మీ టూర్‌ను ఇలా ప్లాన్ చేసుకోండి..

Published: Sat, 20 Mar 2021 16:15:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మీ టూర్‌ను ఇలా ప్లాన్ చేసుకోండి..

కోవిడ్‌–19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభించడంతో అధికశాతం ప్రయాణాలు మరీ ముఖ్యంగా విహారయాత్రలకు విరామం వచ్చింది. అలాగని ఎవరూ తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని మాత్రం అనుకోవడం లేదు. బోట్‌ ట్రావెల్‌ సెంటిమెంట్‌ ట్రాకర్‌ వెల్లడించే దాని ప్రకారం 63% మంది భారతీయులు కోవిడ్‌–19 ఉధృతి తగ్గిన తరువాత తమ ప్రయాణాలు కొనసాగించాలని కోరుకుంటున్నారు. అంతేనా 66% మంది అంతర్జాతీయ పర్యాటక ద్వారాలు తెరిచిన 3–6 నెలల్లోపే తమకిష్టమైన ప్రదేశాలు చుట్టొచ్చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.


యాత్రికుల వరకూ చూసుకుంటే, కోవిడ్‌–19 లాక్‌డౌన్స్‌ తరువాత హాలీడే డెస్టినేషన్స్‌ అంటే ఉన్న భావన మారిపోయింది. విమానయానం పట్ల ఆప్రమప్తత పెరగడంతో పాటుగా సురక్షిత, నమ్మకమైన ప్రాంతాలు, పరిశుభ్రత పట్ల ఆందోళనలు కూడా పెరిగాయి. పర్యాటక రంగం సైతం ఇప్పుడు కాంటాక్ట్‌లెస్‌ విధానం అనుసరిస్తుంది. ఈ కోణంలో తమ ప్రయాణాలను వైవిధ్యంగా యాత్రికులు ఏ విధంగా ప్రణాళిక చేసుకోవచ్చంటే..


1. ఖచ్చితమైన ప్రణాళిక:

లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా ఆలోచన వచ్చిందే తడవుగా గతంలో యాత్రలు చేసేవారు చాలామంది. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. ఇప్పుడు తాము ఎక్కడ బస చేయబోతున్నాం, ఎక్కడకు వెళ్లబోతున్నాం, ఏం తింటున్నామనే అంశాలు అతి ముఖ్యంగా మారిపోయాయి.  తాము బస చేయనున్న వసతి లేదంటే ప్రయాణించే మార్గాలలో ఎలాంటి కేసులు లేకుండా ఉన్నాయన్న భరోసాను  వీరు కల్పించుకోవాలి.


2. ప్రత్యేకమైన అనుభవాలుగా మార్చుకోండి:

బడ్జెట్‌ ట్రిప్స్‌లో చౌక ధరల విమానాలు, హాస్టళ్లు, హోమ్‌ స్టేస్‌, గ్రూప్‌ టూర్లు, ప్రజా రవాణా మరియు మరెన్నో భాగంగా ఉంటాయి. అయితే, ఇప్పుడు భౌతిక  దూరం తప్పనిసరి కావడంతో మరింత ప్రత్యేకమైన అనుభవాలను కోరుకుంటున్నారు. సోలో/చిన్న గ్రూప్‌ ట్రిప్పులు ఇప్పుడు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇతరులతో పంచుకోవడం మరీ ముఖ్యంగా అపరిచితులతో పంచుకోవడాన్ని నిరోధించడంలో సహాయపడే మార్గాలనే ఇప్పుడు చూస్తున్నారు. థామస్‌ కుక్‌తో పాటుగా ఎస్‌ఓటీసీ హాలీడే రెడినెస్‌ అధ్యయనం ప్రకారం 72% మంది స్పందనదారులు ఇప్పుడు తమ యాత్రల కోసం పేరొందిన సంస్థల సేవలనే వినియోగించుకుంటున్నారు. అదే సమయంలో 35% మంది ఆరోగ్యం, భద్రత అంశాల పట్ల అధికంగా ఖర్చు చేయడానికీ చూస్తున్నారు.


3. సెకండ్‌ సిటీ ట్రావెల్:

ప్రతి దేశంలోనూ దర్శనీయ ప్రాంతాలు ఎన్నో ఉంటాయి. అందరూ ఆ ప్రాంతాలను చూడటానికి ఎక్కువ ఆసక్తి కనబర్చడం సాధారణంగా జరిగేదే ! అయితే కరోనా వచ్చిన తరువాత ఈ ప్రాచుర్యం పొందిన ప్రాంగణాలకు  ఆదరణ తగ్గింది. అదే సమయంలో ద్వితీయ ప్రాధాన్యత కలిగిన నగరాలకు డిమాండ్‌ పెరుగుతుంది. దీనివల్ల పర్యావరణ ప్రభావం తక్కువ కావడంతో పాటుగా ఒకే ప్రాంతంపై భారం పడటం కూడా తగ్గుతుంది.


4. డిజిటలీకరించిన ట్రావెల్‌ ప్రణాళికలు:

ట్రావెల్‌ పరిశ్రమ ఇప్పుడు వ్యాపార కార్యకలాపాలను డిజిటలైజింగ్‌ చేయడం కోసం మరింత శ్రద్ధ చూపుతుంది. ప్రయాణ ప్రణాళికలు మొదలు వీసా దరఖాస్తుల వరకూ, ఎయిర్‌పోర్ట్స్‌మొదలు హోటల్స్‌ వరకూ ప్రతి చోటా సంపూర్ణంగా డిజిటల్‌ పరిష్కారాల దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ప్లానర్స్‌, డోర్‌స్టెప్‌ వీసా సేవలు, ఈవీసా సేవలు, సెల్ఫ్‌ చెక్‌ ఇన్‌ కియోస్క్‌లు వంటివి సాధారణం కానున్నాయి.


5. నూతన ప్రయాణ శిఖరం:

ట్రావెల్‌ కంపెనీలు, పర్యాటక బోర్డులకు సాధారణంగా 60–65% వ్యాపారం సమ్మర్‌ హాలీడేస్‌ ద్వారానే జరుగుతుంది. 2020లో దురదృష్టవశాత్తు ఈ వ్యాపారం కోల్పోయాయి. కానీ ఈ సంవత్సరంలో మరలా అది కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. అంతర్జాతీయ సరిహద్దులు సుదూర ప్రయాణాల కోసం తెరిచినప్పుడు ప్రజలు మరలా ప్రయాణించడం సురక్షితమని భావిస్తున్నారు. చివరి నిమిషంలో ప్రయాణ ప్రణాళికలు చేసుకునే వారు ఇకపై కాస్త ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలు చేసుకోవడం మంచిది.


ప్రస్తుతం సంక్షోభం యాత్రా కలలపై నీలి మేఘాలు కమ్ముకునేలా చేసింది. కానీ ఈ ప్రపంచం త్వరలోనే తమ ప్రయాణాలను తిరిగి ఆరంభించనుంది. కాకపోతే, ఈ యాత్రల వాతావరణం మాత్రం ఖచ్చితంగా మారుతుంది. ప్రజా ఆరోగ్యం, మారుతున్న డిజిటల్‌, సుస్థిర ప్రమాణాలు వంటివి ఆహ్లాదకరమైన, సురక్షితమైన మరియు మరింత స్థిరమైన భవిష్యత్‌ దిశగా వెళ్లేందుకు పరిశ్రమకు తోడ్పడుతుంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకం Latest News in Teluguమరిన్ని...

ఓపెన్ హార్ట్Latest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.