాశాలను సమకూర్చదు కదా. మరో వాస్తవం ఏమిటంటే మన విద్యారంగంలోని వారు తమ విధ్యుక్త ధర్మ నిర్వహణ విషయంలో చిత్తశుద్ధి చూపడం లేదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే మన అధ్యాపకులు తమ బోధనా బాధ్యతలను ఉపేక్షిస్తున్నారు. మరి తయారీరంగాన్నే ప్రోత్సహించేలా రాజకీయ వేత్తలను ప్రభుత్వాధికారులు పురిగొల్పడంలో ఆశ్చర్యమేముంది?


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2021-12-14T05:46:00+05:30 IST