అంపశయ్యపై టూరిజం రిసార్టు

ABN , First Publish Date - 2022-05-24T08:12:45+05:30 IST

శ్రీకాళహస్తి పట్టణ శివారులోని మిట్టకండ్రిగ వద్ద ఒకనాడు యాత్రికులతో కళకళలాడిన ఏపీ టూరిజం రిసార్టు దుస్థితిలో దర్శనమిస్తోంది.

అంపశయ్యపై టూరిజం రిసార్టు
ఏపీ టూరిజం రిసార్టు

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో దివాళాదిశగా పర్యాటక వ్యవస్థ 

హస్తకళల కేంద్రానికీ తప్పని చేటు

శ్రీకాళహస్తి, మే 23 :  శ్రీకాళహస్తి పట్టణ శివారులోని మిట్టకండ్రిగ వద్ద ఒకనాడు యాత్రికులతో కళకళలాడిన ఏపీ టూరిజం రిసార్టు దుస్థితిలో దర్శనమిస్తోంది. ఇక్కడ హరిత హోటల్‌ పేరుతో విస్తారమైన ప్రదేశంలో రిసార్టు ఉంది.రెండేళ్ల క్రితం వరకు కుటుంబ సమేతంగా యాత్రికులు ఎంతో ఆనందంగా ఇక్కడ గడిపేవారు. రాష్ట్ర ప్రభుత్వం  రిసార్టులో బార్‌ను ప్రారంభించింది.హోటల్‌కు ఆనుకునే బార్‌ను ప్రారంభించారు.నిత్యం ఘర్షణలు మొదలయ్యాయి. ఇలా జరుగుతుండగా రెండేళ్ల క్రితం కరోనా వ్యాప్తితో లాక్‌డౌన్‌ కారణంగా రిసార్టు కొద్ది నెలల పాటు మూతబడింది. గత యేడాది ఆగస్టు నుంచి హోటల్‌ వద్ద మద్యం దుకాణాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించింది. హోటల్‌కు ఆనుకుని కుడివైపు మద్యం దుకాణం, ఎడమవైపు బార్‌ నడుస్తున్నాయి. గత ఏడాది ఆగస్టు వరకు రిసార్ట్‌కు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో కలిపి సుమారు 35 బస్సులు వచ్చేవి. రోజు మొత్తం మీద 1200 నుంచి 1500మంది యాత్రికులు టూరిజం హోటల్‌కు వచ్చేవారు.ఇక్కడి ఆహ్లాదకర వాతావరణం కారణంగా వున్న 26 గదులూ నిండిపోయేవి.ఒక్కోసారి వెయిటింగ్‌ లిస్టులో ఉండాల్సిన పరిస్థితి ఎదురయ్యేది.మద్యం దుకాణం ప్రారంభమయ్యాక బస్సుల్లో నుంచి దిగిన యాత్రికుల్లో మందుబాబులు మద్యం దుకాణం, బారులో దూరిపోయేవారు. మద్యం దుకాణానికి, బార్‌కు మద్యం ధరలపరంగా వ్యత్యాసం ఉంటుంది. మద్యం దుకాణంలో సీసాలు కొన్న కొందరు బారులో ప్రవేశించడానికి ప్రయత్నించి అడ్డుకున్న సిబ్బందితో ఘర్షణకు దిగేవారు.మరికొంతమంది దుకాణాల్లో కొనుగోలు చేసిన మద్యాన్ని రిసార్టు ఆవరణలో వద్ద ఎక్కడ పడితే అక్కడ బైఠాయించి పగలూరాత్రీ తేడా లేకుండా తాగేవారు. శ్రీకాళహస్తి పట్టణ శివారులో జాతీయ రహదారికి ఆనుకుని రిసార్టు ఉండడంతో బస్సుల్లో వచ్చేవారితో పాటు చాలామంది ఇక్కడ ఆగి భోంచేసేవారు. మందుబాబుల ఆగడాలు చూసి రహదారి పైనుంచి వచ్చే వాహనాలు నిలిచిపోయాయి.బస్సు ప్రయాణికుల్లో మద్యం సేవించిన వారు ప్రయాణ మార్గంలో బస్సుల్లో తీవ్ర ఘర్షణలకు దిగిన ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. వీరి చేష్టలతో బస్సుల్లో మహిళలు, పిల్లలు అల్లాడిపోవాల్సి వచ్చింది.