గాలివాన బీభత్సం

Published: Sun, 15 May 2022 23:32:17 ISTfb-iconwhatsapp-icontwitter-icon
గాలివాన బీభత్సంభూత్పూర్‌ మండలం తాటికొండ నేహ్రూనగర్‌ శివారులో కూలిన ఇంటి గోడ

తడిసిన ధాన్యం

ఎగిరిపోయిన ఇళ్లపైకప్పు రేకులు

నేల రాలిన మామిడి కాయలు

నారాయణపేటలో పిడుగుపాటుకు కాడెద్దులు మృతి

విరిగిపడిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

పాలమూరులో మూడు గంటల పాటు నిలిచిన విద్యుత్‌ సరఫరా


అకాల వర్షం రైతులకు కష్టాలను తెచ్చిపెట్టింది. నష్టాన్ని మిగిల్చింది. మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసిపోయింది. మామిడి కాయలు నేల రాలాయి. ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ మండలం మగ్దుంపూర్‌లో శనివారం రాత్రి కురిసిన వర్షానికి పిడుగు పడి, రెండు కాడెద్దులు చనిపోయాయి.


మహబూబ్‌నగర్‌, మే 15: మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి నష్టం వాటిల్లింది. గాలి వీచి, వర్షం కురవడంతో చెట్లు విరిగిపోయాయి. రేకులు ఎగిరిపోయాయి. ట్రాన్స్‌ఫార్మర్‌లలో అంతరాయం ఏర్పడగా, విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. దాంతో పట్టణంలోని పలు కాలనీలలో సాయంత్రం 4:30 నుంచి 7:30 గంటల వరకు సరఫరా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ నెలలో అకాల వర్షం కురవడం ఇది మూడోసారి. అయితే వర్షాల వల్ల వాతావరణం చల్లబడగా, రైతులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మామిడి కాయలు నేల రాలడంతో పాటు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోతోందని వాపోతున్నారు. ఈ ఏడాది మామిడి దిగుబడి అంతంతమాత్రంగానే ఉండగా, గాలివానల వల్ల మరింత నష్టం వాటిల్లుతోంది.

గండీడ్‌: గండీడ్‌ మండలం సల్కర్‌పేట గ్రామ సమీపంలో ఓ రైతు పొలం వద్ద వర్షానికి విద్యుత్‌ స్తంభం ఒక పక్కకు ఒరిగిపోయింది. ఎప్పుడేం జరుగుతుందోనని రైతులు భయపడుతున్నారు. విద్యుత్‌ అధికారులు స్పందించి స్తంభాన్ని సరి చేయాలని కోరుతున్నారు.


వరి కుప్పల కిందికి చేరిన వర్షపు నీరు

హన్వాడ: మండలంలో ఆదివారం సాయంత్రం గాలి దుమారంతో వర్షం కురవడంతో బ్యాంక్‌ ముందు ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలోకి నీరు చేరింది. వరి కుప్పల కిందకు నీళ్లు చేరడంతో కొందరు రైతుల ధాన్యం తడిసిపోయింది. టంకర, బుద్దారం గ్రామాల్లో వడగండ్ల వాన కురి సింది. హన్వాడ, పెద్దదర్పల్లి, పిల్లిగుండు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురి సింది.


విరిగిన చెట్లు.. విద్యుత్‌ స్తంభాలు

భూత్పూర్‌: వర్షానికి భూత్పూర్‌ మండలంలో అపార నష్టం వాటిల్లింది. మండలంలోని తాటికొండ, నెహ్రునగర్‌ పరిసర ప్రాంతాల్లో కురిసిన గాలి వానతో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. హస్నాపూర్‌, శేరిపల్లి, పోతులమడుగు, మునిసి పాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌ తదితర గ్రామల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. వరి చేను నేల వాలింది. వర్షం రాత్రి వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.


ఎగిరిపోయిన రేకులు

బాలానగర్‌: మండలంలోని పెద్దరేవల్లి, చిన్నరేవల్లితో పాటు పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం వర్షం కురిసింది. పెద్దరేవల్లిలోని రైతు వేదిక వద్ద రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. వర్షానికి విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకు ఒరగగా, ఇండ్లు కూడా దెబ్బ తిన్నాయి.


ఒరిగిపోయిన ధ్వజస్తంభం

పెద్దమందడి: వనపర్తి జిల్లా పెద్దమందడిలో పడిన ఈదురు గాలులతో కూడిన వర్షానికి చెన్నకేశవస్వామి ఆలయంలో ధ్వజస్తంభం ఒరిగిపోయింది. కల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. మండలంలో ఇళ్లు, హోటళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలపై కప్పిన కవర్లు గాలికి ఎగిరిపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్‌ సరఫరా నిలిపేశారు.


నవాబ్‌పేటలో తడిసిన ధాన్యం

నవాబ్‌పేట: మండలంలో ఆదివారం సాయంత్రం యన్మన్‌గండ్ల, రుద్రారం, కారుకొండ, నవాబ్‌పేట, ఇప్పటూర్‌, కూచూర్‌ తదితర గ్రామాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రుద్రారంలో ఆరబోసిన ధాన్యం తడిసింది. కారుకొండలో వడగండ్ల వర్షం కురవడంతో చేతికొచ్చిన వరి పైరు నేలకొరిగింది. పలు గ్రామాల్లో ఈదురు గాలులకు విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.


నీటిపాలైన ధాన్యం

మిడ్జిల్‌: వర్షానికి మిడ్జిల్‌ మండలం కొత్తూర్‌, మల్లాపూర్‌, వెలుగొమ్ముల, అయ్యవారిపల్లి, చిల్వేరు, బోయిన్‌పల్లి, మిడ్జిల్‌, వాడ్యాల, వేములతో పాటు పలు గ్రామాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసింది. ఇప్పటికే వడ్లను ఆరబెట్టేందుకు కూలీల కోసం చాలా డబ్బు ఖర్చుపెట్టామని, మళ్లీ వారి కోసం డబ్బులు ఎక్కడి నుంచి రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్‌ కవర్లు లేకపోవడంతో ధాన్యం తడిసిపోయింది. మండల కేంద్రంలోని రాఘవేందర్‌కు చెందిన మామిడి తోటలో కోతకు వచ్చిన కాయలు నేల రాలాయి. అదే గ్రామానికి చెందిన పౌల్ర్టీ రైతు శేఖర్‌ షెడ్డు పైకప్పు రేకులు విరిగిపోయాయి. అధికారులు పరిశీలించి నష్టం నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 


పిడుగుపాటుకు కాడెద్దులు మృతి

ఊట్కూర్‌: ఊట్కూర్‌ మండలం మగ్దుంపూర్‌లో శనివారం రాత్రి చోటు కురిసిన ఉరుములు, మెరుపుల వానకు పిడుగు పడి రెండు కాడెద్దులు మృతి చెందాయి. రాత్రి ఎనిమిది గంటల నుంచి 9.30 గంటల వరకు భారీ వర్షం కురిసింది. అంతకు ముందు గంటపాటు దుమ్ము, దూళి వీచాయి. గ్రామానికి చెందిన రైతు పెంటమీది పటేలప్ప రోజూ మాదిరిగానే తన వ్యవసాయ పొలం వద్ద షెడ్డులో కాడెద్దులను కట్టేసి, సాయంత్రం ఇంటికి వచ్చాడు. రాత్రి ఉరుము మెరుపులతో వర్షం పడింది. పొలం వైపు పిడుగుపడిన శబ్దం వచ్చింది. ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా కాడ్డెలు మృతి చెందాయి. వ్యవసాయ పనుల కోసం తీసుకొచ్చిన రెండు ఎద్దులు మృతి చెందడంతో బోరున విలపించాడు. వాటి విలువ రూ.లక్ష ఉంటుందని తెలిపాడు. పశువైద్య అధికారి డాక్టర్‌ మహదేవ్‌ అక్కడికి చేరుకుని, పంచనామా నిర్వహించారు. అనంతరం పొలం వద్ద ఎద్దులను ఖననం చేశారు. పరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు. వర్షానికి తిప్రస్‌పల్లి సమీపంలో గల రైస్‌ మిల్లు వెనుక భాగం పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. వెనక భాగంలో ఉన్న ధాన్యం సంచులు తడిసిపోయాయి. గంట పాటు వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


నాగర్‌కర్నూల్‌లో 25 మిల్లీ మీటర్ల వర్షం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: జిల్లాలో ఆదివారం రాత్రి మోస్తారు వర్షం కురిసింది. నాగర్‌కర్నూల్‌, తెల్కపల్లి, పెద్దకొత్తపల్లి, కోడేరు మండల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నాగర్‌కర్నూల్‌ మండలంలో అత్యధికంగా 25 మిల్లీ మీటర్ల వర్షం పడింది. దీంతో జిల్లా కేంద్రంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. జిల్లాలో ఆదివారం కల్వకుర్తి మండలంలో గరిష్ఠంగా 41.8 డిగ్రీల ఉష్ణాగ్రత నమోదైంది.

గాలివాన బీభత్సంపెద్దమందడి చెన్నకేశవ ఆలయంలో విరిగిపడిన ధ్వజస్తంభం


గాలివాన బీభత్సంకొత్తూర్‌, మల్లాపూర్‌ గ్రామాల మధ్య వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యం


గాలివాన బీభత్సంమిడ్జిల్‌లో గాలి వానకు విరిగి పడిన ఫౌల్ర్టీ షెడ్డు రేకులు


గాలివాన బీభత్సంమిడ్జిల్‌లో నేల రాలిన మామిడి


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.