ఓటీటీ బరిలో అగ్రతారలు

Jul 25 2021 @ 00:05AM

అగ్రహీరోలు నటించిన సినిమాలు ఓటీటీల్లో  విడుదల చేయాలా? వద్దా? అనే చర్చ ఓ వైపు చిత్రపరిశ్రమలో నడుస్తోంది. ఆ సంగతి అలా ఉంచితే  కొంతమంది నటీనటులు  సొంత ఓటీటీ సంస్థలు ప్రారంభించడానికి ముందుడుగు వేస్తుండడం గమనార్హం.  ప్రేక్షకులకు వినోదం అందించడం  ముఖ్యం కానీ  ఏ ప్లాట్‌ఫామ్‌ అయితే  ఏముంది? అని నచ్చచెప్పేధోరణిలో మాట్లాడుతున్నారు కొంతమంది సినీ ప్రముఖులు.


లాక్‌డౌన్‌ సమయంలో థియేటర్లు మూత పడడంతో మంచి వినోదాన్ని అందించగల వేదికలుగా ఓటీటీ మాధ్యమాలకు విశేష ఆదరణ లభించింది. జనం వీటికి అలవాటు పడడంతో  ఓటీటీలకు ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. ప్రస్తుతం ఓటీటీ వేదికల్లో  అమెజాన్‌ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి అంతర్జాతీయ సంస్థలు గుత్తాధిపతయం కొనసాగుతోంది. ప్రాంతీయ భాషల్లోనూ ఓటీటీ కంటెంట్‌కు డిమాండ్‌ పెరగడంతో ఈ రంగంలో క్రమంగా కొత్త సంస్థలు అడుగుపెడుతున్నాయి. తెలుగు నటులతో పాటు పలు చిత్రపరిశ్రమలకు చె ందిన అగ్రశ్రేణి తారాగణమూ ఈ వ్యాపారంలోకి అడుగుపెడుతోంది.


అల్లు వారి ఆహా

ఆహా ఓటీటీ తెలుగు వారి ఆదరణ పొందడంతో   కొత్తగా మరిన్ని  ఓటీటీ సంస్థల ఏర్పాటుకు మార్గం ఏర్పడింది.   మై హోమ్‌ సంస్థ  నిర్మాత అల్లు అరవింద్‌తో కలసి ఆహా ఓటీటీని ప్రారంభించింది.  ‘ఆహా’ ఓటీటీకి బాగా ప్రచారం చేసి, జనంలోకి తీసుకెళ్లడానికి  అల్లు అర్జున్‌ కీలకపాత్ర పోషించారు. ప్రచార చిత్రాల్లో నటించడం ద్వారా ఆహా ఓటీటీని వేగంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లగలిగారు. ఆహాలో ప్రత్యేకించి తెలుగు ప్రేక్షకులను ద ృష్టిలో ఉంచుకొని కంటెంట్‌ను రూపొందిస్తున్నారు. సినిమాలతో పాటు పలు జానర్లలో వెబ్‌సిరీస్‌లు, టాక్‌ షోలు, ఒరిజినల్‌ చిత్రాలు నిర్మించి విడుదల చేస్తున్నారు. 

సురేష్‌ ప్రొడక్షన్స్‌ సొంత ఓటీటీ

వెంకటేశ్‌, రానాలు టాలీవుడ్‌లో నటులుగా రాణిస్తున్నారు. వారి కుటుంబానికి చెందిన చిత్ర నిర్మాణ సంస్థ్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా త్వరలోనే ఓటీటీని ప్రారంభించబోతున్నట్టు నిర్మాత సురేష్‌బాబు ప్రకటించారు. ఇప్పటికే ఓటీటీ కోసం కంటెంట్‌ క్రియేట్‌ చేయడం ప్రారంభమైంది. త్వరలోనే ఈ ఓటీటీని లాంచ్‌ చేసే అవకాశం ఉంది. అప్పుడు రానా, వెంకటేశ్‌ ఓటీటీ ప్రచార కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం లేకపోదు.  

నమిత థియేటర్‌

హీరోలే కాదు పలువురు హీరోయిన్లు కూడా ఓటీటీ లను ప్రారంభించడంలో ముందున్నారు. ఒకప్పుడు తెలుగులో కథానాయికగా నటించిన నమిత ఇటీవలె తన సొంత ఓటీటీని ప్రారంభించారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రవి వర్మతో కలసి ‘నమిత థియేటర్‌’ పేరుతో ఓటీటీని లాంచ్‌ చేశారు. ‘‘కొత్తగా చిత్ర పరిశ్రమలోకి వచ్చే ఔత్సాహికులకు సాయపడాలనేది నా ఆలోచన. నటులు, దర్శకులు, కొత్త నిర్మాతల సినిమాలను మా ఓటీటీలో విడుదల చేస్తాం’’ అని నమిత చెప్పారు. 

షకీలా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌

శృంగార కథానాయికగా దక్షిణాదిన మంచి గుర్తింపు దక్కించుకున్నారు షకీలా. త్వరలోనే ఆమె తన సొంత ఓటీటీని ప్రారంభించనున్నారు. ఇప్పటికే చిత్మ నిర్మాణంలో ఉన్నారు షకీలా. సినిమాల విడుదల విషయంలో ఇబ్బందులు పడలేక సొంతంగా కె.ఆర్‌ డిజిటల్‌ ప్లెక్స్‌ పేరుతో ఓటీటీని ప్రారంభిస్తున్నట్టు ఆమె చెప్పారు. ప్రస్తుతం తెలుగులో ఆమె నిర్మిస్తున్న ‘అట్టర్‌ప్లాప్‌’, ‘రొమాంటిక్‌’ చిత్రాలను తన ఓటీటీ ద్వారా విడుదల చేయనున్నారు. 

ఆ ఓటీటీలు వస్తాయా?

తెలుగులో అగ్ర కథానాయకులైన నాగార్జున, మహేశ్‌బాబు కూడా సొంత ఓటీటీలను ప్రారంభించనున్నారని వార్తలొచ్చాయి. మహేశ్‌బాబు ఇప్పటికే జీఎంబీ ఎంటర్టైన్‌మెంట్‌ పతాకంపై సినిమాలు నిర్మిస్తున్నారు. ఏఎంబీ మల్లీప్లెక్స్‌ ద్వారా ప్రదర్శనరంగంలోకి కూడా  అడుగుపెట్టారు. తాజాగా ఆయన ఓటీటీ రంగంపై దృష్టి సారించారని సమాచారం. ముంబైకు చెందిన ఓ ప్రముఖ సంస్థతో  కలసి మహేశ్‌ బాబు ఓటీటీని ప్రారంభించనున్నారని వార్తలొచ్చాయి. ప్రాంతీయ భాషల్లో ఒరిజినల్‌ కంటెంట్‌ అందించాలనే ఆలోచనతో అడివి శేష్‌ కథానాయకుడిగా ఓటీటీ కోసం తొలి చిత్రం నిర్మించనున్నారని తెలిసింది.. అయితే దీనిపై మహేశ్‌ ఇప్పటిదాకా స్పందించలేదు. సొంత  నిర్మాణసంస్థలు ఉండడంతో వారికి ఓటీటీ ఏర్పాటు వల్ల ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. 

నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘వైల్డ్‌డాగ్‌’ థియేటర్లలో నిరాశపరిచినా ఓటీటీలో అనూహ్య ఆదరణ దక్కించుకుంది. కొన్ని రోజుల పాటు ట్రెండింగ్‌లో టాప్‌లో నిలిచింది. ఓటీటీలో ‘వైల్డ్‌డాగ్‌’కు దక్కిన ఆదరణ చూశాక నాగార్జున సొంతంగా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాలనుకున్నారని వార్తలొచ్చాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌ ద్వారా ఏటా అరడజనుకు పైగా చిత్రాలను ఓటీటీ కోసం నిర్మించే ఆలోచనలో నాగార్జున ఉన్నార ని సన్నిహిత వర్గాల కథనం. 

బాలీవుడ్‌లో 

పలువురు బాలీవుడ్‌ నటులు కూడా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు ప్రారంభించారు. కథానాయిక షెర్లిన్‌ చోప్రా. క్యాస్టింగ్‌ కౌచ్‌, సుశాంత్‌సింగ్‌ మృతి సమయంలో బాలీవుడ్‌ పెద్దలపై చేసిన  వివాదాస్పద వ్యాఖ్యాలతో ఆమె వార్తల్లో నిలిచారు. ఇటీవలె ఆమె రెడ్‌షేర్‌ పేరుతో తన సొంత ఓటీటీని ప్రారంభించారు. ఓటీటీ ద్వారా నేనే ఔత్సాహికులకు అవకాశాలు కల్పిస్తాను అని చెప్పారు. తానే నిర్మాతగా మారి వెబ్‌సిరీస్‌లు, షార్ట్‌ ఫిల్మ్స్‌  నిర్మిస్తున్నారు. అందుబాటు ధరలో నాణ్యమైన కంటెంట్‌ను ప్రేక్షకులకు చేరువ చేస్తామని లాంచింగ్‌ సమయంలో ఆమె చెప్పారు. 


బాలీవుడ్‌లో ‘ఓం శాంతి ఓం’, ‘హౌస్‌ఫుల్‌ 2’ తదితర చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శ్రేయాస్‌ తల్పాడే. దర్శకుడిగా, నిర్మాతగానూ మంచి విజయాలు అందుకున్నారు. తాజాగా ఆయన ‘నైన్‌-రస’ పేరుతో ఓటీటీని ప్రారంభించారు. దీనిద్వారా అంతగా డిమాండ్‌ లేని నాటకరంగానికి ప్రాచుర్యం కల్పించాలనేది ఆయన ఆలోచన.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.