పట్టుదలతో విజయం వైపు...

ABN , First Publish Date - 2022-05-23T07:17:24+05:30 IST

‘‘మహిళలు స్వశక్తితో ఎదగాలి. నలుగురికి స్ఫూర్తినిచ్చేలా నిలవాలి అనేది నా అభిమతం. మా అమ్మ గృహిణి. నాన్న వ్యవసాయం చేసేవారు.

పట్టుదలతో విజయం వైపు...

ఆమెది వ్యవసాయ కుటుంబం. వ్యాపారరంగంలో అనుభవం ఉన్న వారు కూడా ఎవరూ లేరు. 

అయితేనేం... వ్యాపారవేత్తగా రాణించాలన్న తన కలను పట్టుదలతో నెరవేర్చుకున్నారు. 

జియోబస్‌ పేరుతో వెబ్‌సైట్‌ని ప్రారంభించి, 

కొద్దికాలంలోనే వినియోగదారుల మనసు గెలుచుకున్నారు గుంటూరు జిల్లా కాకుమానుకు చెందిన కె.సుస్మిత. ఆమె జీవనప్రయాణానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఆమె మాటల్లోనే....


‘‘మహిళలు స్వశక్తితో ఎదగాలి. నలుగురికి స్ఫూర్తినిచ్చేలా నిలవాలి అనేది నా అభిమతం. మా అమ్మ గృహిణి. నాన్న వ్యవసాయం చేసేవారు. మా కుటుంబంలో బిజినె్‌సలోకి మొదట అడుగుపెట్టింది నేనే. గుంటూరు జిల్లాలోనే నా చదువంతా సాగింది. కాలేజీ రోజుల్లోనే సొంతంగా స్టార్టప్‌ పెట్టాలని ఆలోచన ఉండేది. పెళ్లయ్యాక కొద్దిరోజులు కుటుంబ బాధ్యతల మూలంగా కుదరలేదు. కానీ వ్యాపారవేత్తగా రాణించాలన్న కోరిక మాత్రం పోలేదు. పెళ్లయ్యాక హైదరాబాద్‌కు మారిపోయాం. తరువాత నా మనసులో మాటను మావారితో పంచుకున్నా. ఆయన వెంటనే ఓకే చెప్పారు. మా వారి పేరు శ్రీనివాసరావు. ఆయన శ్రీచైతన్య విద్యాసంస్థల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఇక నా వెన్నంటి ఉండి, పోర్టల్‌కు శ్రీకారం చుట్టేలా చేయడంలో మా బ్రదర్‌ మురళీకృష్ణ సహకారం మరువలేను. తను సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. నేను ఏదైనా బిజినెస్‌ ప్రారంభించాలని అనుకుంటున్నానని చెప్పినప్పుడు ఎంతో ఎంకరేజ్‌ చేశారు. ‘తప్పకుండా సక్సెస్‌ అవుతావు. నానుంచి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాను’ అని వెన్నుతట్టి ప్రోత్సహించారు. నాకోసం తను బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయ్యారు. మావారి, బ్రదర్‌ సహకారమైతే లభించింది కానీ ఏ బిజినెస్‌ ప్రారంభించాలో అర్థం కాలేదు. ఏదైతే బాగుంటుందో బాగా స్టడీ చేశా. తరుచుగా ట్రావెల్‌ చేసే వారికోసం అన్ని సదుపాయాలు ఒకే చోట అందించే వెబ్‌సైట్‌ ఏదీ లేదని గుర్తించా. ఆ ఆలోచనల్లో నుంచి పుట్టిందే ఈ జియోబస్‌.


అన్ని సదుపాయాలు ఒకే చోట...

వెబ్‌సైట్‌కి జియోబస్‌ అని పేరెందుకు పెట్టామంటే బస్‌ అనే పదం అందరికీ సుపరిచితం. ఇక జియో ఎంత పాపులరో తెలిసిందే. అప్పటికే మార్కెట్లో అబీబస్‌, రెడ్‌బస్‌ వంటివి ఉన్నాయి. వాటినుంచి ఎదురయ్యే పోటీని తట్టుకుని నిలబడాలి అంటే పేరు కూడా క్యాచీగా ఉండాలి. అందుకే జియోబస్‌ అని పెట్టాం. 2018 జూలైలో మా వెబ్‌సైట్‌ని ప్రారంభించాం. బస్సులు, ఫ్లైట్‌లు, హోటల్స్‌, క్యాబ్స్‌, మొబైల్‌ రీచార్జ్‌ వంటి సదుపాయాలతో వెబ్‌సైట్‌ని అందుబాటులోకి తెచ్చాం. ఇతర పోటీ వెబ్‌సైట్లతో పోలిస్తే మా పోర్టల్‌లో సదుపాయాలన్నీ ఒకేచోట లభిస్తాయి. ఇతర పోర్టల్స్‌లో బస్సు బుకింగ్‌ సదుపాయాలు మాత్రమే ఉన్నాయి. కొన్ని వెబ్‌సైట్లలో అన్ని సదుపాయాలున్నా, అవి ఉత్తరాదికి చెందినవి. దక్షిణ భారతదేశంలో అన్ని రకాల బుకింగ్‌ సదుపాయాలను అందిస్తున్న మొట్టమొదటి పోర్టల్‌ మాదే.  ఈవిషయంలో నేను గర్వంగా ఫీలవుతాను. మరో విషయమేమిటంటే హాలిడే ప్యాకేజీలను కూడా మా పోర్టల్‌లో అందిస్తున్నాం. 


గట్టి పోటీ ఉన్నా...

వెబ్‌సైట్‌ ప్రారంభించిన తొలినాళ్లలో గట్టిపోటీ ఎదురయింది. ట్రావెలింగ్‌ ఏజెంట్స్‌ దగ్గరకు వెళ్లి అప్పటికే మార్కెట్లో ఉన్న వారి కన్నా బెటర్‌గా ఏమివ్వగలుగుతామో వివరించాల్సి వచ్చేది. బస్సు బుక్‌ చేసుకున్న ప్రయాణికుడు, మా పోర్టల్‌లోనే హోటల్‌, క్యాబ్‌ బుక్‌ చేసుకునే సదుపాయం ఉంది. ఇది ఏజెంట్స్‌ను బాగా ఆకట్టుకుంది. నెమ్మదిగా పోర్టల్‌కు ఆదరణ పెరిగింది. కొవిడ్‌ లేకుంటే ఇంకా మంచి స్థాయిలో ఉండేది. కొవిడ్‌ ప్రభావం పర్యాటకరంగంపైనే ఎక్కువగా పడింది. ఇప్పుడిప్పుడే మార్కెట్‌ మళ్లీ పుంజుకుంటోంది. 


నా లక్ష్యం

వెబ్‌సైట్‌ని విస్తరించాలి, ఇంకా మెరుగ్గా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నా. త్వరలోనే యాప్‌ని అందుబాటులోకి తీసుకొస్తాం. ఇంకా కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టాలని ఆలోచన ఉంది. ఖాళీ సమయం దొరికితే బుక్స్‌ చదువుతా. స్నేహితులను కలుస్తుంటా. వాళ్లతో కలిసి మాట్లాడుతున్నప్పుడే కొత్తకొత్త ఐడియాలు పుడుతుంటాయి. యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌తో మాట్లాడుతుంటా. వాళ్ల అనుభవాలు తెలుసుకుంటా.’’

Updated Date - 2022-05-23T07:17:24+05:30 IST