శ్రీలంకలో నిలిచిపోయిన ఐపీఎల్ ప్రసారాలు

ABN , First Publish Date - 2022-04-05T23:55:10+05:30 IST

ఐపీఎల్‌లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి.

శ్రీలంకలో నిలిచిపోయిన ఐపీఎల్ ప్రసారాలు

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ వంటి కొత్త జట్లు సహా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లు అద్భుత ప్రదర్శనతో పాయింట్లు కొల్లగొడుతుంటే.. ఐపీఎల్ టోర్నీలను పలుమార్లు సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తోపాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఖాతా తెరిచేందుకే నానా పాట్లు పడుతున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, డిల్లీ కేపిటల్స్ జట్లూ అంతంత మాత్రంగానే ఆడుతున్నాయి.


రెండు నెలలపాటు సాగనున్న ఈ టోర్నీ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతోంది. ఒక్క టీవీల్లోనే కాదు రేడియోతోపాటు వివిధ లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మ్యాచ్‌లను వీక్షిస్తుంటే శ్రీలంకకు మాత్రం ఆ అదృష్టం లేకపోయింది. ఆర్థిక సంక్షోభంతో ప్రస్తుతం ఆ దేశం అతలాకుతలమవుతోంది. పరిస్థితులు అక్కడ రోజురోజుకు మరింత దుర్భరంగా మారుతున్నాయి.


రోజువారీ జీవనానికి కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభావం ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్‌పైనా పడింది. దేశంలోని రెండు ప్రముఖ పత్రికలు కూడా ఐపీఎల్ వార్తలను ప్రచురించడం లేదు. న్యూస్‌ప్రింట్ ధరలు భారీ పెరగడం, ప్రింటింగ్ ఖర్చులు కూడా రాకపోవడమే దీనికి కారణం. వీలున్నప్పుడు మాత్రం ఆన్‌లైన్ ఎడిషన్‌లో ఐపీఎల్ అప్‌డేట్స్ ఇస్తున్నాయి. సంక్షోభం కారణంగా పలు టీవీ చానళ్లు ఇప్పటికే మూతపడ్డాయి. ఐపీఎల్‌ ప్రసార హక్కుల కోసం శ్రీలంక క్రికెట్‌ అభిమానులు, స్థానిక ఛానళ్లు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ టోర్నీని ప్రసారం చేయలేని దుస్థితిలో దేశ ఆర్థిక పరిస్థితి నెలకొంది.  

Updated Date - 2022-04-05T23:55:10+05:30 IST