దీంతో ఆర్టీసీ బస్సులను రిసార్టు వద్ద నిలపడం క్రమేపీ తగ్గిపోయింది. ఆగస్టు వరకు ఆర్టీసీ నుంచి 30, ఏపీ టూరిజం నుంచి ఐదు బస్సులు వచ్చేవి. వారాంతపు రోజులు, సెలవు దినాల్లో మరికొన్ని బస్సులు రద్దీని బట్టి ఆదనంగా వస్తుండేవి. మద్యం దుకాణం ఏర్పాటుతో ప్రతికూల పరిస్థితులు క్రమంగా పెరగడంతో బస్సుల రాకపోకలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో ఆర్టీసీ నుంచి ప్రస్తుతం రోజుకు నాలుగు బస్సులు, ఏపీ టూరిజం నుంచి నాలుగు బస్సులు మాత్రమే ఇక్కడికి వస్తున్నాయి. రోజుకు 300మంది యాత్రికులు మాత్రమే ఇక్కడకు వస్తున్నారు.ఇక్కడున్న 26గదుల్లో ప్రస్తుతం రోజుకు రెండు, మూడుకు మించి బుక్‌ కానటువంటి దుస్థితి నెలకొంది.మద్యం దుకాణం, బార్‌ వద్ద మందుబాబులు తిష్ట వేస్తుండడంతో యాత్రికులు కొన్ని సందర్భాల్లో బస్సు దిగకుండా అటునుంచి అటే వెళ్లిపోయిన సందర్భాలు వున్నాయి.బారుకు మద్యం సరఫరా సక్రమంగా లేకపోవడంతో  కొందరు మద్యం దుకాణాల్లో కొనుగోలు చేసిన మందును బారులో సేవించాలంటూ గొడవలకు దిగుతున్నారు.ఈ రెండు నెలల కాలంలో ఐదు సార్లు ఏపీ టూరిజం సిబ్బందిపై మందుబాబులు దాడులకు పాల్పడ్డారు.ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడినప్పటికీ కేసులు కూడా నమోదు చేయలేదు. ఇక సాయంత్రం అయ్యేసరికి శ్రీకాళహస్తి పట్టణంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన వారు పెద్దసంఖ్యలో ఏపీ టూరిజం  వద్ద ఉన్న మద్యం దుకాణం  వద్దకు చేరుకుంటున్నారు. మద్యం కొనుగోలు చేసినవారు ఆరుబయటే తిష్టవేస్తున్నారు.ప్రశ్నించినవారిపై దాడులకు పాల్పడుతున్నారు.కొందరు ఆకతాయిలు మద్యం సేవించి నగదు చెల్లించకుండా వెళ్లిపోతున్నారు. అడిగితే సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడుతున్నారు. ఇలా ఆగస్టు నుంచి ఇప్పటి వరకు సిబ్బంది ఏడుసార్లు తమ సొంత డబ్బు ప్రభుత్వానికి చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం.దీంతో రహదారులపైనుంచే మందుబాబులను చూసిన వారు మరోసారి ఇటువైపు కన్నెత్తి చూడకుండా పారిపోతున్నారు.హోటల్‌ వెలవెలబోతుండడంతో గదులు ఖాళీగా ఉండిపోతున్నాయి.టూరిజం ప్రాంగణంలోనే గ్రామీణ హస్తకళల కేంద్రం వుంది. ఇక్కడ హస్తకళల వస్తువులను యాత్రికులతో పాటు జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే ప్రజలు బాగా కొనుగోలు చేసేవారు. ఏపీ టూరిజం వద్ద భయానక వాతావరణంతో హస్తకళల కేంద్రంవైపు కాలు పెట్టేవారు కరువయ్యారు. గత ప్రభుత్వం ఏపీ టూరిజం ప్రాంగణంలో పిల్లలు ఆడుకునేందుకు  పలు రకాల ఆట వస్తువులను ఏర్పాటు చేసింది.పిల్లలు అక్కడ ఆడుకుంటుంటే పెద్దవాళ్లు సేద దీరేవారు. సెల్ఫీలు, వీడియోలతో పండుగ వాతావరణం కన్పించేది.అలాంటి ఆ ప్రాంతమంతా ఇప్పుడు వెలవెలబోతూ కన్పిస్తోంది.మొత్తంగా ఒక అనాలోచిత నిర్ణయం వ్యవస్థనే నిర్వీర్యం చేస్తోంది.

Updated Date - 2022-05-24T08:12:45+05:30 IST