భూనిర్వాసితులకు ఉపాధి దిశగా..

Jun 16 2021 @ 23:42PM
ములుగు మండలం తునికిబొల్లారం వద్ద పరిశ్రమల కోసం సేకరించిన భూమి

 మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ ముంపు బాధితుల కోసం పరిశ్రమల ఏర్పాటు

 గజ్వేల్‌ నియోజకవర్గంలో దాదాపు  వెయ్యి ఎకరాల భూసేకరణ

 ఫుడ్‌ ప్రాసెసింగ్‌, సీడ్‌, కాలుష్యరహిత పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు


గజ్వేల్‌, జూన్‌ 16: భూనిర్వాసితులకు ఉపాధి దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్లలో భూములు, గ్రామాలు మునిగిపోవడంతో కోల్పోయి ఉపాధి కోల్పోయిన భూ నిర్వాసితులకు అండగా నిలవాలని ప్రభుత్వం భావిస్తున్నది. గజ్వేల్‌ నియోజకవర్గంలోని ములుగు, వర్గల్‌, గజ్వేల్‌ మండలాల పరిధిలో దాదాపుగా వెయ్యి ఎకరాలను సేకరిస్తున్నది. గ్రామాలకు దగ్గరలో ఉండడంతో కాలుష్యరహిత పరిశ్రమలతో పాటు ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు, విత్తనపరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ములుగు మండలంలోని బండ తిమ్మాపూర్‌, బండమైలారం, తునికిబొల్లారం, కొత్తూరు, ములుగు మండల కేంద్రంలోని భూములను సేకరిస్తున్నది. అంతేకాకుండా వర్గల్‌ మండల కేంద్రంతో పాటు గజ్వేల్‌ మండల పరిధిలోని బంగ్లావెంకటాపూర్‌, మక్తమాసాన్‌పల్లి, జాలిగామ, బయ్యారం, గజ్వేల్‌, పిడిచెడ్‌ గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూములను గుర్తించి, భూసేకరణ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌లలో భూములు కోల్పోవడంతో పాటు ఉపాధిని కోల్పోయిన యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. 


 ములుగు మండలంలో టీఎ్‌సఐఐసీ ఆధ్వర్యంలో సీడ్‌పార్కు ఏర్పాటు

ములుగు మండల పరిధిలోని బండతిమ్మాపూర్‌ పరిధిలోని 156 ఎకరాలు, బండమైలారం పరిధిలోని 127 ఎకరాల్లో ఇప్పటికే టీఎ్‌సఐఐసీ ఆధ్వర్యంలో సీడ్‌ పార్కును ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ సీడ్‌ పార్కులో ఇప్పటికే పలు పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా మరిన్ని పరిశ్రమలకు స్థలాలను కేటాయించారు. ఈ పరిశ్రమలు మరో ఆరు నెలల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. వీటితో పాటు తునికిబొల్లారం రెవెన్యూ గ్రామ పరిధిలో కొండపోచమ్మ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీని ఆనుకుని ఉన్న 397 ఎకరాల భూమిని అధికారులు ఇప్పటికే సేకరించారు. ఈ భూమిలో లేఅవుట్‌ పనులు ప్రారంభమయ్యాయి. మరో 37 ఎకరాలను సేకరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ భూమిని టీఎ్‌సఐఐసీకి అప్పగించనున్నారు. కొత్తూరు రెవెన్యూ గ్రామ పరిధిలో 236 ఎకరాల భూమిని పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం సేకరించి, టీఎ్‌సఐఐసీ అప్పగించింది. అంతేకాకుండా ములుగు మండల కేంద్రం, నాగిరెడ్డిపల్లి గ్రామాల మధ్యన ఉన్న 325 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.  వర్గల్‌ మండల కేంద్రంలో మరో 600 ఎకరాల భూమిని సేకరించి మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఇక గజ్వేల్‌ మండల పరిధిలోని బంగ్లావెంకటాపూర్‌, మక్తమాసాన్‌పల్లి, బయ్యారం, జాలిగామ, గజ్వేల్‌, పిడిచెడ్‌ రెవెన్యూ గ్రామాల పరిధిలోని మరో 600 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. రైల్వేకు అనుసంధానంగా పలు పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. 

Follow Us on: